Saturday, November 29, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకవిత మాటలు అవాస్తవం

కవిత మాటలు అవాస్తవం

- Advertisement -

బీఆర్‌ఎస్‌ హయాంలోనే నిజామాబాద్‌, కామారెడ్డికి కాళేశ్వరం నీళ్లు
ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందిపోయి మాపై నిందలా
ఆత్మవిమర్శ చేసుకోవాలి: మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు కాలేశ్వరం నీళ్లు వచ్చాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాటలు అవాస్తవమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే కాళేశ్వరం నీళ్లను నిజామాబాద్‌ జిల్లాలోని ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్ట్‌లోకి, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చి నింపామని గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టులోకి పై నుంచి నీరు రాకపోతే కాళేశ్వరం నీళ్లను కింది నుంచి తీసుకొచ్చి ఎస్సారెస్పీ పునరుజ్జీవం ప్రాజెక్టును దాదాపు రూ.1,900 కోట్లతో పూర్తి చేశామని వివరించారు.

ఎస్సారెస్పీలోకి కింద నుంచి రివర్స్‌ పంపింగ్‌ చేసి వరద కాలువ ద్వారా నీళ్లు తెచ్చామని తెలిపారు. ఈ దృశ్యం జిల్లా ప్రజలు చూశారని పేర్కొన్నారు. తర్వాత వర్షాలు బాగా పడటం వల్ల మళ్లీ ఆ అవసరం రాలేదని తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్‌ ప్రాజెక్టులోకి మంజీరా నుంచి నీళ్లు రాకుంటే కాళేశ్వరం నీళ్లను కొండపోచమ్మ సాగర్‌ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్‌ ప్రాజెక్టులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. స్వయంగా పోచారం గ్రామం దగ్గర నుంచి కొండ పోచమ్మ సాగర్‌ దగ్గర గేట్లు ఎత్తారని వివరించారు. ఇక్కడ కూడా తర్వాత వర్షాలు బాగా పడటం వల్ల ఆ అవసరం రాలేదని తెలిపారు. ప్యాకేజ్‌ 21 పనులు బీఆర్‌ఎస్‌ హయాంలోనే 70 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. ప్యాకేజ్‌ 22 ప్రాజెక్ట్‌ బీఆర్‌ఎస్‌ హయాంలోనే మంజూరు అయ్యి పనులు కూడా మొదలయ్యాయని వివరించారు.

చెరువు భూసేకరణ వివాదంలో పడటం మూలంగా కొంత కాలంపాటు పనులు నిలిచిపోయాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కంటే కొద్ది ముందు ఈ వివాదం పరిష్కారం అయ్యిందని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్యాకేజ్‌ 21, ప్యాకెజ్‌ 22 పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరినా మొదలు పెట్టలేదని వివరించారు. వాస్తవాలు ఇలా ఉంటే ఎమ్మెల్సీ కవిత మిగిలి ఉన్న కొద్ది పనులు పూర్తి చేయకుండా అలసత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరిని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నీలదీయాల్సింది పోయి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌పై నిందలు వేయడం ఎవరి లాభం కోసం చేస్తున్నారో కవిత ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -