దేశంలో ఆకాశాన్ని తాకే ఎత్తయిన విగ్రహాలు నెలకొల్పడానికి అడవులను ఛిద్రం చేసి, పర్యావరణాన్ని భ్రష్టు పట్టించి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, అడవినే ఆవాసంగా చేసుకున్న ఈ దేశ మూలవాసుల సంక్షేమం పూర్తిగా తుంగలో తొక్కింది. భారతదేశంలో దేశీయ భాషలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. సరైన నోటిఫైడ్, డీనోటిఫైడ్ కమ్యూనిటీల భాషలపై పరిశోధన ఇంకా నిర్వహించబడలేదు. కొన్ని అంచనాల ప్రకారం ఎన్టీ/ఎస్‌ఎన్టీకి చెందిన 198 సంఘాలున్నాయి. డిఎన్టీ కమ్యూనిటీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వాటిపై విస్తరించాయి. ఒక్క ఏపీలోనే 59 సెక్షన్లు ఉన్నాయి. విస్తారమైన జ్ఞానం, వారి ఔషధ అభ్యాసం, పర్యావరణ జ్ఞానం, వాతావరణ నమూనాలు, కళాత్మక పౌరాణిక కథలు వీరి కళలు. ఇంతకు ముందు జంగం కథలుగా ఈనాడు, బుర్రకథగా పిలువబడేది. ఒకనాడు మతప్రబోధకు ప్రతిబింబంగా నిలబడిన జంగం కథా కళారూపం రానురానూ యాచనకు, ఉదర పోషణకూ ఉపయోగపడి తిరిగి నేడు దేశభక్తిని ప్రబోధిస్తూ, ప్రజా సమస్యలను చిత్రిస్తున్నది. జంగం కథలు చెప్పేవారిని బుడిగె జంగాలని పిలుస్తారు.
షెడ్యూల్డ్ తెగలు, సంచార డీనోటిఫైడ్ తెగలు ప్రధానమైనవి వారు మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలి. జటాపు, కొండ దొర, మూక దొర, మన్నె దొర, సవర, గదబ, చెంచు, కోయ, గొంది, దాసరి, ఎరుకల, యానాది, సుగాలి, కొరవ, కొరచ, కైడై నక్కలా ఏపీలోని కొన్ని డినోటిఫైడ్ తెగలు. ఇంకా, వడ్డెర, పాముల, నిర్షికారి, బుడబుక్కల, మందుల, పూసల, గంగి, రెడ్దుల, బోయ, దొమ్మర, జోగి సంచార పాక్షిక సంచార తెగలలో కొన్ని. సాంప్రదాయ అంటరానితనం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అత్యంత సాంఘిక, ఆర్థిక వెనుకబాటు తనానికి గురవుతున్నారు. ప్రధాన అర్హత కలిగిన షెడ్యూల్ కులాల్లో ఇంకా అణగారిన, ఏమాత్రం గుర్తింపు లేని జంగమ దేవర, డక్కలి, కిన్నెర జోగులు, బేడ బుడగ జంగాల కులాలు నేడు కనుమరుగై పోతున్నాయి. జంగమోళ్లు వీరిని జంగం దేవర అని కూడా అంటారు.
నొసటన వీభూతి ధరించి చేతిలో పెద్దగంట పట్టుకొని వాయిస్తూ సంక్రాంతి సందర్భంగా ఆ నెలంతా తెల్లవారుజామున వీదుల్లో తిరుగుతు శివ కీర్తనలు చేస్తూ ప్రతి ఇంటికి వచ్చి సంభావన తీసుకునే వారు. అప్పటికే వీరు అంతిమ దిశలో వుండేవారు. వీరు అంతరించి చాల కాలమే అయింది. జంగం వారి జనాభా అతి తక్కువ.షెడ్యూల్డ్ కులాల జాబితాలో తొమ్మిదవ కులం బేడ బుడగ జంగం. బుడిగ, బేడ ఇలా రెండు రకాలుగా పిలువబడతారు. వీరు బుర్ర కథలు చెబుతారు. పగటివేషాలు, భిక్షాటన ఇవన్నీ వీరి కుల వృత్తులు. వీరికి సొంత భాష ఉంది. పెరుగుతున్న సాంకేతికతో పోటీ పడలేక తమ తెగలు తరుగుతున్నవని వాపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం పౌర సమాజం తమ కళను పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో కూలీ పనులకు వెళ్తున్నారు. కులవృత్తి అంతరిస్తున్న తరుణంలో ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని వారు కోరుతున్నారు.
- ఎం. సురేష్ బాబు



