నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని హయత్‌నగర్ శివగంగ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేండ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. సుమారు 10 నుంచి 20 కుక్కలు ఎగబడటంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. శునకాల దాడిలో అతని చెవి ఊడిపోవడంతోపాటు తల, నడుము, వీపు భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతిరావు, చంద్రకళ దంపతులు గత మూడేండ్లుగా శివగంగ కాలనీలో కిరాయికి ఉంటున్నారు. వారి కుమారుడు ప్రేమ్‌చంద్ పుట్టుకతో మూగవాడు. మంగళవారం ఉదయం తండ్రి మేస్త్రీ పనికి వెళ్లగా, తల్లి ఇంట్లో నీళ్లు పడుతున్నది. ఈ క్రమంలో ఇంటి బయట ఆడుకుంటున్న ప్రేమ్‌చంద్‌పై ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి. గమనించిన స్థానికులు వాటిని తరిమేసి బాలుడిని రక్షించారు. అనంతరం అతడిని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి నిలోఫర్‌కు పంపడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. కాగా, నగరంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేస్తున్నాయని, జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



