నవతెలంగాణ-హైదరాబాద్: అనారోగ్య కారణాల వల్ల రాజ్యసభ మాజీ చైర్మెన్ జగదీప్ ధన్‌కర్ తన పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ అంశాన్ని ఇవాళ రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే లేవనెత్తారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ ఇవాళ రాజ్యసభ చైర్మెన్‌గా తొలిసారి బాధ్యతలు నిర్వర్తించారు. చైర్మన్ చైర్ లో ఆయన కూర్చున్న సమయంలో ఖర్గే మాట్లాడారు. రాధాకృష్ణన్‌కు స్వాగతం పలికిన ఆయన తన ప్రసంగంలో మాజీ చైర్మెన్ జగదీప్ ధన్‌కర్ అంశాన్ని ప్రస్తావించారు. జగదీప్ ధన్‌కర్‌కు సరైన రీతిలో ఫెర్‌వెల్ దక్కలేదని, దీని పట్ల బాధగా ఉందని ఖర్గే అన్నారు. ధన్‌కర్ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరారు.
ఖర్గే ఆరోపణలకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. ధన్‌కర్ రాజీనామా గురించి మాట్లాడవద్దు అని, చైర్ హుందాతనాన్ని ఎంతగా దిగజార్చారో తెలుసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కర్నీ గౌరవించాలని, ఇది చాలా దురదృష్టకరమన్నారు.



