నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశంలో తొలి పురుగుల ఆధారిత యాంటీబయోటిక్ గ్రోత్ ప్రమోటర్ (ఏజీపీ) రీప్లేస్మెంట్ టెక్నాలజీని ఎల్మెంటోజ్ రీసెర్చ్ ప్రయివేట్ లిమిటెడ్ ఆవిష్కరించింది. దీనిని భారత ఆహార పశుగ్రాస వ్యవస్థను యాంటీబయోటిక్ రహిత దిశగా మార్చే కీలక మైలురాయిగా చెప్పవచ్చు. పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈనెల 27వ తేదీన ప్రారంభమైంది. ఇది 29వ తేదీ వరకు జరగనుంది. ఈ ఎక్స్‌పోలో దీనిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎల్మెంటోజ్ రీసెర్చ్ ప్రయివేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈఓ డాక్టర్ జయశంకర్ దాస్ మాట్లాడుతూ భారతదేశం ఆహార స్వయం సమృద్ధిని సాధించిందన్నారు. అయితే, ఇప్పుడు పోషక భద్రత అతిపెద్ద సవాలు అన్నారు.
పశుగ్రాసంలో యాంటీబయోటిక్స్‌ను తప్పుగా ఉపయోగించడం ఒక ‘నిశ్శబ్ద సంక్షోభం’గా మారిందన్నారు. ఇది ఏఎంఆర్ ను వేగంగా పెంచుతూ ప్రజారోగ్య మూలాధారాలను ప్రమాదంలోకి నెడుతోందన్నారు. యాంటీబయోటిక్ గ్రోత్ ప్రమోటర్ల స్థానంలో శాస్త్రీయంగా అభివృద్ధి చేసిన, భారత్‌లోనే తయారైన ప్రత్యామ్నాయాలను అందించడం మా లక్ష్యమన్నారు. ఇవి జంతువుల పెరుగుదలకే కాకుండా, మానవుల ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాయన్నారు. ఈ ఆవిష్కరణ ‘ఇన్ ఇండియా – ఫర్ ఇండియా’ పద్ధతిలో రూపుదిద్దుకుందన్నారు. భవిష్యత్తు తరాలకు ప్రతి గుడ్డు, ప్రతి మాంసపు ముక్క సురక్షితంగా ఉండేలా చేయడం మా లక్ష్యమన్నారు.
ఈ సందర్భంగా ఎల్మెంటోజ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకులు, సీటీఓ డాక్టర్ పద్మజా మొహాంతి మాట్లాడుతూ ఏఎంఆర్ అనేది కేవలం వెటర్నరీ సమస్య కాదన్నారు. ఇది జాతీయ ఆరోగ్య సమస్య అన్నారు. పౌల్ట్రీ రంగం ఫీడ్‌లో రొటీన్‌గా ఉపయోగిస్తున్న యాంటీబయోటిక్స్‌ను పూర్తిగా తొలగించాలన్నారు. ఏఎంపీ ఆధారిత పోషకాహారం, డేటా ఆధారిత మాన్యుఫాక్చరింగ్ ద్వారా భారత ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణమైన సుస్థిర, సురక్షిత ఆహార వ్యవస్థలు నిర్మించడానికి మా ప్రయత్నం ఉంటుందన్నారు.
ఈ ఎక్స్‌పోలో ఎల్మెంటోజ్ తన స్మార్ట్ ప్రోటీన్ ప్లాట్‌ఫారమ్, ఇమ్యూన్ స్మార్ట్ ప్రీమిక్స్‌ను ప్రదర్శించింది. ఇవి యాంటీమైక్రోబియల్ పెప్టైడ్ (ఏఎంపీ) సైన్స్‌ను ప్రెసిషన్ ఫార్ములేషన్‌తో అనుసంధానించి, యాంటీబయోటిక్స్‌పై ఆధారపడకుండా ఫీడ్ కన్వర్షన్, రోగనిరోధక శక్తి, వ్యాధి నిరోధకత వంటి అంశాల్లో గణనీయమైన మెరుగుదలను అందిస్తాయి. పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో 2025లో జరిగిన చర్చలు ఏఎంఆర్ సమస్యను మూలస్థాయిలో అంటే ఫీడ్ దశలోనే అరికట్టేందుకు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాయి.
ఎల్మెంటోజ్ స్టాల్‌ను ఫీడ్ తయారిదారులు, ఇంటిగ్రేటర్లు, పౌల్ట్రీ రైతులు, పరిశోధకులు సందర్శించారు. ఈ ఎక్స్పో భారతీయ వ్యవసాయ రంగాన్ని ఒక మలుపు తిప్పే దశగా నిలిచింది. ఏజీపీ రిప్లేస్మెంట్ టెక్నాలజీలో పయనీర్‌గా నిలిచిన ఎల్మెంటోజ్, ఏఎంఆర్ తగ్గింపులో భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందంజలో నిలుపుతూ జంతువులకు మానవులకు ఒక ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మిస్తోంది.



