Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేబీఆర్ పార్కులో పాము.. భయంతో జనం పరుగులు

కేబీఆర్ పార్కులో పాము.. భయంతో జనం పరుగులు

- Advertisement -

భయంతో మళ్ళీ పార్కుకెళ్ళింది..
నవతెలంగాణ – బంజారాహిల్స్

తనని ఏమైనా చేస్తారేమోనని.. జనాల్లోకి వస్తే చంపుతారేమో అనే అనుమానం మనిషికన్న మూగ జీవులకే అధికంగా ఉంటుంది. ఇదిగో ఇలాగే ఓ పెద్ద పాము ప్రజలు సేద తీరేందుకు వచ్చే పార్కు నుంచి రోడ్డుమీదికి వచ్చేసింది. కాసేపు ఎటు పోవాలో తెలియక తికమక పడింది. చరవాణిలో బంధించేందుకు పోటీ పడ్డ వారు అరుపులు కేకలు.. వేయడంతో మళ్ళీ పార్కు లోకే వెళ్ళింది. అసలు ఆ సంగతులేంటో చూద్దాం రండి.

సోమవారం రాత్రి హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 ప్రాంతంలో ఉన్న కేబీఆర్ పార్క్ జాతీయ పార్కులో నుంచి ఓ పెద్ద పాము రోడ్డు దాటుతూ కనిపించింది. నడిరోడ్డుపైకి రాగానే ఆ మార్గంలో వెళ్తున్న కొందరు ఆ పామును చూసి అక్కడికక్కడే వాహనాలు నిలిపివేశారు. మరికొంతమందేమో ఎందుకొచ్చిన తంటాలు అనుకుంటూ తెగ భయపడిపోయి వాహనాలను తీసుకుని అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇదంతా జరుగుతుండగా, చుట్టూ చేరిన వాహనదారులు చూస్తుండగా ఆ పాముకు ఎటు వెళ్లాలో అర్థం కాలేదు.

అక్కడి నుంచి బయటపడాలని చాలా సేపే తచ్చాడింది. ఈ దృశ్యాలను కొంతమంది మొబైల్ ఫోన్లలో రికార్డు కూడా చేసుకున్నారు. ఈ తతంగం జరుగుతుండగా అంతా గమనించిన ఇద్దరు యువకులు మాత్రం కాస్త ముందుకు వచ్చి ఆ పామును అక్కడి నుంచి తప్పించడానికి ప్రయత్నం చేశారు. తిరిగి దాని దారి వెంట మళ్లీ పార్కులోకి వెళ్లేలా తోచిన పని చేశారు.. అక్కడి నుంచి ఆ పామును ముందుకు తరిమేసేలా చూశారు. పార్క్ లోపల నుంచి రోడ్డుపైకి వచ్చిన ఆ పాముని అతి కష్టం మీద ఆ ఇద్దరు యువకులు మళ్లీ పార్క్ వైపుకే మళ్లించి పంపించేశారు.

అయితే.. కేబీఆర్ పార్క్ అనేది నగరంలోని పెద్ద పేరున్న పార్క్. ఇక్కడికి చాలా మంది వాకింగ్ అని.. కాసేపు సేద తీరుదామని ప్రశాంతత కోసం వస్తూ వెళ్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో విష సర్పాలు లాంటివి కనిపిస్తే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అందుకే పార్కులో వాకింగ్ చేసుకునేవాళ్లు, కాసేపు సమయం గడిపడానికి వచ్చేవాళ్లు ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆ యువకులు సూచిస్తున్నారు. పొద్దున, సాయంత్రం వేళల్లో కేబీఆర్ పార్కులోకి వచ్చే సమయంలో కాస్త ముందూ వెనుక గమనిస్తూ వాకింగ్ లాంటివి చేసుకోవాలని, లేదంటే ప్రమాదం బారిన పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -