ఢిల్లీ వాయుకాలుష్యం కేసుపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ఢిల్లీ, దేశరాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో వాయుకాలుష్య సమస్య కేసు శీతాకాలంలో మాత్రమే విచారణ చేయాల్సిన ‘ఆచారం’ కేసుకాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సమస్యకు స్వల్ప, దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొనడానికి నెలలో రెండుసార్లు విచారణ చేస్తామని స్పష్టం చేసింది. అలాగే, పంట వ్యర్థాల దహనం సమస్య అనవసరంగా రాజకీయ సమస్య లేదా ఇగో సమస్యగా మారకూడదని తెలిపింది. ఢిల్లీవాయుకాలుష్యం కేసును సోమవారం ప్రధాన న్యాయమూరి సూర్యకాంత్, న్యాయ మూర్తి జోరు మల్యబాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
వాయుకాలుష్యానికి రైతుల పంట వ్యర్థాల దహనం అంశం ఒక్కటే కారణం కాదని, ఇతరాంశాలూ ఇందులో ఉన్నాయని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కోర్టులో లేని వ్యక్తులు (రైతులు)పై భారాన్ని మోపడం సరికాదు కాబట్టి, పంట వ్యర్థాల దహనం అంశం గురించి వ్యాఖ్యానించాలనుకోవడం లేదని సిజెఐ తెలిపారు. వాయు కాలుష్యాన్ని ఎదుర్కొవడానికి తీసుకుంటున్న తక్షణ, దీర్ఘకాలిక చర్యల గురించి తెలియ జేయాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(సీఎక్యూఎం), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ)లను సీజేఐ ఆదేశించారు.తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేశారు.



