‘వైద్యం వ్యాపారం కాకూడదు.. అది మానవ సంక్షేమానికి పునాది కావాలి’.. ‘ప్రతి మెడిసిన్ మనిషి కోసం తయారు కావాలి. కానీ మనుషులను బలితీసుకోవద్దు’.. మెడికల్ ఎథిక్స్‌లో భాగంగా ప్రముఖ అంతర్జాతీయ వైద్య నిపుణులు చేసే వ్యాఖ్యలివి. కానీ వాస్తవంలో దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతున్నది. ప్రతి దేశంలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. ఇటీవల కరీంనగర్‌లో వెలుగుచూసిన ఘటన తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. వైద్యశిబిరాల పేరుతో మెడికల్ క్లినికల్ ట్రయల్స్ మాఫియా అమాయకులను టార్గెట్‌గా చేసుకుని ప్రయోగాలు చేస్తూ.. వారి ప్రాణాలతో చెలగాటమాడుతుండడం ఆందోళనకు గురిచేస్తున్నది. ఇలాంటి వాటిని నియంత్రిం చడంలో డీసీజీఐ వంటి సంస్థలు విఫలమవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఏదైనా ఔషధానికి సంబంధించి ట్రయల్స్‌ను ముందుగా జంతువులపై చేస్తారు. సక్సెస్ అయితే.. ఆ తర్వాత తగిన పరిహార హామీతో, రోగి అంగీకారాన్ని తీసుకుని కఠిన నిబంధనలను అనుసరించి మనుషులపై చేస్తారు. అయితే అలాంటిదేమీ చేయకుండానే వైద్య శిబిరాలు, ఆర్థిక సాయం వంటి వాటితో మెడికల్ మాఫియా పేదలను టార్గెట్‌గా చేసుకొని డైరెక్ట్‌గా మనుషులపైనే ఔషధ ప్రయోగాలను అక్రమంగా, రహస్యంగా చేస్తున్నట్టు తెలుస్తున్నది. గతంలో కరీంనగర్‌లోని కొత్తపల్లికి చెందిన కొందరు యువకులు ఔషధ ప్రయోగాల్లో పాల్గ్గొని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరు మతిస్థిమితం కోల్పోయినట్టు అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అంశం 2017లో సంచలనం సృష్టించింది. తాజాగా కూడా ఓవ్యక్తి తనపై ఔషధ ప్రయోగాలు చేశారని పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. క్లినికల్ ట్రయల్స్ ద్వారా ఔషధాలు, టీకాలు కనుగొనడం మానవాళికి మేలుచేసినా, నైతిక నియమాలు పాటించకుండా చేసిన ప్రయోగాలు ఎంతో ప్రాణనష్టాన్ని, వైకల్యాలను మిగులుస్తాయి.2006లో లండన్‌లో ఆరుగురు ఆరోగ్యకరమైన వాలంటీర్లకు యాంటీబాడీ డ్రగ్ ఇచ్చిన కొన్ని నిమిషాల్లోనే వారి రోగనిరోధక వ్యవస్థను నాశనమైంది. వీరంతా బతికినా, తీవ్రమైన శారీరక వైకల్యం, అవయవాల వైఫల్యానికి గురయ్యారు. 2016లో ఫ్రాన్స్‌లో జరిగిన న్యూరో డిసార్డర్ డ్రగ్ ట్రయల్‌లో ఆరుగురు వాలంటీర్లలో ఒకరు మరణించగా, మిగిలిన ఐదుగురు మెదడు సంబం ధిత రోగాలకు గురయ్యారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది వేలాది మంది మరణిస్తూనే ఉన్నారు.
భారతదేశం గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్ రాజధానిగా మారుతున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. తక్కువ ఖర్చు, అధిక సంఖ్యలో పేద జనాభా, తగినంత అవగాహన లేమి దీనికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. సెం ట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీఓ) డేటా ప్రకారం 2021 నుంచి 2025 జులై వరకు దేశ వ్యాప్తంగా 1,705 మంది క్లినికల్ ట్రయల్స్‌లో మరణించారు. ఇది రోజుకు ఒక మర ణానికి సమానం. అంతేకాకుండా ఏడువేల మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురికాగా, చాలా మందిశాశ్వత వికలాంగులుగా మారారు. 2005 నుంచి 2012 మధ్య కాలంలో 2600 మందికిపైగా మరణించారు. సుమారు 12 వేల మంది తీవ్రమైన దుష్ప్రభావాలకు గురయ్యారు. వీటిలో 80 మరణాలు, 500కు పైగా తీవ్ర దుష్ప్రభావాలు నేరుగా మనుషులపై ఔషధాలు ప్రయోగించడం కారణంగానే జరిగాయని తేలింది. 2005-2013 వరకు 2644 మంది మరణించగా, ఇందులో కేవలం17 మందికి మాత్రమే పరిహారం అందింది. 2010లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 24 వేల మంది బాలికలపై హెచ్ పీవీ వ్యాక్సిన్ ట్రయల్స్ జరగ్గా.. ఏడుగురు మరణించడం తీవ్ర వివాదానికి దారితీసింది. తల్లిదండ్రుల నుంచి సమ్మతి లేకుండా, నైతిక నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి.
అక్రమ క్లినికల్ ట్రయల్స్ ప్రాణాలను బలి తీసుకోవడం, వైకల్యాలను మిగల్చడం మాత్రమే కాకుండా.. సమాజంపై తీవ్ర దుష్ప్రభావం చూపు తాయి. పేద, సాధారణ ప్రజలువైద్యం చేయించు కోవడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. వైద్యులు, ఆస్పత్రులపై నమ్మకం పోతుంది.సరికొత్త ఔషధాలు, చికిత్సలు మానవాళికి అవసరం. కానీ వాటి కోసం చేసే ప్రయోగాలు నైతిక నియమాలు, మానవ హక్కుల పరిధిలోనే జరగాలి. అమాయకుల ప్రాణాలను ఫణంగా పెట్టి సంపాదించే లాభాల కంటే మానవత్వం, భద్రతకే అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. అక్రమాలకు పాల్పడే మెడికల్ మాఫియాను కఠినంగా శిక్షించడం, క్లినియర్ ట్రయల్స్ నియంత్రణను మరింత పటిష్టం చేయడం తక్షణ కర్తవ్యం.
-మహమ్మద్ ఆరిఫ్, 7013147990
మెడి’కిల్’ ప్రయోగం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



