ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులు నిర్వహణ..
బ్యాలెట్ ఓటు వేశాక దానిపై భద్రత కరువు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వందల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీంతో ఎవరు ఏ అభ్యర్థికి లేదా ఏ పార్టీకి ఓటు వేశారో తెలిసే అవకాశాలు ఉండవు.అయితే ఆయా పంచాయతీల పరిధిలో తక్కువ సంఖ్యలో పోస్టల్ ఓట్లు ఉంటాయి. కొన్నిచోట్ల ఒక్కరో, ఇద్దరో ప్రభుత్వ ఉపాధ్యాయులు,ఉద్యోగులు ఉంటారు.వారు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవాలని అనుకున్నప్పుడు.. దరఖాస్తు చేసుకొని బ్యాలెట్ పత్రంలో తమకు నచ్చిన వ్యక్తికి పెన్నుతో టిక్ చేస్తారు. అయితే కౌంటింగ్ సమయంలో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు.
ఆ ఊళ్లో ఒకే ఉద్యోగి,ఉపాధ్యాయుడు ఉండి, ఆయన ఎవరో ఒకరికి ఓటు వేసినప్పుడు తన ఓటు ఎవరికి వేశారో బహిర్గతమవుతుంది. తద్వారా తమకు ఓటు వేయలేదని ఇతరులు ఆ ఉద్యోగిపై కక్ష పెంచుకునే అవకాశం ఉంటుంది.గతంలో పలుచోట్ల ఓటు రహస్యం బహిర్గతమై వివాదాలు ఎదురయ్యాయని ఓ ఉపాధ్యాయుడు ‘సాక్షి’తో తన ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటింగ్ సమయంలో పోస్టల్ బ్యాలెట్‌లను సాధారణ బ్యాలెట్ పత్రాల్లో కలిపితే ఏ సమస్యా ఉండదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల అధికారులు తక్షణమే దీనిపై చర్యలు తీసుకొని పోస్టల్ బ్యాలెట్ వల్ల ఎదురయ్యే ఇబ్బందులను తొలగించాలని ఉద్యోగులు,ఉపాధ్యాయులు కోరుతున్నారు.



