Tuesday, December 2, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకష్టానికి విలువేది?

కష్టానికి విలువేది?

- Advertisement -

అధోగతిలో అసంఘటితరంగ కార్మికుల జీవితాలు
రెక్కలు ముక్కలు చేసుకున్నా పూటగడవని బతుకులు
సంఘటితశక్తిగా మారితేనే మార్పు
పేరుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు – అమలు శూన్యం
భేష్‌గా కేరళ ప్రభుత్వ సంక్షేమ బోర్డులు

రాష్ట్రంలో కోటి మందికి పైగానే అసంఘటిత కార్మికులున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో, ఆదాయాన్ని సమకూర్చి పెట్టడంలో నెత్తిన బరువంతా మోస్తున్నా వారి జీవితాలకు మాత్రం అదరవు లేదు. ఇప్పటికీ పూటగడవని బతుకులే… కనీస వేతనాల జీవోలను అమలు చేయడానికి కూడా పాలకులకు చేతులు రావడం లేదు. లాభాలను వదులు కోవడానికీ, కార్మికులకు జీతాలు పెంచడానికి యాజమాన్యాలు ఇష్టపడట్లేదు. ప్రభుత్వమూ వారికే కొమ్ముకాస్తున్నది. పైగా, 12 గంటలు పనిచేయాల్సిం దేనంటూ హుకుం జారీ చేస్తున్నది. అసంఘటిత కార్మికులను ఉద్ధరిస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి కోసం ప్రకటించిన సంక్షేమ పథకాలను బుట్టదాఖలు చేస్తున్నాయి.

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అసంఘటితం… సంఘటితమై హక్కుల కోసం గళం ఎత్తి, గర్జిస్తేనే పాలకులు దిగివస్తారని చరిత్ర రుజువు చేస్తోంది. పిడికిలి బిగించి కార్మిక పక్షపాతిగా ఉండే కేరళలోని సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం 17 వెల్ఫేర్‌ బోర్డులను ఏర్పాటు చేసింది. వారికి మెరుగైన జీవితం అందించడానికి ఇతోధికంగా దోహదపడుతున్నది. రాష్ట్రంలో అసంఘటిత కార్మికులు కోటి మంది ఉన్నారు. అందులో అత్యధికంగా భవన నిర్మాణ కార్మికులు 30 లక్షల మంది ఉన్నారు. వారిలో నాలుగు లక్షలకుపైగా వలస కార్మికులున్నారు. వీరే కాకుండా అసంఘటిత రంగ కార్మికుల జాబితాలో ట్రాన్స్‌పోర్టు రంగ కార్మికులు 25 లక్షల మంది, బీడీ రంగ కార్మికులు ఎనిమిది లక్షల మంది, గిగ్‌ వర్కర్లు నాలుగు లక్షల మంది, తోపుడు బండ్ల కార్మికులు మూడు లక్షల మంది, మార్కెట్లలో గుమాస్తాలు రెండు లక్షల మంది, గ్రానైట్‌ కార్మికులు లక్ష మంది, హోటల్‌ కార్మికులు మూడు లక్షల మంది, సెక్యూరిటీ గార్డులు నాలుగు లక్షల మంది, ఇంటి పనివారు లక్ష మంది ఉన్నారు.

వీరిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన సామాజిక తరగతుల వారే ఉన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కూరుకుపోవడం, చేతివృత్తులు దెబ్బతినటంతో అసంఘటిత కార్మికుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. వీరంతా ఎలాంటి సామాజిక, ఆర్థిక భద్రతలకు, చట్టబద్ధ హక్కులకు నోచుకోవడం లేదు. ఇటీవలి కాలంలో పర్మినెంట్‌ ఉద్యోగాలు తగ్గి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, ఫిక్స్‌డ్‌టర్మ్‌, డైలీవేజ్‌ ఉద్యోగాలు పెరుగుతున్నాయి. దీంతో వారి జీవితాలకు, జీతాలకు భద్రత లేకుండా పోతున్నది. అసంఘటిత కార్మికుల అనేక పోరాటాల ఫలితంగా సామాజిక భద్రత చట్టం వచ్చింది. రూల్స్‌ ఇంకా రూపొందకుండానే లేబర్‌కోడ్‌లతో ఆ చట్టం రద్దయిపోయింది.

గొప్పలకే కేంద్ర ప్రభుత్వ పథకాలు… కార్మికులకు దక్కని ప్రయోజనాలు
పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికుల కోసం తీసుకొచ్చిన పథకాలు తయారయ్యాయి. కార్మికులకు దక్కిన ప్రయోజనాలేం లేవు. అసంఘటిత కార్మికులు తమ వేతనంలో కొంత సొమ్మును కడితే ప్రధానమంత్రి శ్రమయోగిమన్‌ధన్‌ పథకం ద్వారా 48 ఏండ్లు దాటిన కార్మికులకు పెన్షన్‌ ఇస్తామని ప్రకటించింది. ఇప్పటివరకూ అతీగతీ లేదు. ఈ శ్రమ పోర్టల్‌లో రాష్ట్రానికి చెందిన 40 లక్షల మందికిపైగా కార్మికులు చేరారు. ఆ పథకంలో చేరిన తర్వాత కార్మికులకు ప్రమాదం జరిగినా, మరణించినా రెండు లక్షల రూపాయల పరిహారం ఇస్తామని ప్రకటించింది. కానీ, తెలంగాణలో నష్టపరిహారం అందిన దాఖలాలు లేవు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరులు ఈ శ్రమ పోర్టల్‌ ఆర్భాట ప్రచారం చేస్తున్నారు. కానీ అమల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకం, పీఎం జీవన్‌ జ్యోతి పథకాలు కూడా గాలిలో దీపంలా మారాయి.

హామీలకే రాష్ట్ర సర్కారు పరిమితం
రాష్ట్రంలోని అసంఘటిత కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో గొప్పగా ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక, కేంద్రంలోని మోడీ సర్కార్‌ బాటనే నడుస్తున్నది. హమాలీలకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేస్తామనీ, ప్రతి మండలంలోనూ హమాలీల కోసం ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా ఆ హామీలేవీ పట్టాలెక్కలేదు. ఆటో డ్రైవర్లకు ఏటా 12 వేల ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. అదీ అమలు కాలేదు. ఫుట్‌పాత్‌ వ్యాపారులకు ఆర్థిక సహాయం అందిస్తామనీ, వడ్డీలేని రుణాలిస్తామనీ, బీడీ కార్మికులకు ప్రయోజనం చేకూరేలా నాలుగు వేల రూపాయల జీవన భృతి ఇస్తామని ప్రకటించిన హామీలేవీ అమల్లోకి రాలేదు.

ఆదర్శంగా కేరళ
కార్మిక పక్షపాతిగా వ్యవహరించే కేరళలోని వామపక్ష ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తోంది. తమ రాష్ట్ర కార్మికులకే కాకుండా వలస ఆతిథ్య కార్మికులుగా గుర్తించి, వారికీ హక్కులను కల్పిస్తున్నది. అసంఘటిత కార్మికుల కోసం 17 రకాల సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసింది. హమాలీ కార్మికులకు ప్రమాదబీమా, ఆరోగ్య బీమా పథకాలను అమలు చేస్తున్నది. ప్రమాదంలో హమాలీ కార్మికుడు చనిపోతే రూ.10 లక్షల పరిహారం బాధిత కుటుంబానికి అందజేసి ఆర్థిక చేయూతనిస్తున్నది. గాయపడ్డవారికీ తీవ్రతను బట్టి పరిహారమిస్తున్నది. ఇండ్లు లేని కార్మికులను గుర్తించి సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఒక్కొక్కరికి రూ.7.80 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నది. పీఎఫ్‌ చట్టం పటిష్టంగా అమలవుతున్నది.

సంఘటితమై పోరాడితేనే హక్కులు
తెలంగాణ జనాభా మూడున్నర కోట్లు. అందులో అసంఘటిత కార్మికులే సంఖ్య చూస్తే కోటికిపైగానే ఉంది. జనాభాలో 30 శాతం వరకు ఉన్న అసంఘటిత కార్మికులు గోస పాలకులకు పట్టడం లేదు. వీరికి బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు అయ్యాయి. అదే సమయంలో కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం చేపట్టిన పురోగతి నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో హక్కుల కోసం అసంఘటిత కార్మికులు విడివిడిగా పోరాటాలు చేస్తున్నప్పటికీ, వారంతా విశాల వేదికపైకి వచ్చి సంఘటితంగా పోరుబాట పడితేనే పాలకులు కదిలివస్తారు. వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తారు. సీఐటీయూగా మేం ఐక్య ఉద్యమాలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. -వంగూరి రాములు, సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -