అక్టోబర్‌లో 0.4 శాతానికి పతనం
సన్నగిల్లిన తయారీ రంగం
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) మందగించింది. ప్రజల ఆదాయాలు సన్నగిల్లడంతో డిమాండ్ పడిపోవడంతో అంతిమంగా పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ముఖ్యంగా విద్యుత్, మైనింగ్, తయారీ రంగాలు అత్యంత పేలవమైన డిమాండ్‌ను చవి చూశాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి సూచీ 0.4 శాతానికి మందగించింది. కేంద్ర గణాంకాల శాఖ (ఎన్‌ఎస్‌ఓ) సోమవారం విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. ఐఐపీ 0.4 శాతానికి పరిమితమై ఏడాది కనిష్ట స్థాయిని చవి చూసింది. 2024 అక్టోబర్‌లో 3.7 శాతం వృద్ధిని కనబర్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ ఐఐపీ గణాంకాలను 4 శాతం నుంచి 4.6 శాతానికి సవరించింది. ఐఐపీలో ప్రధానమైన తయారీ రంగం 2025 అక్టోబర్‌లో 1.8 శాతం పెరుగుదలతో సరిపెట్టుకుంది.
గతేడాది ఇదే నెలలో తయారీ రంగం 4.4 శాతం వృద్ధిని సాధించింది. ఇదే నెలలో మైనింగ్ ఉత్పత్తి మైనస్ 0.9 శాతంగా ఉండగా.. గడిచిన అక్టోబర్‌లో రెట్టింపై మైనస్ 1.8 శాతానికి క్షీణించింది. విద్యుత్ ఉత్పత్తి 2024 అక్టోబర్‌లో మైనస్ 2 శాతంగా ఉండగా.. 205 అక్టోబర్‌లో మరింత పతనమై మైనస్ 6.9 శాతానికి కుంచించుకుపోయింది. క్యాపిటల్ గూడ్స్ విభాగం 2.4 శాతానికి తగ్గగా.. ఏడాది క్రితం 2.9 శాతం పెరుగుదల ఉంది. కన్స్యూమర్ డ్యూరెబుల్ప్ ఉత్పత్తి 4.4 శాతం నుంచి 2.8 శాతానికి పడిపోయింది. తయారీ రంగంలో 23 పరిశ్రమల విభాగాల్లో 9 మాత్రమే సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్-అక్టోబర్ కాలంలో దేశ పారిశ్రామిక ఉత్పత్తి 2.7 శాతానికి పడిపోయింది. గతేడాది ఇదే కాలంలో 4 శాతం పెరుగుదల చోటు చేసుకుంది.



