నవతెలంగాణ – నకిరేకల్
ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ శ్రీరంగాచార్యను సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవ విశిష్ట పురస్కారం వరించింది. మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన సాహితీవేత్త డా. పెరుంబుదూర్ శ్రీరంగాచార్య, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఏటా ఇచ్చే విశిష్ట పురస్కారానికి ఎంపికయ్యారు. హైదరాబాద్ నాంపల్లి లోని తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిర్ లో ఈనెల 2న వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు ఈ పుర స్కారం ప్రదానం చేయనున్నారు.
పురస్కారం కింద రూ.1 లక్ష నగదు, ప్రశంసా పత్రం అందజేస్తారు. నల్లగొండ జిల్లా చందుపట్లలో జన్మించిన డాక్టర్ శ్రీ రంగాచార్య 3 దశాబ్దాల పాటు నాగర్ కర్నూల్ జిల్లా పాలెం ఓరియంటల్ కళాశాల అధ్యాపకులుగా, ప్రిన్సిపాల్ గా సేవలందించారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న శ్రీరంగాచార్య తెలంగాణలో గుర్తింపు నోచు కోకపోయిన 6 తరాల మరింగంటి కవుల కృతులను వెలుగులోకి తెచ్చి వాటికి ప్రాణ ప్రతిష్ట చేశారు. చందుపట్లలో రాణిరుద్రమ దేవి కాలం నాటి శాసనాన్ని వెలుగులోకి తెచ్చిన శ్రీరంగాచార్య పలువురు నల్లగొండ జిల్లా కవులు, పండితులను సమాజానికి పరిచయం చేశారు.ఇప్పటి వరకు 30కి పైగా పురస్కారాలను అందుకున్నారు.



