మాయ మాటలకు ప్రజలు మోసపోవద్దు: ఎస్సై పవన్ కుమార్
నవతెలంగాణ-పాలకుర్తి
బంగారం ఇస్తామని లక్షలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన భార్యాభర్తలిద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించామని ఎస్సై దూలం పవన్ కుమార్ తెలిపారు. శుక్రవారం పాలకుర్తి పోలీస్ స్టేషన్లో మోసం చేసిన వ్యక్తుల అరెస్టు అనంతరం ఎస్సై పవన్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన సింగపూర్ గౌరమ్మ, సింగపురం వెంకటయ్యలు తక్కువ ధరకు బంగారం ఇస్తామని ప్రజలను మోసం చేసి లక్షలు వసూలు చేశారని తెలిపారు.
మండల పరిసర గ్రామాలతో పాటు ఇతర మండలాల ప్రజల వద్దకు వెళ్లి బంగారం దొరికిందని కొంత డబ్బులు ఇస్తే బంగారం అందజేస్తామని ప్రజలను నమ్మించడంతో బొమ్మ గాని పద్మ వద్ద 4, 74 వేలు, మంద రజిత వద్ద ఆరు లక్షల ఏడు వేలు, గాదం జయ వద్ద 5 లక్షల 93 వేల 100, జఫర్గడ్ మండలం, కోణాచలం గ్రామానికి చెందిన సుమారు నలుగురు మహిళల వద్ద 15 లక్షలు వసూలు చేశారు తెలిపారు. బంగారం ఇస్తామని ప్రజలను మోసం చేసి లక్షలు వసూలు చేసిందని గూడూరు గ్రామానికి చెందిన మందా రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మోసం చేసిన వ్యక్తులను అరెస్టు చేశామని తెలిపారు. మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ప్రజలకు సూచించారు, ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్ లు వల్లాల రాజ్ కుమార్, అశ్విని తదితరులు పాల్గొన్నారు.



