ఉత్తర, మధ్య భారత రాష్ట్రాలపై అధిక ప్రభావం
సాధారణం కంటే ఎక్కువ చలి తీవ్రత : ఐఎండీ హెచ్చరిక
న్యూఢిల్లీ : ఈ శీతాకాలంలో దేశంలోని పలు ప్రాంతాలు మరింత చలితో వణికిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘చలిగాలి రోజులు’ సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, తూర్పు యూపీ, ఉత్తర మధ్యప్రదేశ్, పడమటి మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్లలో ఈ ప్రభావం ఎక్కువ ఉండనున్నదని తెలిపింది. చలి గాలుల నిర్వచనాన్ని కూడా ఐఎండీ స్పష్టం చేసింది. మైదాన ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువ, కొండ ప్రాంతాల్లో 0 డిడ్రీలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే దానిని చలిగాలి రోజుగా పరిగణిస్తారు. అలాగే సాధారణ కనిష్ట ఉష్ణోగ్రత కంటే 4.5 నుంచి 6.4 డిగ్రీలు తగ్గినా అదే కోవలోకి వస్తుంది.
డిసెంబర్-ఫిబ్రవరి మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు దేశంలోని కేంద్ర, సమీప ద్వీపకల్ప, వాయువ్య ప్రాంతాల్లో సాధారణం నుంచి తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం కొద్దిగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నది. చలిగాలుల పెరుగుదలకు వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ తగ్గడం ప్రధాన కారణమని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. అలాగే ప్రస్తుత సంవత్సరం లా నినా ప్రభావంలో ఉండడం కూడా చలిగాలుల పెరుగుదలకు కారణమవుతుందని వివరించారు. చలి తీవ్రత పెరుగుదల హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య, ఆరోగ్య నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు. మరీముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, మహిళలు ఉదయం, రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.
మరింతగా వణికించే శీతాకాలం
- Advertisement -
- Advertisement -



