హైరానా పడుతున్న అభ్యర్థులు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేయడంతో నామినేషన్ దాఖలు కోసం తప్పనిసరిగా ఓపెన్ చేయాల్సిన జీరో అకౌంట్ల విషయంలో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిసెంబర్ 3న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న పలువురు ఆశావహులు జీరో ఖాతాలు తెరిచేందుకు సోమవారం కమ్మర్‌పల్లి యూనియన్ బ్యాంకు కార్యాలయానికి వెళ్లారు.అయితే అక్కడ అకౌంట్ ఓపెన్ చేసే సంబంధిత అధికారులు ఇద్దరు మూడో తేదీ వరకు సెలవుల్లో ఉన్నారని బ్యాంక్ సిబ్బంది చావు కబురు చల్లగా చెప్పడంతో ఆశావాహులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
ఎన్నికల వేళ కీలక సేవలు నిలిచిపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ ప్రక్రియకు అవసరమైన బ్యాంకు ఖాతా తెరవడానికి వేచి చూడాల్సి రావడం తమకు తీవ్ర ఇబ్బంది కలిగించిందని పలువురు ఆశావాహులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఒకే ఒక్క ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంకు మాత్రమే ఉంది. దీంతో మూడో తేదీ వరకు జీరా ఖాతాలు తెరిచేందుకు వేచి చూడాల్సి రావడంతో ఆశావాహులు అసహన వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజునుంచే బ్యాంకులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పోటీ చేసే అభ్యర్థులకు వెంటనే జీరో అకౌంట్ బుక్ ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందని పేర్కొంటున్నారు.



