Tuesday, December 2, 2025
E-PAPER
Homeజాతీయంకేంద్రానికి ఆదాయంలో తెలంగాణ కీలక పాత్ర

కేంద్రానికి ఆదాయంలో తెలంగాణ కీలక పాత్ర

- Advertisement -

– రాష్ట్రం నుంచి రూ.4.35 లక్షల కోట్లకు పైగా వసూలు
– తిరిగి ఇచ్చింది రూ.3.76 లక్షల కోట్లు : కేంద్ర ఆర్థికశాఖ సమాచారం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

తెలంగాణ రాష్ట్రం.. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. గడిచిన ఆరేండ్లలో (2019-20 నుంచి 2024-25 వరకు) తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో ఏకంగా రూ. 4,35,919 కోట్లు వసూలు చేసింది. తిరిగి రాష్ట్రానికి పన్నుల వాటా, గ్రాంట్లు, పథకాల కింద రూ. 3,76,175 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా వెల్లడించింది. అంటే రాష్ట్రం చెల్లించిన దానికంటే సుమారు రూ. 60 వేల కోట్లు తక్కువగా నిధులు తిరిగి వచ్చాయి. సోమవారం లోక్‌సభలో నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ ధర్మపురి.. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు, రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల వివరాలపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

రికార్డు స్థాయికి వసూళ్లు
తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తున్న ఆదాయం రాకెట్‌ వేగంతో పెరుగుతోంది. ముఖ్యంగా 2019-20లో రూ. 14 వేల కోట్లుగా ఉన్న ప్రత్యక్ష పన్నుల వసూళ్లు.. 2024-25 నాటికి ఏకంగా రూ. 97 వేల కోట్లకు చేరడం గమనార్హం. 2019-25 మధ్య తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి మొత్తం రూ. 4,35,919 కోట్లు పన్ను వసూళ్లు చేరాయి. ఇందులో సింహభాగం రూ. 2.74 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నులే ఉన్నాయి. ఐజీఎస్టీ రూ. 86 వేల కోట్లు, సీజీఎస్టీ రూ. 74 వేల కోట్లు వసూలయ్యాయి. అయితే ఇదే సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది మాత్రం రూ. 3,76,175 కోట్లు. ఇందులో పన్నుల వాటా కింద రూ. 1,17,860 కోట్లు, కేంద్ర రంగ పథకాల కింద రూ. 1,22,549 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రూ. 81,506 కోట్లు, ఫైనాన్స్‌ కమిషన్‌ గ్రాంట్లుగా రూ.16,119 కోట్లు, ఇతర గ్రాంట్లు/రుణాల రూపంలో: రూ. 30,949 కోట్లు రాష్ట్రానికి అందాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -