Wednesday, November 26, 2025
E-PAPER
Homeఎడిట్ పేజినమ్మేదెలా..?

నమ్మేదెలా..?

- Advertisement -

‘దేశ పౌరులు తమ రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని.. బలమైన ప్రజాస్వామ్యానికి అవే పునాదులు’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశప్రజలకు బహిరంగ లేఖ రాశారు. పౌరహక్కులనేవి పౌరుల స్వాతంత్య్రానికి మూలస్తంభాల వంటివన్న ప్రధాని వ్యాఖ్యలు అక్షర సత్యాలు. జనజీవితాల్లో ప్రభుత్వాలు అనుచిత జోక్యం చేసుకోకుండా ఆ రాజ్యాంగ విధులు నిలువరిస్తాయన్నది కూడా అంతే సత్యం. కానీ, కేంద్రంలో వీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ సంస్థలు ఎందుకు నిర్వీర్యమవుతున్నాయి? పౌరుల హక్కులను, మీడియా సంస్థలను, భావ ప్రకటనా స్వేచ్ఛనూ హరిస్తోందెవరు? సామ, దాన, దండోపాయాలతో రాజ్యాంగ వ్యవస్థలు తమ అనుచరుల గుప్పిట్లో ఉండేలా కుట్రలు చేస్తోందెవరూ?రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని దేశప్రజలకు లేఖ రాసిన ప్రధాని…వారి పాలనలో ఆ పునాదులు ఎందుకు బీటలు వారుతున్నాయో కూడా చెబితే బాగుండేది. ప్రధాని రాసిన ఒకే ఒకలేఖ చుట్టూ అనేక ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి.
తినే తిండి మీద ఆంక్షలు..కట్టుకునే బట్టమీద, వాటి రంగుల మీద కూడా ఆంక్షలు..భావ ప్రకటనపైనా.. పుట్టిన నేలపై స్వేచ్ఛగా జీవిం చాలన్నా ఆంక్షలు. చివరకు బతుకుదెరువు కోసం చేసే పని మీద కూడా ఆంక్షలే! అసలు దేశం ఎటుపోతోంది? ఏమైపోతోంది? సగటు భారతీ యుడు ఆవేదన చెందనిరోజు ఉందా? ఆధునిక ప్రపంచం అంతరిక్షంలో కూడా పరిశోధనలు చేసే స్థాయికి దూసుకుపోతుంటే, దేశాన్ని మతవిద్వేషాలు, మూఢనమ్మకాలు, అశాస్త్రీయ భావాలమయం చేస్తున్న తీరును ఏమనాలి? బడిలో ”భారతదేశం నా మాతృభూమి/ భారతీయులందరూ నా సహోదరులు” అని చేసిన ప్రతిజ్ఞకు తిలోదకాలిచ్చి ఒకరినొకరు చంపుకునే దుస్థితికి దిగజారిపోయాం. మణిపూర్‌లో ఏడాదిన్నరకుపైగా జరుగుతుందదే. ఈ విద్వేష భావజాలంతో భారతదేశ సౌభ్రాతృత్వమే ప్రశ్నార్థకంగా మారిపోయింది.

పార్లమెంటు వేదికగానే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజ్యాంగ నిర్మాత మీదే అక్కసు వెళ్లగక్కారు. దేశంలోని ముస్లింలు, ఇతర మైనార్టీలకు వ్యతిరేకంగా స్వయంగా మోడీనే విద్వేష ప్రసంగాలు చేసిన సందర్భాలు కోకొల్లలు. ”ఆవు చేలో మేస్తే దూడగట్టున మేస్తుందా” అన్నట్టు ప్రభుత్వ అధినేతలే విద్వేష పూర్వక ప్రసంగాలు చేస్తుంటే వారి పరివారాన్ని కట్టడి చేయడం సాధ్యమేనా? ఈ నేపథ్యంలోంచి చూస్తే ప్రధాని మన రాజ్యాంగం అత్యంత శక్తిమంతమైనదని లేఖ రాయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భారత రాజ్యాంగం స్వేచ్ఛాయుత సమాజాన్ని మాత్రమే స్వప్నించడమే కాదు, గౌరవనీయమైన, సామరస్య పూర్వకమైన సంఘ నిర్మాణాన్ని కూడా కాంక్షిస్తోంది. ఆ సంవిధాన స్ఫూర్తికి సమాధికడుతూ వ్యక్తిత్వహననాలకు ఒడిగడుతున్న వదరుబోతుల వాచాలత్వం మాటేమిటి?

ప్రధాని తన లేఖలో ‘పౌరులుగా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అన్ని ఎన్నికల్లో ఓటు వేయడం వారి కర్తవ్యం’ అని పేర్కొన్నారు. కానీ ఆచరణ మరోలా ఉంది. లాక్షలాది ప్రజలను ఓటరు జాబితా నుంచి తొలగిస్తూ… ఓటు వేయడం పౌరుల కర్తవ్యమంటే ఈ పాలకులనేలా నమ్మేది? భిన్నత్వంలో ఏకత్వంలా కలిసుండే ప్రజల్లో విద్వేషాలు రగిలించే విభజన రాజకీయాల ద్వారా ఈ పాలకులు దేశానికి ఏం చెబుతున్నట్టు? ఏం సూచిస్తున్నట్టు?

విమర్శలు, భిన్నాభిప్రాయాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయన్న కనీస స్పృహ కూడా లేకుండా ప్రశ్నించిన గొంతులపై ఉక్కు పాదాలతో అణిచివేత కొనసాగుతోంది. ఇది ప్రజాస్వామిక పాలన ఎలా అవుతుంది? విద్వేషాలను రెచ్చగొట్టడం జాతీయ సమైక్యత, సమగ్రతలకు పెను ప్రమాదం. ‘ఏ మాటల వెనుక ఏ ప్రయోజనాలు దాగున్నాయో తెలియ నంతకాలం ప్రజలు మళ్లీమళ్లీ మోసపోతూనే ఉంటారు…’ అని సత్యాన్ని ప్రజలు ఎప్పుడూ మననం చేసుకోవాలి. నేటి ప్రధాని లేఖ ఈ కోణంలో పరిశీలించి చూస్తే… అనేకానేక వాస్తవాలు, అంతకుమించిన నగసత్యాలూ మనకు బోధపడు తుంటాయి.

ఒక వైపు ప్రధాని ‘రాజ్యాంగం గొప్పదంటూ..దానిని కాపాడుతున్న ప్రజలకు అభినందనలు చెబుతుంటే’… మరోవైపు ప్రధాని ఆర్థిక సలహా మండలి అధ్యక్షుడు వివేక్‌ దెబ్రారు ఓ జాతీయ పత్రికకు రాసిన వ్యాసంలో ‘ప్రస్తుత రాజ్యాంగం పరిపాలనకు అడ్డంకిగా ఉంది. దీన్ని మార్చేసి 2047 కల్లా కొత్త రాజ్యాంగం రూపొందించుకోవాలి’ పేర్కొన్నారు. ప్రధానమంత్రి అంతరంగికుడైన వివేక్‌ దెబ్రారు ప్రధాని మనసులో లేని మాటలు మాట్లాడే సాహసం చేయగలరా? ప్రజలు ఎవరి మాటలను విశ్వషించాలో ఆలోచించుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -