నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ శైవక్షేత్రంలో ఓ రివాల్వర్ కలకలం సృష్టించింది.. శ్రీశైలం టోల్‌గేట్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన తనిఖీల్లో రివాల్వర్ బయటపడటంతో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి దగ్గర 9 ఎమ్‌ఎమ్ పిస్టల్ రివాల్వర్ ఉండటం గమనించారు. వెంటనే వారు అక్కడే విధుల్లో ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో, పోలీసులు రివాల్వర్ కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. తనను మధ్యప్రదేశ్‌కు చెందిన సైబర్ క్రైమ్ శాఖలో ఎస్‌ఐగా పనిచేస్తున్నానని ఆ వ్యక్తి తెలిపాడు. అతని వద్ద ఉన్న రివాల్వర్ లైసెన్స్డ్ ఆయుధమని, అధికారిక కారణాలతో ప్రయాణిస్తున్నానని తెలిపాడు.
ఇక, ఈ నేపథ్యంలో శ్రీశైలం సీఐ ప్రసాద్ రావు ఆ వ్యక్తి వద్ద ఉన్న ఐడీ కార్డు, రివాల్వర్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు నిర్వహించారు. మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ ఎస్పీతో సంప్రదించి ఆ వ్యక్తి వివరాలు నిర్ధారించుకున్నారు. విచారణలో అతను నిజంగానే మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నట్లు తేలింది. దీంతో పోలీసులు అతని రివాల్వర్, ఐడీ కార్డులను తిరిగి అప్పగించారు. కొద్ది సేపు ఆందోళన కలిగించిన ఈ ఘటనలో ఆ రివాల్వర్ కలిగిఉన్న వ్యక్తి నిజంగానే పోలీసు అధికారి అని తేలడంతో.. ఆ రివాల్వర్ ఉత్కంఠ వీడినట్టు అయ్యింది.. దీంతో, భక్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.



