నవతెలంగాణ – హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన ‘దిష్టి’ వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రెండు రాష్ట్రాల మధ్య సౌహార్ద వాతావరణాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. మంగళవారం హుస్నాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ ప్రజల దిష్టి తగలడమే కారణమంటూ పవన్ కల్యాణ్ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలపై పొన్నం తీవ్రంగా స్పందించారు.
“మీ సముద్రం నుంచి వచ్చే తుపాను మా రాష్ట్రాన్ని ముంచేస్తున్నా మేమెవరినీ తప్పుబట్టలేదు. అది ప్రకృతి అని భావించాం. కానీ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడతారా? కోనసీమపై మేమెందుకు దిష్టి పెడతాం?” అని ఆయన నిలదీశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్నదమ్ముల్లాంటివని, ఇలాంటి వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య అగాధాన్ని సృష్టిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తులో ఉన్న ప్రభుత్వ ప్రతినిధి ఇలా మాట్లాడటం బాధాకరమని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ నాయకత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.



