మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఒక్క పని కూడా చేసింది లేదు
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ – వనపర్తి
పాలమూరులో తట్ట మన్ను తీయలే కానీ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఒక్క పని కూడా చేసింది లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అని విమర్శించారు. సోమవారం మక్తల్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం తప్ప రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చేసింది ఏం లేదని, చూసుకోని ముర్వ .. చెప్పుకుని ఏడ్వ అన్నట్లుంది పాలమూరు పరిస్థితి ఏర్పడిందన్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి.. తప్ప ఒక్క పని కూడా చేసింది లేదన్నారు.
శంకుస్థాపనలు తప్ప రెండేళ్లలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ పాఠశాలలు ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. కేసీఆర్ హయాంలో చేసిన అప్పుల గురించి అబద్ధాలు చెప్పడానికి కొంచెం అయినా సిగ్గు ఉండాలన్నారు. పదేళ్లలో కేసీఆర్ హయాంలో చేసిన అప్పు కేవలం రూ.3.48 లక్షల కోట్లు .. చేసిన అభివృద్ధి, గణాంకాలు కండ్ల ముందు ఉన్నాయన్నారు. కేవలం రెండేళ్లలో కార్పోరేషన్ రుణాలు కాకుండానే రూ.2.50 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. సంక్షేమ పథకాలు ఎగ్గొట్టారు .. అభివృద్ధి పనులు పక్కనపెట్టారన్నారు. రైతులను గాలికి, పంటలను వాటి కర్మానికి వదిలేశారన్నారు. బోనస్ అని బోగస్ మాటలు చెప్పారని, బ్రోకర్ల అవతారం ఎత్తారన్నారు. తెలంగాణ రైజింగ్ అంటూ అప్పులు తెస్తుండడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు.
కరోనా కష్టకాలం లోనూ తెలంగాణ రెవెన్యూ 25 శాతం వరకు పెరిగిందన్నారు. కాంగ్రెస్ పాలన పుణ్యాన ఈ ఏడాది – 0.76 % శాతానికి పడిపోయిందని విమర్శించారు. అడ్డగోలు అప్పులు చేసి అభివృద్ధిని తిరోగమనం వైపు నడిపిస్తూ రైజింగ్ అంటూ పొంకనాలు కొట్టడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనమన్నారు. కూట్ల రాయి తీయలేనోడు .. ఏట్ల రాయి తీస్తా అన్నాడట అని ఏద్దేవా చేశారు. కొడంగల్ సభలో రేవంత్ 2034 నాటికి ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పంచాయతీలను రెండేళ్ల పాలనతో భ్రష్టు పట్టించిన రేవంత్ అభివృద్ధి గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారన్నారు. పాలమూరు ప్రాజెక్టులను గాలికి వదిలేశారన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి సాగునీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.



