నవతెలంగాణ-హైదరాబాద్: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పపై పోక్సో విచారణపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించింది. విచారణ ప్రక్రియను నిలిపివేయడంతో పాటు, యడియూరప్పపై ఉన్న కేసును రాష్ట్ర హైకోర్టుకు తిరిగి ఎందుకు బదిలీ చేయకూడదో తెలియజేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కర్ణాటక సిఐడికి నోటీసులు జారీ చేసింది.
కేవలం అస్పష్టమైన, సాంకేతిక కారణాలతో ఈ అంశం యోగ్యతను పరిశీలించలేమని పేర్కొంటూ .. నవంబర్ 13న తమ క్లయింట్‌పై కేసును కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించిందని యడియూరప్ప తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూత్రా, సిద్ధార్థ్ దేవ్‌లు వాదనలు వినిపించారు.
గతేడాది ఫిబ్రవరిలో బెంగళూరులోని తన నివాసంలో జరిగిన బిజెపి సమావేశంలో తనపై, తన 17ఏళ్ల కుమార్తెపై యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి కేసు పోలీసులకు తెలిపారు. 2024 మార్చి 14న సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసి, సిఐడికి బదిలీ చేశారు. సిఐడి పోక్సో కింద ఎఫ్‌ఐఆర్‌ను తిరిగి నమోదు చేసి, చార్జిషీట్ దాఖలు చేసింది.


