– కార్పొరేట్ స్వామి భక్తితో చట్టాల్లో మార్పులు
– కోడ్‌ల అమలు గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేయాలి
– రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, కాపీలు దహనం
నవతెలంగాణ- విలేకరులు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వామపక్ష ఎంపీలను పార్లమెంట్ నుంచి బయటకు పంపి అప్రజాస్వామ్యంగా లేబర్ కోడ్‌లను ఆమోదించు కుందని అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏఆర్.సింధు అన్నారు. కార్పొరేట్ స్వామి భక్తిని ప్రదర్శిస్తూ వారికి అనుకూలంగా చట్టాలను మారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. కోడ్‌ల అమలుకు నవంబర్ 21న మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ కాపీలను దహనం చేశారు. ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన గెజిట్ నోటిఫికేషన్ కాపీల దహనం కార్యక్రమంలో ఏఆర్. సింధు మాట్లాడారు. అలాగే, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ 29 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల అమలు నిలిపేయాలని డిమాండ్ చేశారు. చట్టాల్లో కార్మికులకు ఉపయోగపడే అంశాలను నిర్వీర్యం చేసిందన్నారు.
సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్ నుంచి చిట్యాల ఐలమ్మ విగ్రహం వరకు కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే దేశ ఆర్థిక స్వావలంబనను తాకట్టు పెడుతుందని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కరీంనగర్‌లో ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. జగిత్యాలలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. హనుమకొండలో ధర్నా, నిరసన ప్రదర్శన చేశారు. జనగామలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. నిజామాబాద్‌లో ఎస్‌కేఎం, సీఐటీయూ, ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో జీఎం కార్యాలయం వద్ద సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. అదేవిధంగా సీఐటీయూ, టీబీజీకేఎస్, ఏఐటియుసి, ఐఎన్‌టియుసి, జేఏసీ ఆధ్వర్యంలోనూ ధర్నా నిర్వహించారు. ఇల్లందు మండలంలో మార్కెట్ మెయిన్ రోడ్డుపై నిరసన తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం షాపూర్ నగర్ రైతు బజార్ నుంచి ఉషోదయ టవర్స్ వరకు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గద్వాలలోని కృష్ణవేణి చౌరస్తాలో, మహబూబ్‌నగర్‌లో నిరసన కార్యక్రమం జరిగింది.
కేంద్రలంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను, కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాడాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ విగ్రహం వద్ద జరిగిన సీఐటీయూ, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ఏఐకేఎంఎస్, ఐఎఫ్‌టీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో డా. అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. సూర్యాపేటలో మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. వాణిజ్యభవన్ సెంటర్‌లో నిరసన తెలిపారు.
కోడ్‌లు అప్రజాస్వామికం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



