రాష్ట్రంలో ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు వరి ధాన్యం, పత్తి. వీటితో పాటు అనేక రకాల విత్తన ఉత్పత్తులను కేంద్ర, రాష్ట్ర పభుత్వ సంస్థల ద్వారా మరియు ప్రయివేటుగా కొనుగోళ్లు జరుగుతున్నవి. అయితే, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో రైస్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులది కీలక పాత్ర. పైగా ఎంతోమంది కార్మికుల ఉపాధి కల్పించే కేంద్రాలు. ఈ మిల్లులకు బలోపేతానికి సంబం ధించి కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల వద్ద సరైన ప్రణాళిక లేదు. దీంతో ఇప్పటికే అనేక మిల్లులు మూత పడగా, కొన్ని మూతపడే దశలో ఉన్నాయి. నిలదొక్కు కోవడానికి పరిశ్రమల యజమానులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైస్ ఇండిస్టీస్‌నే తీసుకుంటే టెండర్ వడ్ల సమస్య నేటికీ పరిష్కారం కాలేదు. టెండర్‌దారు ఆరునెలల్లోనే మిల్లుల నుండి వడ్లు తీసుకెళ్లవలసి ఉండగా, రెండేండ్లు గడుస్తున్నా ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకపోగా వడ్లు కూడా తీసుకెళ్లడం లేదు. మిల్లర్లు తీసుకుందామంటే అధిక ధరలు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కొంత మంది మిల్లర్లు డబ్బులు చెల్లించి వడ్లను కొనుగోలు చేశారు. డిఫాల్ట్ అయినా టెండర్‌దారు పైనా చర్యలు లేవు. గత టీ(బీ)ఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి కేంద్ర బీజేపీ పెద్దలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) కొనుగోలు చేయకుండా అడ్డంకులు సృష్టించారని విమర్శలు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి వడ్లను కొనుగోలు చేసింది. కానీ, వాటిని ఎక్కడ అమ్ముకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.రైస్ మిల్లుల గోదాముల్లో ధాన్యం ముక్కిపోతున్నది. దీంతో డ్రైయేజ్, మెయింటెనెన్స్ భారం రైస్ మిల్లర్స్‌పై పడుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లరు సంస్థ ద్వారా ఐకేపీలు, ప్రాథమిక సహకార సంఘాలతో వడ్లను కొనుగోలు చేసి, రైస్ మిల్లర్లకు అందజేస్తుంది. క్వింటాల్ వడ్లకు బాయిల్డ్ రైస్ 68 కిలోలు, రా రైస్ 67 కిలోలు సంస్థకు ఇవ్వాలి. వాతావరణంలో మార్పులు అధిక ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ మందుల వినియోగంతో సగటున 62 నుండి 65 కిలోల బియ్యం మాత్రమే వస్తున్నాయని రైస్‌మిల్లర్లు వాపోతున్నారు. గత ప్రభుత్వ హాయంలో పరిశీలనకు కమిటీ వేసి, కొన్ని మిల్లులను ఎంచుకొని రాండం టెస్టింగ్ చేశారు. కానీ ఆ నివేదిక ఇప్పటికీ బయట పెట్టలేదు. రైస్ మిల్లులకు ఇవ్వవలసిన కస్టమ్ మిల్లింగ్ చార్జీలు కనీసం రూ.వంద ఇవ్వాల్సి ఉండగా 30 మాత్రమే ఇస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చింది. కానీ కస్టమ్ మిల్లింగ్ చార్జీలు గత పదేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు పడింది. ఒక్కొక్క మిల్లుకు రూ.70 లక్షల నుండి రెండు కోట్ల వరకు డబ్బులు రావాల్సి ఉంది. డ్రైయేజీ, కస్టోడియం కింద క్వింటాలకు ఒక కిలో వడ్ల ధర కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవి కూడా రాష్ట్ర గవర్నమెంటు మిల్లర్లకు ఇవ్వడం లేదు. వ్యవసాయ అనుబంధ సీజనల్ పరిశ్రమల అయినప్పటికీ మిల్లు నడిచినా నడవకున్నా వర్తించే ఫిక్స్‌డ్ చార్జీ కరెంట్ బిల్లులు పెనుబారంగా తయారయ్యాయి. 93 కె.వి.ఎ, 125 హెచ్.పి కెపాసిటీ దాటిన మిల్లులకు ప్రతి కె.వి.ఎ కు రూ.475 ఫిక్స్‌డ్ చార్జీలు వసూలు చేస్తున్నారు. విద్యుత్ వినియోగ చార్జీలు యూనిట్‌కు 7.65 పైసలు చార్జ్ చేస్తున్నారు. పరిశ్రమ మనుగడ సాధించాలంటే మినిమం ఫిక్స్‌డ్ చార్జీలు కె.వి.ఎ కు రూ.100 మాత్రమే విధించాలి. విద్యుత్ వినియోగ కేటగిరిని వ్యవసాయ అనుబంధం కింద చేర్చవలసి ఉన్నది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా ఎఫ్‌సిఐ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయినా సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ప్రణాళిక ప్రకారం కేటాయింపులు ఇవ్వకపోవడంతో నెలల తరబడి రైస్ మిల్లులు మిల్లింగ్ నిలుపుదల చేయవలసి వస్తుంది.
2024-25 ఖరీఫ్, రబీ బియ్యం సేకరణ పూర్తిగా చేయలేదు. 1,2 శాతంగా ఉన్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోకుండా, రైస్ మిల్లర్లందరిని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేయడం, వడ్లు కేటాయించాలంటే రూ.20 లక్షలు డిపాజిట్లు తీసుకోవడం నిజాయితీగా ఉన్న మిల్లర్లకు పెనుబారమవుతున్నది. రాష్ట్రంలో ఎఫ్‌సిఐ గోదాముల్లో ఖాళీ లేదు. సుమారు 23 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి కాను 22 లక్షల మెట్రిక్ టన్నులు నిండిపోయి ఉన్నాయి. 2025-26 ఖరీఫ్ సీజన్‌కు 36 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎమ్‌టి)బియ్యాన్ని (53.73 ఎల్‌ఎమ్‌టి వరి) మాత్రమే సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సిఐ లక్ష్యంగా పెట్టుకుంది. 53.6 లక్షల మెట్రిక్ టన్నులకు (80 ఎల్‌ఎమ్‌టి వరి) పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్రం నుండి స్పందన లేదు. రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ ఓట్లు, మత రాజకీయాలు తప్ప రైతులు, కార్మికుల గురించి, పరిశ్రమల గురించి పట్టింపే లేదు. వాన కాలపు పంట దిగుబడి వచ్చిన ఈ నేపథ్యంలోనూ గత నెల రోజులుగా ఆర్డర్లు లేక రైస్ మిల్లులు నడవడం లేదు. పనులు లేక వలస హమాలీ కార్మికులు తిరుగు ప్రయాణమ వుతున్నారు. ఆపరేటర్లకు లేబర్‌కు పనులు దొరకడం లేదు. మరోవైపు ఎఫ్‌సిఐకి క్వింటాల్ బియ్యా నికి రూ. 4200 ఖర్చు వస్తుండగా నాగపూర్ బేస్డ్ కేంద్రమంత్రి కనసన్న ల్లోని ఈథెన్ తయారీ ఫ్యాక్టరీ లకు(పెట్రోల్‌లో కలుపుతున్న), లిక్కర్ ఫ్యాక్టరీ లకు రూ.2200 కే క్వింటాల్ బియ్యాన్ని ఇస్తున్నారు. దీంతో మిల్లర్ల వద్ద ఉండే నూక, పరం, తౌడు మార్కెటింగ్ ధర తగ్గిపోయింది.
కేంద్ర ప్రభుత్వ, కాటన్ కార్పొరేషన్ ఇండియా (సీసీఐ) విధానాలతో రాష్ట్రంలో పత్తి రైతులు, జిన్నింగ్ మిల్లులు తీవ్రంగా నష్టపోతున్నారు. కార్మికులకు ఉపాధి దొరకడం లేదు. కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతిపై ఉన్న పదకొండు శాతం సుంకాన్ని ఎత్తివేసింది. స్పిన్నింగ్ మిల్లర్స్ విదేశీ పత్తిని దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో అప్పటికే పత్తి క్వింటాల్ ధర రూ.300 నుండి 400 తగ్గింది. సీసీఐ సాధ్యమైనంత తక్కువగా కొనుగోలు చేసే ఆలోచనలతో ఉన్నది. అందుకే అనేక కొర్రీలు పెడుతున్నది. సేకరణ పరిమితి ఎకరానికి పన్నెండు క్వింటాళ్ల నుండి ఏడు క్వింటాళ్లకు తగ్గించడం, అకాల వర్షాలు, 12శాతం తేమ పరిమితి కారణంగా రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తి మద్దతు ధర క్వింటాలకు రూ.8110 ప్రకటించినప్పటికీ సీసీఐ పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోవడంతో బహిరంగ మార్కెట్లో పత్తి క్వింటాలు సగటున రూ.6వేలు మాత్రమే ధర పలుకుతున్నది. తెలంగాణ జిన్నింగ్ మిల్లులు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)తో సమస్యలను ఎదుర్కొంటున్నాయి, ఎల్1,ఎల్2, మరియు ఎల్3 గ్రేడింగ్ సిస్టమ్ వంటి కొత్త సేకరణ నియమాలు జిన్నింగ్ మిల్లర్స్ ను ఆర్థికంగా నష్టపరుస్తున్నాయి. మిల్లర్లు రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, సీసీఐ అధికారుల హామీతో సమ్మె విరమించారు. సాధారణంగా కార్మికుల సమ్మెలు, రైతుల బందులు జరిగేవి. ఇప్పుడు మిల్లు యజమానులు సమ్మెలు చేసే పరిస్థితి వచ్చింది. సీడ్ మిల్లు యజమానులు రబీ సీజన్ సీడ్ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాలకు బోనస్ ఇస్తామని ప్రకటించి 2024-25 పంట కాలపు ఖరీఫ్ సీజన్‌లో మాత్రమే రైతులకు బోనస్ ఇచ్చింది. రబీ సీజన్‌లో సన్నాలకు బోనస్ ఇవ్వలేదు. సీడ్ యజమానులు బోనస్‌ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ధరకు కొనుగోలు చేసింది. ఇది సీడ్ రైతులకు మేలు చేసినప్పటికీ, ఇతర రాష్ట్రాల సీడ్ మిల్లర్స్ (ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్) ధరలతో పోటీ పడలేక, తెలంగాణ వరి సీడ్ మిల్లర్స్ దగ్గర పెద్ద ఎత్తున సీడ్ ధాన్యం మిగిలిపోయింది. దీంతో మిగిలిపోయిన సీడ్ ధాన్యాన్ని కొనుగోలు ధరలకంటే క్వింటాలకు రూ.7,8 వందల తక్కువకు రైస్‌మిల్లర్స్‌కు, ఇతరులకు అమ్ముకోవాల్సి వచ్చిందని సీడ్ మిల్ యజమానులు వాపోతున్నారు.
తెలంగాణ సీడ్ బౌల్ అని ప్రకటించుకుంటే సరిపోదు. విత్తన అభివృద్ధికి కావలసిన ప్రోత్సాహ కాలు అందించాలి. ముఖ్యంగా తగిన యంత్రాం గాన్ని ఏర్పాటు చేసి సిడి మిల్లులు కొనుగోలు చేసే సన్న వడ్ల రైతులకు బోనస్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి, మంత్రులు దేశ,విదేశాలు పర్యటిస్తూ ‘మా రాష్ట్రానికి రండి.. భూములిస్తాం, కరెంటిస్తాం, మౌలిక సౌకర్యాలు కల్పిస్తామంటూ’ హైదరాబాద్ చుట్టు రియల్ భూమ్ పెంచే బదులు, వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన తెలంగాణలో అనుబంధ పరిశ్రమల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్క రించాలి. ఈ పరిశ్రమల్లో వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు. వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
గీట్ల ముకుందరెడ్డి
9490098857
రైస్, జిన్నింగ్, సీడ్ మిల్లులపై నిర్లక్ష్యమేలా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



