Saturday, November 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకోకాపేటలో రికార్డు ధర

కోకాపేటలో రికార్డు ధర

- Advertisement -

ఎకరం రూ.151.25కోట్లు
గత రికార్డు బ్రేక్‌
రెండో విడత నియోపోలిస్‌ ఈ-వేలం
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,352 కోట్ల ఆదాయం


నవతెలంగాణ-హైదరాబాద్‌(హెచ్‌ఎండీఏ)
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో భూములకు నిర్వహించిన వేలం రికార్డు ధర పలికింది. ఎకరం రూ.151.25 కోట్లు పలికింది. గత రికార్డును ఈ సారి బ్రేక్‌ చేసింది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) శుక్రవారం నియోపోలిస్‌ ఈ-వేలం రెండో విడతను విజయవంతంగా నిర్వహించింది. ఈ నెల 24న జరిగిన మొదటి విడతలో సాధించిన రికార్డును బ్రేక్‌ చేస్తూ ఆశ్చర్యకర ధర పలికింది. ఈ వేలంలో 4.03 ఎకరాల విస్తీర్ణం గల ప్లాట్‌ 15, 5.03 ఎకరాల ప్లాట్‌ 16ను వేలంకు ఉంచారు. ఉదయం 11గంటలకు ప్రారంభమైన బిడ్డింగ్‌ సాయంత్రం సుమారుం 6:30 గంటల వరకు సాగింది. ప్లాట్‌ 15 ఎకరాకు రూ.151.25 కోట్లు పలికింది. ఈ ప్లాట్‌ను లక్ష్మీ నారాయణ గుమ్మడి, కార్తీశ్‌ రెడ్డి మద్గుల, శరత్‌ వెంట్రప్రగడ, శ్యామ్‌ సుందర్‌రెడ్డి వంగాల దక్కించుకున్నారు.

ప్లాట్‌ 16 ఎకరాకు రూ.147.75 కోట్ల విలువ పలుకగా.. గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ లిమిటెడ్‌ సొంతం చేసుకుంది. ఈ రెండు ప్లాట్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం రూ.1,352 కోట్ల ఆదాయం సమకూరింది. మొదటి విడతలో వచ్చిన ఆదాయం కలుపుకుని, ఇప్పటివరకు నీయోపోలిస్‌ వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,708 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ రికార్డు స్థాయి ధరలతో ఒక్క ఎకరానికి సగటు విలువ రూ.142.83 కోట్లకు చేరింది. ఇది హైదరాబాద్‌ భూముల మార్కెట్‌లో ఇప్పటివరకు కనిపించిన అత్యధిక పెరుగుదలలో ఒకటిగా అధికారులు తెలిపారు. రెండు విడతల్లో వరుసగా రికార్డు స్థాయిలో ధర పలకడంతో డిసెంబర్‌ 3న నియోపోలిస్‌, డిసెంబర్‌ 5న గోల్డెన్‌ మైల్‌లో నిర్వహించనున్న ఈ-వేలంపై డెవలప్‌మెంట్‌ కమ్యూనిటీ నుంచి మరింత ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -