Saturday, November 29, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకాళేశ్వరం పూర్తికాకనే కామారెడ్డికి సాగునీటి కష్టాలు

కాళేశ్వరం పూర్తికాకనే కామారెడ్డికి సాగునీటి కష్టాలు

- Advertisement -

బీఆర్‌ఎస్‌ హయాంలోనే నిధులు కేటాయించలేదు
సీఎంకు కొడంగల్‌పై ఉన్న ప్రేమ కామారెడ్డిపై లేదు
తూతూ మంత్రంగానే వరద నష్టపరిహారం : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
42శాతం బీసీ రిజర్వేషన్లు అమలుచేయాలని కామారెడ్డిలో రైల్‌రోకో


నవతెలంగాణ-కామారెడ్డి
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు 22వ ప్యాకేజీకి నిధులు కేటాయించలేకపోవడం వల్లనే పనులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని, దాంతో కామారెడ్డికి సాగునీరు అందడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికి కొడంగల్‌పై ఉన్న ప్రేమ కామారెడ్డిపై లేదని ఆరోపించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే కామారెడ్డితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు సైతం సాగునీరు అందుతుందని, కానీ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళ్లేశ్వరం 22వ ప్యాకేజీకి రూ.1446 కోట్లు ప్రకటించి రూ.450 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు.

దాంతో పనులు చేయలేక ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు అలాగే ఉందన్నారు. కామారెడ్డిలో వినాయక చవితి పండుగ రోజే వర్షాలు పడి అతలాకుతలమైతే ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తే వర్షాలు బందయిన తర్వాత వచ్చి పరామర్శించి తూతూ మంత్రంగా కుటుంబానికి రూ.11,000 నష్టపరిహారంలా ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. వర్షం వస్తే కామారెడ్డిలో ఇంత అపారనష్టం జరగడానికి కారణమేమిటని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో పెట్టిన హైడ్రా మాదిరే కామారెడ్డిలో పెడితే మరోసారి వర్షం పడినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగదన్నారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉండి కేంద్రం నుంచి వరద బాధితులకు ఎలాంటి సహాయాన్ని అందించలేకపోయారన్నారు.

ఇదే ప్రమాదం గుజరాత్‌లో జరిగితే లక్షల్లో నష్టపరి హారం ఇచ్చేవారని విమర్శించారు. కామారెడ్డి నాదని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ అమలుపై శ్రద్ధ పెట్టడం లేదని అన్నారు. ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చిన సీఎం.. కేంద్ర ప్రభుత్వంతో ఒక్కసారి కూడా బీసీ డిక్లరేషన్‌పై మాట్లాడి వినతిపత్రం ఇచ్చిన దాఖలాల్లేవన్నారు. తాను ఇప్పటివరకు రాష్ట్రంలోని 11 జిల్లాల్లో పర్యటించానని.. ఆదిలాబాద్‌, జుక్కల్‌లో రోడ్లు రవాణాకు అనుకూలంగా లేవని అన్నారు. వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాయకులపై లేదా అని ప్రశ్నించారు. జుక్కల్‌ నియోజకవర్గంలో పత్తి పండించే రైతులు కోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యే స్పందించి జిన్నింగ్‌ మిల్లు ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.

ఆ కుటుంబం పోతే.. మరో కుటుంబముంది..
తనను బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి తొలగించి ఇటు పార్టీకి.. అటు కుటుంబానికి దూరం చేశారని కవిత అన్నారు. కానీ 20 ఏండ్లుగా జాగృతి కుటుంబం నాకు అండగా ఉందని, ఆ కుటుంబంతోనే ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ఎక్కడా తన తండ్రి కేసీఆర్‌ పేరును వాడబోనని, తనకు తానుగానే ప్రజలతో మమేకమై ప్రజలకు సేవ చేస్తానన్నారు. ప్రజలకు మంచి చేస్తే వారే గుండెల్లో పెట్టి చూసుకుంటారని తెలిపారు. విలేకరుల సమావేశం అనంతరం కామారెడ్డి పట్టణానికి చెందిన సుధాకర్‌ అనే గొర్రెల కాపరి గొర్లు మృత్యువాతపడటంతో ఆయన కుటుంబానికి రూ.50వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షులు సంపత్‌గౌడ్‌, భాజె లలిత, వసంత నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బీసీ బిల్లు అమలు చేయాలని రైలురోకో..
బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలు కోసం తెలంగాణ బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైలురోకో నిర్వహించి.. రైలు పట్టాలపై బైటాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో 17 శాతం మాత్రమే అమలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని తెలుసుకున్న స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు వచ్చి కవితను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -