Thursday, November 27, 2025
E-PAPER
Homeఆటలుచరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా

చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా

- Advertisement -

– భారత గడ్డపై తొలిసారి టెస్ట్‌ సిరీస్‌ క్లీన్‌స్వీప్‌
– దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా వైట్‌వాష్‌

స్వదేశంలో టెస్ట్‌ల్లో టీమిండియాకు అస్సలు కలిసిరావడం లేదు. సరిగ్గా ఏడాది క్రితం 2024లో న్యూజిలాండ్‌ చేతిలో 0-3తో టెస్ట్‌ సిరీస్‌ను వైట్‌వాష్‌కు గురై పలు విమర్శలకు తెరలేపిన టీమిండియా… సరిగ్గా 12 నెలల తర్వాత స్వదేశంలోనే దక్షిణాఫ్రికా చేతిలో రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2తో కోల్పోయి వైట్‌వాష్‌కు గురైంది. విదేశీ గడ్డపై చెలరేగి ఆడే భారత ఆటగాళ్లు.. స్వదేశంలో చతికిలపడుతున్నారు. వన్డే, టి20 ఫార్మాట్‌లను ప్రక్కనబెట్టి టీమిండియా.. ఎందుకిలా తయారయ్యిందా..? అని అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.

గౌహతి : రెండో టెస్టులో టీమిండియా 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. చివరి రోజు భారత ఆటగాళ్లు కనీస పోరాట పటిమ కూడా కనబరచలేకపోయారు. సొంతగడ్డపై ఇంతటి భారీ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండో టెస్ట్‌ ప్రారంభం నుంచి సఫారీలు ఆధిపత్యం కనబరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించిన ప్రొటిస్‌ జట్టు.. అనంతరం టీమిండియాను 201 పరుగులకే ఆలౌట్‌ చేసింది. పేసర్‌ మార్కో యాన్సెన్‌ ఆరు వికెట్లతో సత్తా చాటి.. సౌతాఫ్రికాకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత టీమిండియాను ఫాలో ఆన్‌ ఆడించకుండా తామే మళ్లీ బ్యాటింగ్‌ చేసిన సఫారీలు.. నాలుగో రోజు ఆఖరి సెషన్‌ వరకు ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయలేదు. ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసిన తర్వాత దక్షిణాఫ్రికా తమ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి.. టీమిండియాకు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ (13)ను యాన్సెన్‌ వెనక్కి పంపగా.. కేఎల్‌ రాహుల్‌ (6)ను సైమన్‌ హార్మర్‌ అవుట్‌ చేశాడు. దీంతో మంగళవారం నాటి నాలుగోరోజు ఆట ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి కేవలం 27 పరుగులు చేసింది.

హార్మర్‌ విజృంభణ
ఓవర్‌నైట్‌ స్కోర్‌ 2 వికెట్ల నష్టానికి 27 పరుగులతో బుధవారం, ఆఖరి రోజు ఆటను కొనసాగించిన టీమిండియాకు సఫారీ స్పిన్నర్‌ సైమన్‌ హార్మర్‌ చుక్కలు చూపించాడు. నైట్‌ వాచ్‌మన్‌ కుల్దీప్‌ యాదవ్‌ (5)ను సైమన్‌ బౌల్డ్‌ చేయగా.. పట్టుదలగా క్రీజులో నిలబడ్డ సాయి సుదర్శన్‌ (14; 139 బంతుల్లో)ను సెనూరన్‌ ముత్తుస్వామి వెనక్కి పంపాడు. ఆ తర్వాత సైమన్‌ హార్మర్‌ తన వికెట్ల వేటను వేగవంతం చేశాడు. ధ్రువ్‌ జురెల్‌ (2), కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (13), వాషింగ్టన్‌ సుందర్‌ (16), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (0)లను అవుట్‌ చేసి.. భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. ఇక పట్టుదలగా నిలబడ్డ రవీంద్ర జడేజా అర్ధ శతక వీరుడు (87 బంతుల్లో 54)ను వెనక్కి పంపిన మరో స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌.. మొహమ్మద్‌ సిరాజ్‌ (0) ఆఖరి వికెట్‌గా వెనక్కి పంపాడు. సైమన్‌ హార్మర్‌ ఆరు వికెట్లతో చెలరేగగా.. కేశవ్‌ మహరాజ్‌ రెండు వికెట్లు దక్కాయి. దీంతో సౌతాఫ్రికా పాతికేళ్ల తర్వాత తొలిసారి భారత్‌లో టెస్టు సిరీస్‌ గెలవడమే కాదు.. వైట్‌వాష్‌ చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ యాన్సెన్‌, సిరీస్‌ హార్మర్‌కు దక్కాయి. ముత్తుస్వామి చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

స్వదేశంలో పరుగుల పరంగా అతిపెద్ద ఓటమి
స్వదేశంలో పరుగుల పరంగా భారత్‌కు అతిపెద్ద ఓటమి. గతంలో 2004లో నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా 342 పరుగుల తేడాతో ఓడిపోయింది. 13 నెలల్లో ఒక జట్టు స్వదేశంలో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయడం ఇది రెండోసారి. గతేడాది అక్టోబర్‌-నవంబర్‌-2024 మధ్య జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ను న్యూజిలాండ్‌ వైట్‌వాష్‌ చేసింది. న్యూజిలాండ్‌ మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ను 3-0 తేడాతో ఓడించింది. తాజాగా దక్షిణాఫ్రికా జట్టు రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకొని భారత్‌ను వైట్‌వాష్‌ చేయడం విశేషం.

స్కోర్‌బోర్డు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ : 489పరుగులు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 201పరుగులు
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: 260/5డిక్లేర్డ్‌
ఇండియా రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి)వెర్రెయనె (బి)యాన్సెన్‌ 13, కెఎల్‌ రాహుల్‌ (బి)హార్మర్‌ 6, సాయి సుదర్శన్‌ (సి)మార్‌క్రమ్‌ (బి)ముత్తుసామి 14, కుల్దీప్‌ (బి)హార్మర్‌ 5, జురెల్‌ (సి)మార్‌క్రమ్‌ (బి)హార్మర్‌ 2, పంత్‌ (సి)మార్‌క్రమ్‌ (బి)హార్మర్‌ 13, జడేజా (స్టంప్‌)వెర్రెయనె (బి)మహరాజ్‌ 54, సుందర్‌ (సి)మార్‌క్రమ్‌ (బి)హార్మర్‌ 16, నితీశ్‌ రెడ్డి (సి)వెర్రెయనె (బి)హార్మర్‌ 0, బుమ్రా (నాటౌట్‌) 1, సిరాజ్‌ (సి)జాన్సెన్‌ (బి)మహరాజ్‌ 0, అదనం 16. (63.5ఓవర్లలో ఆలౌట్‌)140పరుగులు.
వికెట్ల పతనం: 1/17, 2/21, 3/40, 4/42, 5/58, 6/95, 7/130, 8/138, 9/140, 10/140
బౌలింగ్‌: జాన్సెన్‌ 15-7-23-1, ముల్డర్‌ 4-1-6-0, హార్మర్‌ 23-6-37-6, మహరాజ్‌ 12.5-1-37-2, మార్‌క్రమ్‌ 2-0-2-0, ముత్తుసామి 7-1-21-1.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -