Thursday, November 27, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలులేబర్‌ కోడ్‌లు రద్దు చేయాల్సిందే..

లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాల్సిందే..

- Advertisement -

– కనీస వేతనాలు రక్షించాలి
– విద్యుత్‌ బిల్లు-2025ను రద్దు చేయాలి
– కనీస మద్దతు ధరతో పంటల కొనుగోలుకు గ్యారంటీ ఇవ్వాలి
– విధానాలు మార్చుకోకపోతే మహౌద్యమం తప్పదు : తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, ఎస్‌కెఎం ధర్నాలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు మార్చుకోకపోతే మహౌద్యమం తప్పదని సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద బుధవారం రాష్ట్ర స్థాయి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు జె.కుమారస్వామి (సీఐటీయూ), యూసుఫ్‌ (ఏఐటీయూసీ), ఆదిల్‌ షరీఫ్‌ (ఐఎన్టీయూసీ), ప్రవీణ్‌ (టీయుసీఐ), అరుణ (ఐఫ్టీయూ), విజయ్‌ (ఐఎఫ్టీయూ) అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, యస్‌.కె.యం రాష్ట్ర కన్వీనర్లు టి.సాగర్‌, బి.రాము, మామిడాల భిక్షపతి, జక్కుల వెంకటయ్య, కొండల్‌, ఉపేందర్‌ రెడ్డి, తిరుమల్‌ రెడ్డి, సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల బోర్డు చైర్మెన్‌ జనక్‌ ప్రసాద్‌, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసఫ్‌, బాలరాజు, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యం, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, టిఆర్‌ఎస్‌కెవి రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్‌, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజద్‌ సహా పలు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఇండియా బ్లాక్‌ పార్టీలు నిలదీయాలని కోరారు. ఇండియా బ్లాక్‌ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అసెంబ్లీల్లో ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు హక్కులిచ్చిన రాష్ట్రం కేరళ అభివృద్ధి చెందుతూ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. దేశవ్యాప్తంగా నిరసనల్లో బీఎంఎస్‌ తప్ప అన్ని సంఘాలు పాల్గొంటున్నాయనీ, ఈ సంఘాలు 90 శాతం మందికి ప్రాతినిథ్యం వహిస్తున్నాయని గుర్తుచే శారు.

యుపీఏ హయాంలో ఉపాధి హామీకి 4 శాతం బడ్జెట్‌ కేటాయిస్తే, ఎన్డీఏ సర్కారు దాన్ని 1.37 శాతానికి తగ్గించిందని విమర్శించారు. ఉపాధి హామీకి రూ.2.5 లక్షల కోట్లు కేటాయించాలనీ, 200 రోజులు పని కల్పించాలనీ, పట్టణ ప్రాంతాల్లోనూ చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. భూపంపిణీ చేయకుండా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రపంచదేశాలతో ఎలా పోటీ పడతారని ప్రశ్నించారు. సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు మాట్లాడుతూ ఇండియన్‌ లేబర్‌ కాంగ్రెస్‌ను వెంటనే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ఏటా నిర్వహించాల్సిన ఐఎల్‌సీని బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా నిర్వహించలేదని విమర్శించారు. ఆధునిక కార్మికులుగా మారుస్తామని చెబుతూనే బీజేపీ బానిస కార్మికులను తయారు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చాక విస్తృతస్థాయిలో ఐక్యంగా ఉద్యమాలు జరుగుతున్నాయని తెలిపారు. నాలుగేండ్లుగా లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని కోరితే బీహార్‌లో గెలిచాక వాటిని అమల్లోకి తెచ్చిందన్నారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన గ్రాంట్లను ఆపుతూ బలవంతంగా లేబర్‌ కోడ్‌లను అమలు చేయించేందుకు కేంద్రంలోని సర్కార్‌ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలు వీటిని అమలు చేసి 12 గంటల పనిదినాన్ని అమల్లోకి తెస్తున్నాయని తెలిపారు. ఆయా పథకాల్లో పని చేస్తున్న కోటి మంది మహిళలకు స్థానం కల్పించనీ, గిగ్‌ వర్కర్ల సామాజిక భద్రత పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటివి లేకుండా సామాజిక న్యాయం అంటూ బీజేపీ సర్కార్‌ కబుర్లు చెబుతున్నదని ఆయన దుయ్యబట్టారు. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ పేరుతో రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ తదితర ఉద్యోగులను పూర్తిగా తొలగిస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరించిందని తెలిపారు. సంయుక్త కిసాన్‌ మోర్చా రాష్ట్ర కన్వీనర్‌ టి.సాగర్‌ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా దేశవ్యాప్తంగా 10 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్దిష్ట నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు ఢిల్లీలో పోరాడి 700 మంది అమరత్వంతో మోడీ సర్కార్‌ మెడలు వంచినట్టు గుర్తుచేశారు. బీజేపీ సర్కార్‌ మళ్లీ మునపటిలాగే వ్యవహరిస్తే మరోసారి బుద్ధి చెప్పేందుకు సిద్ధమని హెచ్చరించారు.

