Tuesday, December 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఓ మధ్య తరగతి యువకుడి ప్రేమకథ

ఓ మధ్య తరగతి యువకుడి ప్రేమకథ

- Advertisement -

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.32గా రూపొందుతున్న చిత్రానికి ‘ఎపిక్‌ – ఫస్ట్‌ సెమిస్టర్‌’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు. ‘బేబీ’ వంటి సంచలన విజయం తరువాత ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. ’90ఎస్‌’ వెబ్‌ సిరీస్‌తో అందరి మనసులు దోచుకున్న ఆదిత్య హాసన్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తోంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆర్కే సినీప్లెక్స్‌లో ‘ఎపిక్‌ – ఫస్ట్‌ సెమిస్టర్‌’ టైటిల్‌ గ్లింప్స్‌ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో హీరో ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ,గ్లింప్స్‌లో ఆదిత్య ఎలాగైతే అమ్మాయితో మాట్లాడాడో, నేను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు అలాగే తడబడుతూ మాట్లాడేవాడిని. అలాంటి ఆదిత్య పెద్దయ్యాక తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల లండన్‌కి వెళ్తే.. అక్కడ ఏం జరిగింది?, ప్రేమ కథ ఏంటి? వంటి అంశాలతో ఈ సినిమా ఉంటుంది. ఇందులో ప్రతి అంశం, ప్రతి సన్నివేశం అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది.

లండన్‌లో జరిగే కథ అయినా.. ఇది మన ఇంట్లో జరిగే కథలా ఉంటుంది’ అని తెలిపారు. ‘ఇది యువతకు నచ్చే అందమైన ప్రేమ కథ. హీరో పాత్రకు చాలామంది అబ్బాయిలు కనెక్ట్‌ అవుతారు. హీరోయిన్‌ పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. జీవితంలో మనం దాటి వచ్చిన చిన్న చిన్న అందమైన జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది’ అని కథానాయిక వైష్ణవి చైతన్య అన్నారు. దర్శకుడు ఆదిత్య హాసన్‌ మాట్లాడుతూ, ‘మన చుట్టూ జరిగే చిన్న కథలను తీసుకొని, వాటిని అందంగా తెరపైకి తీసుకురావడం నాకు ఇష్టం. ఇదొక మధ్యతరగతి యువకుడి ప్రేమ కథ. సినిమా చూసేటప్పుడు ప్రతి ఒక్కరూ తమని తాము ఊహించుకుంటారు. ప్రతి సన్నివేశం మీకు నచ్చుతుంది’ అని తెలిపారు. ”ఎపిక్‌ – ఫస్ట్‌ సెమిస్టర్‌ అని ఎందుకు పెట్టామంటే.. ఇది మొదటి భాగం. దీనికి కొనసాగింపు కూడా ఉంటుంది. నేను వ్యక్తిగతంగా ఈ తరహా చిత్రాలకు పెద్ద అభిమానిని. ఒక మంచి సినిమా చేశాం’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -