Saturday, November 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవైద్య విద్యలో అక్రమాలు అరికట్టాలి

వైద్య విద్యలో అక్రమాలు అరికట్టాలి

- Advertisement -

స్టైఫండ్‌ ఇవ్వని ప్రయివేటు మెడికల్‌ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి : యూడీఎఫ్‌ కన్వీనర్‌ ఎం.శ్రీనివాస్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీలో మెడికల్‌ పీజీ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన కొందరు విద్యార్థులను రీకౌంటింగ్‌ పేరుతో పాస్‌ చేసిన వ్యవహారంలో అనేక అక్రమాలు, అవినీతి జరిగాయని ఆరోపణలు రావడం ఆందోళనకరమనీ, ఈ అక్రమాలకు పాల్పడిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం(యూడీఎఫ్‌) రాష్ట్ర కన్వీనర్‌ ఎం.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. నీట్‌ పీజీ అడ్మిషన్లలో కూడా వర్సిటీ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనీ, జాతీయస్థాయిలో మొదటి రౌండ్‌ అడ్మిషన్లు పూర్తయినప్పటికీ ఇంకా ఇక్కడ మొదలు పెట్టకపోవడంతో మెడికల్‌ విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెడికల్‌ కాలేజీల్లో యూజీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు కొన్ని ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు ఎగ్గొడుతున్న తీరును ఎత్తి చూపారు. యూజీసీ ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న విద్యార్థులకు నెలకు రూ.25906 ఇవ్వాల్సి ఉండగా…ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు రూ.2 వేల నుంచి 5 వేల వరకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయని విమర్శించారు. పీజీ విద్యార్థులకు 58,289 చెల్లించాల్సి ఉండగా సగానికిపైగా ప్రయివేటు కళాశాలలు చెల్లించడం లేదని ఎత్తిచూపారు. స్టైఫండ్‌ కోసం విద్యార్థులు ఆందోళన చేసినప్పటికీ కాళోజీ వర్సిటీ అధికారులుగానీ, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గానీ పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. స్టైఫండ్‌ వివరాల కోసం మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే కాళోజీ వర్సిటీకి ఫార్వర్డ్‌ చేశారనీ, వర్సిటీ అధికారులేమో స్టైఫండ్‌ వ్యవహారం తమ పరిధిలో లేదని పంపారని తెలిపారు. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌కు అందిన రికార్డు ప్రకారం మెజారిటీ ప్రయివేటు మెడికల్‌ కళాశాలలు స్టైఫండ్‌ చెల్లించడం లేదని తేలిందని పేర్కొన్నారు. ఈ విషయంలో అధికారులు ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలతో కుమ్మక్కు కావడం వల్లనే ఈ దుస్థితి నెలకొందని తెలిపారు. స్టైఫండ్‌ చెల్లించని ప్రయివేటు మెడికల్‌ కాలేజీలపై తక్షణమే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -