Tuesday, December 2, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివి'నాసిక్‌' నిర్ణయం

వి’నాసిక్‌’ నిర్ణయం

- Advertisement -

మన జీవన విధానం ప్రత్యేకమైనది. సాటి మానవుల పట్ల సహానుభూతితో పాటు, పశుపక్ష్యాదుల పట్ల ఆదర భావం, పర్యావరణం పట్ల బాధ్యత కలిగి ఉండాలన్నది ఇక్కడి సంస్కృతిలోని సందేశం. అనాదిగా ఉత్సవాలు, పండుగలు ప్రకృతిని కాపాడుకోవడానికి, పర్యావరణానికి మేలు జరగటానికి, మనుషుల మధ్య సంబంధాలను కాపాడుకోవడానికి అనే సందేశాన్నిస్తూ ఉంటాయి. కానీ, కుంభమేళా పేరుతో మహారాష్ట్రలోని నాసిక్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తీసుకున్న నిర్ణయం పర్యావరణానికి చేటుచేస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండువేల భారీ వృక్షాలను తొలగించి పన్నెండు వందల ఎకరాల్లో సాధు గ్రామాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఒకవైపు భూతాపం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో బహుళ వాతావరణ ముప్పు, విధ్వంసాలు అధికమవుతాయి. వడగాలులు, కరవు, అకాల వర్షాలు, వరదలు ఇలా.. వరుసగా వచ్చే విపత్తులు వినాశాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ, నీటివ్యవస్థలు, మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

ఇప్పటికే ఢిల్లీ గాలికాలుష్యంతో తల్లడిల్లుతుంది. ఇలాంటి తరుణంలో చెట్లను పెంచుతూ పర్యావరణాన్ని కాపాడు కోవాల్సింది పోయి… పెద్దసంఖ్యలో చెట్లను కొట్టేయడానికి తీర్మానం చేయడం ఎంత దుర్మార్గం. ”చెట్లను కొట్టివేయడం మనుషుల్ని చంపడం కంటే దారుణం” అని తాజాగా ఓ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు చట్ట విరుద్ధంగా నరికివేతకు గురైన ప్రతి చెట్టుకు రూ.లక్ష చొప్పున బాధ్యులకు జరిమానా విధించింది కూడా. మరి ఇవేమి నాసిక్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు పట్టవా? ఒక చెట్టుకు రూ.లక్ష చొప్పున రెండు వేల చెట్లకు నాసిక్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎంత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది? కుంభమేళా పేరుతో చెట్లను నరికివేసి, ఆ భూమిని తమకు ఇష్టమైన పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని రాజ్‌థాకరే విమర్శలలో నిజం లేకపోలేదు. ‘ప్రభుత్వానికి వేరే చోట ఐదురెట్లు ఎక్కువ చెట్లను నాటడానికి స్థలం ఉంటే, అక్కడే సాధు గ్రామాన్ని ఎందుకు నిర్మించకూడదు’ అని రాజ్‌థాకరే ప్రశ్నకు ఇప్పటివరకు బదులు లేదు.

‘చెట్లు మన అమ్మానాన్నలు. సాధుగ్రామం కోసం ఒక్క చెట్టును కూడా మేము నరకనీయం. సాధువులు వస్తారు, వెళ్తారు..పెద్ద తేడా ఏమీ ఉండదు. కానీ చెట్లు మాయమైతే అది మన జీవి తాలపై, భవిష్యత్‌ తరాలపై ప్రభావం పడుతుంది. చెట్లు కాపాడాల్సిన అవసరం ఉంది. దీని వెనుక ఎలాంటి రహస్య ఎజెండా ఉండకూడదు’ అంటూ ప్రముఖ నటుడు షియాజీ షిండే పర్యావరణవేత్తలకు మద్దతు ప్రకటించారు. చెట్లను నరికేసి నాసిక్‌ ప్రజలను ఎగతాళి చేయవద్దని కూడా వ్యాఖ్యానించారు. చెట్ల నరికి వేతను స్థానిక ప్రజలు కలికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం పట్టుదలకు పోతే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఇలా సెలబ్రెటీలందరూ కదలాల్సిన అవసరం ఉంది. సముద్రాల, నదుల, పర్వతాల, అడవుల ఉనికికి ముప్పుగా పరిణమించే విధానాలు అమలవుతున్నాయి. ఫలితంగా రానున్న యాభైయేండ్లలో ఊహించని విపత్కార పరిస్థితులు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని అనేక అధ్యయనాలు ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పన్నెండువందల ఎకరాల్లో వేల చెట్లను తొలగించి సాధులకు వసతి కల్పించడమనే ఆలోచన ఎంత దుర్మార్గమైనది. అడవుల్ని అంటిపెట్టుకుని శతాబ్దాలుగా జీవిస్తున్న జనాన్ని, వారి జీవన మనుగడను ప్రశ్నార్ధకం చేయడమే అవుతుంది. గత రెండు మూడు దశాబ్దాల్లో చోటుచేసుకున్న విపత్తులు నగరాల ఉనికినే చెల్లాచెదరు చేశాయనే వాస్తవాన్ని కూడా మరువొద్దు. అడవుల నరికివేత కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందన్న సత్యాన్ని పాలకులు గుర్తించకపోవడం శోచనీయం. చెరువులు, నదులు వంటి జలవనరులను ఆక్రమించుకోవడం కారణంగా వరదల ద్వారా ప్రకృతి ప్రకోపాన్ని మనం అనుభవిస్తున్నాం.

అయినా గుణపాఠాలు నేర్వకపోగా… విధ్వంస నిర్ణయాలు తీసుకోవడం అత్యంత హేయమైన చర్య. డెబ్భయ్యవ దశకం నాటి చిప్కో ఉద్యమం మొదలుకొని మొన్నటి దామగుండాల నేటి పంచవటి, తపోవన్‌ ప్రాంతంలో చెట్ల రక్షణో ద్యమం వరకు ఎంతోమంది పర్యావరణవేత్తలు, పర్యావరణ ప్రమాదాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. మూడు వందల చెట్లను కాపాడుకునేందుకు జరిగిన ‘చిప్కో’ ఈ ఐదు దశాబ్దాల కాలంగా దేశంలో అనేక కీలకమైన సహజ వనరులు, పర్యావరణ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. నేడు సినీ నటులు షియాజీ షిండే స్పందించే సమూహాన్ని మరోసారి తట్టిలేపారు. ఈ పిలుపులో సహజ వనరుల పరిరక్షణ కోసం తపించే శక్తులు, వ్యక్తులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ హితులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాలు, కవులు, రచయితలు ప్రతిఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -