Saturday, November 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమనువాదానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు ఫూలే

మనువాదానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు ఫూలే

- Advertisement -

బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది బీజేపీనే
పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ బలపర్చే అభ్యర్థులను ఓడించండి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మనువాదం, అసమానతలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన యోధుడు జ్యోతిబా ఫూలే అనీ, ఆయన స్ఫూర్తితో సామాజిక న్యాయ పోరాటాల్లో సమైక్యంగా పాల్గొనాలని ప్రజలకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. శాసనసభ ద్వారా బీసీలకు అన్ని పార్టీలు 42శాతం రిజర్వేషన్ల ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించినప్పటికీ మోడీ సర్కారు అడ్డుకుంటున్నదని విమర్శించారు. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా, కార్పొరేట్ల ప్రయోజనాలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తున్న తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చే అభ్యర్థులను ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జ్యోతిబా ఫూలే 135వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జాన్‌వెస్లీ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆనాటి సమాజంలో అతిశూద్రులు, మహిళలు, వెనుకబడిన సామాజిక తరగతులకు చదువును నిషేధిస్తే పూలే ప్రత్యేక పాఠశాలలు పెట్టి వారికి చదువుకునే అవకాశం కల్పించడం గొప్ప విషయమని కొనియాడారు.

తన భార్యను టీచర్‌గా తీర్చిదిద్ది విద్యావ్యాప్తికి కృషి చేశారని తెలిపారు. ఆనాడు ఆధిపత్య శక్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ పాఠశాలలు నడిపే దాంట్లో ఫూలే క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. అనేక సామాజిక ఉద్యమాల్లో భాగంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ లాంటి వాళ్ళు కూడా ఫూలేని గురువుగా స్వీకరించారని గుర్తుచేశారు. ఆయన తెగువే ఆ ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపేందుకు, చట్టం ముందు అందరూ సమానులేనని రాజ్యాంగం ప్రకటించేందుకు కారణమైందని చెప్పారు. సామాజిక న్యాయం సాధించాలన్న జ్యోతిబా ఫూలే డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎమ్‌డీ అబ్బాస్‌, టి.సాగర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్‌ బాబు, వివిధ ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు కోట రమేష్‌, భూపతి వెంకటేశ్వర్లు, అశోక్‌ రెడ్డి, లెనిన్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -