గ్రానైట్, రియల్ ఎస్టేట్, ఇసుక దందా గ్రామాల్లో సర్పంచ్ పదవులకు రూ.50 లక్షలు
నామినేషన్ల ఉపసంహరణకు లక్షల ఆఫర్లు, బెదిరింపులు
నేడు ఉపసంహరణకు చివరి తేదీ
బుజ్జగింపులు, బెదిరింపులు
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న పంచాయతీ ఎన్నికల్లో గ్రానైట్, ఇసుక క్వారీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న గ్రామాల్లో పోటీ తీవ్రరూపం దాల్చింది. ఈ గ్రామాల ఆదాయం రూ.కోట్లలో ఉండటంతో, సర్పంచ్ పదవిని దక్కించుకోవడానికి అభ్యర్థులు రూ.లక్షల్లో.. అదీ కొన్ని చోట్ల రూ.50 లక్షల వరకు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడటం లేదంటే అతిశయోక్తి కాదు. అధికార పక్షంతోపాటు ప్రతిపక్షాలు కూడా పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనికితోడు, మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణకు నేడు(డిసెంబర్ 3) చివరి తేదీ కావడంతో, పోటీలో ఉన్న అభ్యర్థులను ఉపసంహరించుకునేలా చేయడానికి బుజ్జగింపులు, బెదిరింపులు పతాక స్థాయికి చేరాయి. అందులోనూ కరీంనగర్ జిల్లాలోని పలు పంచాయతీల్లో నామినేషన్ పత్రాల ఉపసంహరణకు నయానో-భయానో ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. కరీంనగర్ రూరల్, గంగాధర, కొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామాల ఆర్థిక వనరులు, ముఖ్యంగా గ్రానైట్ క్వారీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కారణంగా ఊహించని అక్కడ ఎన్నికల ఖర్చు కాబోతోంది.
ఈ వ్యాపారాల ద్వారా సీనరేజీ నిధుల కింద ఆయా గ్రామాలకు రూ.కోట్లలో ఆదాయం వస్తుండటంతో, సర్పంచ్ పదవి కేవలం గౌరవంతోపాటు అధికారిక గుర్తింపు, నిధులపై ‘చెక్ పవర్’ వంటి కీలక అధికారాలను చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో గంగాధర మండలం ఒద్యారం, గట్టుభూత్కూర్, చిన్న ఆచంపల్లి, పెద్ద ఆచంపల్లి, కొత్తపల్లి మండలం కమాన్‌పూర్, ఖాజీపూర్, ఎలగందల్ వంటి గ్రామాల్లో క్వారీ వ్యాపారంతో ఇక్కడ సర్పంచ్ స్థానాలతోపాటు వార్డుల్లోనూ పోటీ తీవ్రమైంది. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగే నగునూర్, మొగ్దుంపూర్ వంటి గ్రామాల్లో గ్రామ పాలకవర్గానికి ప్రాధాన్యం పెరిగింది. ఈ గ్రామాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ పట్టు నిలుపుకోవడానికి, ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి రూ.50 లక్షలైనా ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారు. గంగాధర మండలంలోనే ప్రతి గ్రామంలోనూ నలుగురి నుంచి 18 మంది వరకు బరిలో ఉండటం గమనార్హం.
బుజ్జగింపులు.. బెదిరింపులు
మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసి, ఉపసంహరణకు గడువు దగ్గర పడుతుండటంతో, పోటీలో ఉన్న బలమైన అభ్యర్థులు తమ ప్రత్యర్థులను తప్పించేందుకు అన్ని రకాల వ్యూహాలూ అమలు చేస్తున్నారు. ఉపసర్పంచ్ పదవి సైతం కీలకం కావడంతో, తమకు పోటీగా నిలిచే అభ్యర్థులకు నామినేషన్ ఉపసంహరించుకోవడానికి రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ముట్టజెప్పడానికి సిద్ధమవుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేల ముఖ్య అనుచరులు, అధికార పార్టీ నేతలు మండల కేంద్రాలు, ప్రధాన పంచాయతీల్లో పోటీ లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఏకగ్రీవాలకునో.. పోటీకే సై..
గత ఎన్నికల్లో ఏకగ్రీవమైన పంచాయతీలకు రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులు (స్థానిక ఎమ్మెల్యే మరో రూ.10 లక్షలతో కలిపి రూ.20 లక్షలు) ప్రకటించినప్పటికీ, ఆ నజరానా ఇప్పటికీ అందలేదు. దీంతో ఈసారి గ్రామస్తులు, అభ్యర్థులు ఏకగ్రీవాలపై ఆసక్తి చూపడం లేదు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 107 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనా, వారికి రావాల్సిన రూ.21.20 కోట్ల ప్రోత్సాహక నిధులు విడుదల కాలేదు. అప్పులు తెచ్చి పనులు చేసిన సర్పంచ్‌లు ఇంకా బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోవడం, పదేండ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు పోటీకి సై అనడంతో, ఏకగ్రీవాల కన్నా పోటీలో నిలబడటానికే ఆశావహులు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు బలమైన ప్రత్యర్థిని ఓడించడానికి ఒక గ్రూపు ఓట్లను చీల్చేందుకు మూడో వ్యక్తిని బరిలో దింపడం వంటి వ్యూహాలు అమలు చేస్తున్నారు. గ్రూపులన్నీ ఒక్కటవడం, కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించడం, దేవుళ్లపై ఒట్టేసి ప్రమాణాలు చేయడం వంటి జిమ్మిక్కులు సైతం కొనసాగుతున్నాయి.



