నవతెలంగాణ – కంఠేశ్వర్
హరిదా సరస్వతీ రాజ్ సాహిత్య ఉత్సవం సందర్భంగా హరిదా రచయితల సంఘం తరఫున హరిదా సరస్వతీ రాజ్ పురస్కారాలను సంస్థ అధ్యక్షులు ఘనపురం దేవేందర్, బహుమతి ప్రదాత నవ్య భారతి గ్లోబల్ స్కూల్ అధినేత క్యాతం సంతోష్ కుమార్ లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర విశిష్ట సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ పరిశోధకులు విమర్శకులు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, ఉత్తమ కథా రచయిత పురస్కారాన్ని డాక్టర్ కాలువ మల్లయ్య, ఉత్తమ వచన కవితా రచయిత చిందం రమేశ్, మహర్షి దయానంద సరస్వతి ద్విశతాబ్ది పురస్కారాలను ఆచార్య శ్రీధర, డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ లను ఎంపిక చేసినట్టు ప్రకటించారు.
జిల్లాలో సాహిత్యంలో సేవలందిస్తున్న సిర్పలింగం, మోత్కూర్ అశోక్ కుమార్, విఠం ధనంజయ్, బట్టు శ్రీధర్ రాజు, కర్క రమేష్ లకు జిల్లాస్థాయి సరస్వతీ రాజ్ హరిదా పురస్కారాలను ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ గేయ రచయిత వరికుప్పల యాదగిరి, కవులు డాక్టర్ చమన్, అనిల్ ప్రసాద్, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వర శంకరం తదితరులు హాజరవుతున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 4న ఉదయం 10 గంటలకు నవ్య భారతి గ్లోబల్ స్కూల్లో జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని సాహితీవేత్తలు సాహిత్యాభిమానులు తెలంగాణ ఉద్యమకారులు కార్యక్రమానికి హాజరుకావాలని వారు కోరారు.