వివిధ కార్మిక, రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలనీ, కనీస వేతనాల హక్కును రక్షించాలనీ, కనీస మద్ధతు ధరతో పంటల కొనుగోలుకు గ్యారంటీ ఇవ్వాలనీ, విద్యుత్‌ బిల్లు-2025ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పంటల కొనుగోలుకు అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. మైక్రో ఫైనాన్స్‌ దోపిడీని నియంత్రించాలనీ, వడ్డీ రేటును నియంత్రిం చాలనీ, రైతులకు వడ్డీ లేని రుణ పథకాన్ని అమలు చేయడానికి ఆర్బిఐ మిగులును నాబార్డ్‌కి బదిలీ చేయాలని కోరారు. విద్యుత్‌, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించి స్మార్ట్‌ మీటర్లు పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. గృహ వినియోగదారు లందరికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్నారు. భారతదేశంపై అమెరికా 50 శాతం సుంకం విధించడాన్ని ఎదుర్కోవాలనీ, పత్తిపై 11 శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించాలన్నారు. ఇండో-బ్రిటన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. భారతదేశంలో సాధారణ పంటల సమయంలో పంట ధరలను తగ్గించే అన్ని వ్యవసాయ పంటల దిగుమతులను నిషేధించి, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు పరిహారం ఇవ్వాలి. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలనీ, ఈ పథకం ద్వారా 200 రోజుల పని, రోజు కూలీ రూ.700 ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. క్యాజువల్‌, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ విధానాన్ని రద్దు చేయాలి. నియామకాలపై నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 65 లక్షల పోస్టులను భర్తీ చేయాలనీ, పాత పెన్షన్‌ పథకాన్ని పునరుద్దరించాలనీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సామాజిక రిజర్వేషన్లను కఠినంగా అమలు చేయాలన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ బాధితులం దరికీ గ్రామీణ ప్రాంతాల్లో 4 రెట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 రెట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

సహజ వనరులపై గిరిజన హక్కులను కాపాడటానికి అటవీ హక్కుల చట్టం, పెసా (గిరిజన ప్రాంతాలలో పంచాయి తీల విస్తరణ చట్టం) చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. భూమి, స్థానిక ప్రజలు ముఖ్యంగా గిరిజన కుటుంబాల అభివద్ధి కోసం మైనింగ్‌ నుంచి 60 శాతం మిగులును స్థానిక సంస్థలకు కేటాయించాలని సూచించారు. విఫలమైన ప్రధాన మంత్రి ఫసల్‌ భీమా యోజనను రద్దు చేసి, ప్రభుత్వ రంగంలో ఎల్‌ఐసి వంటి కార్పొరేషన్ల ద్వారా పంటలు, పశువుల కోసం బీమాను నిర్వహించే ఏర్పాటు చేయాలి. కేంద్ర బడ్జెట్‌లో తగ్గించిన రూ.87,000 కోట్ల ఎరువుల సబ్సిడీని పునరుద్ధరించాలి. బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టాలని కోరారు.

కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే. వెంకటేష్‌, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ నాయక్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జంగారెడ్డి, అడిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, సీఐటీయూ నగర కార్యదర్శి స్వర్ణకుమార్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -