Saturday, November 29, 2025
E-PAPER
Homeమానవిమద్యానికి బానిసైతే…

మద్యానికి బానిసైతే…

- Advertisement -

మద్యపానం ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, వారిపై ఆధారపడిన వారి జీవితాలను కూడా చిన్నాభిన్నం చేస్తుంది. అయినప్పటికీ చాలా మంది ఆ అలవాటు నుండి భయపడలేకపోతున్నారు. ముందు సరదాగా మొదలై తర్వాత మద్యానికి బానిసలై పోతున్నారు. కొంతమంది అయితే తాము చేస్తుంది తప్పు అని తెలిసినా భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అలాంటి కథనమే ఈ వారం (ఐద్వా అదాలత్‌)ఐలమ్మ ట్రస్ట్‌లో మీ కోసం…

పద్మజకు సుమారు 42 ఏండ్లు ఉంటాయి. ప్రదీప్‌తో పెండ్లి జరిగి 20 ఏండ్లు అవుతుంది. ప్రేమించుకుని పెండ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ప్రదీప్‌ కాలేజీ రోజుల నుండే మద్యం తాగుతుండేవాడు. అయితే ఎప్పుడో ఒకసారి మాత్రమే స్నేహితులతో కలిసి చాలా తక్కువ తాగేవాడు. అప్పుడు పద్మజకు పెద్దగా ఇబ్బంది అనిపించేది కాదు. పెండ్లి తర్వాత ఇద్దరూ ముంబయిలో ఉండేవారు. అప్పుడు కూడా తాగే అలవాటు ఉన్నా చాలా తక్కువ. ఆఫీస్‌లో ఏమైనా మీటింగ్స్‌ ఉంటేనే తాగేవాడు. సుమారు ఐడేండ్లు ముంబయిలో ఉన్నారు. బంధువులం దరూ హైదరాబాద్‌లో ఉండడం, పిల్లల చదువులు దృష్టిలో పెట్టుకొని తిరిగి హైదరాబాద్‌ వచ్చేశారు. అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుండి ప్రదీప్‌కు స్నేహితులు, బంధువులు బాగా పెరిగిపోయారు. దాంతో తరచుగా అందరూ కలుస్తుండేవారు. అలాగే తాగడం కూడా ఎక్కువైపోయింది. ప్రదీప్‌ తల్లిదండ్రులు కూడా వీరితోనే కలిసి ఉంటారు. వాళ్ల కుటుంబంలో ఎవ్వరికీ తాగే అలవాటు లేదు. ఒక్క ప్రదీప్‌కు మాత్రమే ఈ అలవాటు ఉంది.

పద్మజ మానుకోవచ్చు కదా అని అడిగితే ‘ఆఫీస్‌లో మీటింగ్స్‌ ఉంటాయి, తాగక పోతే తప్పుగా అనుకుంటారు. నేను తాగుతాననే విషయం నీకు మాత్రమే తెలుసు, మా ఇంట్లో వాళ్లకు చెప్పకు’ అనేవాడు. తాగినప్పుడు తల్లిదండ్రులు పడుకున్న తర్వాత ఇంటికి వచ్చేవాడు. వాళ్లంటే అతనికి అంత గౌరవం. తాగి పిల్లల ముందుకు కూడా రాడు. కానీ కరోనా సమయంలో అంతా పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ప్రదీప్‌ తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు. వాళ్ల ఏరియాలో అందరూ ‘తాగి మా ఇంటి ముందు పడిపోతున్నాడు, గోల చేస్తున్నాడు’ అని అతనిపై ఫిర్యాదులు ఇస్తున్నారు. చివరకు ఒకసారి పోలీస్‌ స్టేషన్‌ వరకు కూడా వెళ్లారు. అప్పుడప్పుడు రోడుపైన పడిపోతే పద్మజ నే పిల్లల సాయంతో అతన్ని ఇంటికి తీసుకెళ్లేది.

ఎంత చెప్పినా అతనిలో మార్పు రావడం లేదు. చివరికి తండ్రికి కూడా భయపడడం లేదు. అతని పరిస్థితి చూసి ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. చివరకు పిల్లలు కూడా అసహ్యించుకుం టున్నారు. ప్రస్తుతం అతను ఒక్క మద్యం గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించే స్థితిలో లేడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక ‘ఎలాగైనా మీరే నాకు సహాయం చేయాలి’ అంటూ తెలిసిన వాళ్లు చెబితే ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది. మేము ప్రదీప్‌ను పిలిపించి మాట్లాడితే ‘నాకు మద్యం అలవాటు ఉందని పద్మజకు కాలేజీ రోజుల్లోనే తెలుసు. కానీ ఇప్పుడు ఆమె ప్రవర్తన వల్లనే ఈరోజు నేను ఇలా మద్యానికి బానిసైపోయాను. నేను తాగుతాననే విషయం మా ఇంట్లో చెప్పొద్దంటే చెప్పింది. ఈరోజు తాగి నేను రోడ్డుపై పడుకుంటున్నాను. అంతా ఆమె వల్లనే’ అన్నాడు.

ఆమె ఎలా కారణం అంటే ‘నేను సంపాదించింది మొత్తం పద్మజ పేరుతోనే ఉంది. ఆమె పేరుతోనే ఇల్లు, పొలం కొన్నాను. ఆమెకే బంగారం కూడా చేయించాను. నాకంటూ ఏమీ లేదు. నేను చేసే ఉద్యోగంతో పాటు ఒక గంట క్లాస్‌ తీసుకుంటే సుమారు 30 వేలు వస్తాయి. అవి మొత్తం తీసుకొచ్చి ఆమెకే ఇచ్చేవాడిని. కానీ ఆమె ఈ రోజు నన్ను ఒక పురుగులా చూస్తుంది. నన్ను రోడ్డుపై పడేసి నాకు విడాకులు ఇవ్వాలనుకుంటుంది. అందుకే మూడేండ్ల నుండి నాకు పూర్తిగా దూరంగా ఉంటుంది. నన్ను దగ్గరకు కూడా రానీయడం లేదు. ఆమెకు నేనంటే అస్సలు ఇష్టం లేదు. ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలే అర్థం కాక ఇలా తాగుతున్నాను. అందుకే నేను ఇలా తయారవ్వడానికి కారణం ఆమెనే’ అన్నాడు.

దానికి పద్మజ ‘కేవలం ప్రదీప్‌ మాత్రమే కష్టపడలేదు. అతనితో పాటు నేను కూడా కష్టపడ్డాను. మాకు నెలకు సుమారు 25వేలు ఖర్చు అవుతుంది. కరోనా సమయంలో అతనికి సంపాదన ఏమీ లేదు. ఇద్దరం ఏడాది పాటు ఇంట్లో కూర్చొని తిన్నాం. దానికి ఎంత ఖర్చు అవుతుంది. ప్రదీప్‌ నా చేతికిచ్చిన డబ్బులు నేను ఎప్పుడూ అనవసరంగా ఖర్చు చేయలేదు. ఆయనకు తెలియకుండా నా పేరుతో ఏమీ కొనలేదు. ఆయనే దగ్గర ఉండి ఇల్లు, పొలం నా పేరుతో తీసుకున్నాడు. తర్వాత అవి మా పిల్లలకు ఉపయోగపడతాయనే ఆలోచించాము. అతనిపై ప్రేమ లేకుండానే ఈరోజు నేను ఇక్కడి వరకు వచ్చానా? నా భర్తను ఎలాగైనా మార్చుకోవాలనే తప్ప విడిపోవాలనే ఆలోచనే నాకు లేదు. నిజంగా విడిపోవాలనుకుంటే లాయర్‌ దగ్గరకే వెళ్లేదాన్ని. ఇక్కడికి ఎందుకు వచ్చేదాన్ని.
తాగి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న వ్యక్తిని దగ్గరకు ఎలా రానియ్యాలి. నేను దూరంగా ఉంటే తాగడం తగ్గిస్తాడేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు తను తాగడానికి కారణం నేను అంటున్నాడు. ఇప్పుడు పిల్లలు ఇలాంటి తండ్రి మాకు వద్దు అంటున్నారు. ఎంత చెప్పినా ఆయన అర్థం చేసుకోవడం లేదు. తాగి తాగి ఆరోగ్యం మొత్తం పాడైపోతుంది’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఇద్దరూ చెప్పింది విన్న తర్వాత పద్మజతో ‘మీరు దూరంగా ఉంటే మీ మధ్య సమస్య మరింత ఎక్కువైపోతుంది’ అని చెప్పి, ప్రదీప్‌తో ‘తాగి మీరు ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటే మీ ఏరియాలో ఉన్న వాళ్లందరూ మీ గురించి తప్పుగా అనుకుంటున్నారు. మీరు ఇలా ప్రవర్తిస్తుంటే ఏ భార్య అయినా సంతోషంగా ఎలా ఉంటుంది. అందరూ మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటే పద్మజ ఎంత బాధపడుతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. మీకు నిజంగా మీ భార్యా పిల్లలతో సంతోషంగా ఉండాలనుకుంటే రీహాబిటేషన్‌ సెంటర్‌లో కొన్ని రోజులు ఉండడం మంచిది. మీ పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు వాళ్లు టీనేజ్‌లో ఉన్నారు. మీ ప్రేమా, అనురాగం వాళ్లకు కావాలి. ఇలాంటి సమయంలో మీరు తాగుడుకు అలవాటు పడి వాళ్లను మర్చిపోతున్నారు.

పిల్లల్ని దూరం చేసుకుంటున్నారు. సంపాదించడం గొప్ప కాదు. పిల్లలను మంచి మార్గంలో పెట్టడం గొప్ప విషయం. కాబట్టి బాగా ఆలోచించుకోండి’ అని చెప్పాము. అలాగే పద్మజతో ‘మీరు కూడా ప్రదీప్‌కు తోడుగా ఉండండి. ప్రతి విషయానికి గొడవ పెట్టుకోకుండా ఆయన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి’ అని చెప్పాము. మేము చెప్పినట్టే ప్రదీప్‌ రీహాబిటేషన్‌ సెంటర్‌లో చేరాడు. ఆరు నెలల్లో తాగడం మాను కున్నాడు. ప్రస్తుతం ఇద్దరూ సంతోషంగా ఉంటున్నారు. ఒక వ్యక్తికి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ తాగుడు అనే ఒక్క కారణం చాలు కుటుంబం మొత్తం బాధపడటానికి. అందుకే ఆ అలవాటును ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిది.

  • వై వరలక్ష్మి, 9948794051
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -