కాల్షియం పుష్కలంగా లభించే ఆహారపదార్థాల్లో రాగులు మొదటి స్థానంలో ఉంటాయి. ఇందులోని పోషకాలు ఎముకలు సహా ఇతర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ప్రస్తుతం చాలా మంది రాగులను తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే చాలా మంది రాగి పిండితో ఇడ్లీలు, దోశలు, జావా ఇలాంటివి మాత్రమే ఎక్కువగా చేసుకుంటారు. కేవలం ఇవే కాకుండా రాగి పిండితో ఇంకా రకరకాల స్వీట్లు, వంటకాలు చేసుకోవచ్చు. ఇంటిల్లిపాది ఎంతో ఇష్టంగా కూడా తింటారు. మరి అలాంటి వంటకాల గురించి తెలుసుకుందాం…
కుడుములు
కావాల్సిన పదార్థాలు: రాగి పిండి – కప్పు, పెసరపప్పు – రెండు టేబుల్ స్పూన్లు, నెయ్యి – తగినంత, పచ్చికొబ్బరి తురుము – అర కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, యాలకుల పొడి – అర టీస్పూను, ఉప్పు – చిటికెడు.
తయారీ విధానం: పెసరపప్పును ఓ గిన్నెలోకి తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి అరగంట సేపు పక్కన పెట్టాలి. పెసరపపప్పు బదులు శనగపప్పు కూడా వాడొచ్చు. ఈలోపు పచ్చి కొబ్బరి, బెల్లాన్ని తురుమి రెడీగా పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో రాగి పిండి వేసి లో-ఫ్లేమ్‌లో వేయించి పచ్చి వాసన పోయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి మరో రెండు నిమిషాలు వేయించి పక్కన పెట్టాలి. మరో గిన్నె పెట్టి బెల్లం తురుము, పావు కప్పు నీళ్లు పోసి కరిగించి పక్కన పెట్టాలి. ఓ గిన్నె తీసుకొని వేయించిన రాగి పిండి వేసుకోవాలి.
అందులోకి నానబెట్టిన పెసరపప్పు, యాలకుల పొడి, ఉప్పు, టీస్పూను నెయ్యి వేసుకోవాలి. చివరగా బెల్లం నీటిని వడకడుతూ కొద్దికొద్దిగా పోసుకుంటూ కలిపి ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి. ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని నెయ్యి రాసి రాగి పిండిని కుడుముల మాదిరి వేసుకోవాలి. వాటిపై లైట్‌గా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో రెండు గ్లాసుల నీరు పోసి బాగా మరిగిన తర్వాత అందులో కుడుములు ఉన్న ఇడ్లీ ప్లేట్స్ పెట్టి లో టూ మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చాకు గుచ్చి చూస్తే క్లీన్‌గా ఉంటే పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్లు. వాటిని దించేసి కాస్త వేడి తగ్గిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరి. ఎంతో రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండే రాగి కుడుములు రెడీ.
తియ్యని దోశలు
కావాల్సిన పదార్థాలు: బెల్లం తురుము – కప్పు, రాగి పిండి – రెండు కప్పులు, గోధుమపిండి – అర కప్పు, ఉప్పు – కొద్దిగా, యాలకుల పొడి – కొద్దిగా, నూనె లేదా నెయ్యి – కొద్దిగా (దోశపై వేసుకోవడానికి)
తయారీ విధానం: ముందుగా ఒక బౌల్‌లో బెల్లం తురుము తీసుకుని అందులో రెండు కప్పుల నీళ్లు పోసి గరిటెతో కలుపుతూ పూర్తిగా కరిగించుకోవాలి. అది కరిగిన తర్వాత దాన్ని మరో మిక్సింగ్ బౌల్‌లోకి జాలిగరిటెతో వడకట్టి తీసుకోవాలి. ఇందులో రాగిపిండి, గోధుమపిండి, కొద్దిగా ఉప్పు, యాలకులపొడి వేసుకుని అంతా బాగా కలిసేలా గరిటెతో కలియతిప్పుతూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. దోశల పిండిలా కలుపుకున్న తర్వాత అరగంట పక్కనుంచాలి. తర్వాత స్టవ్‌పై దోశల పెనం పెట్టి దోశలు పోసుకోవాలి. లైట్‌గా నెయ్యి వేసుకుంటూ రెండువైపులా కాల్చుకొని వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.
పకోడీలు
కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ ముక్కలు – రెండు కప్పులు, ఉప్పు – రుచికి సరిపడా, బియ్యప్పిండి – అర కప్పు, పల్లీలు – పావు కప్పు, పుట్నాలు – పావు కప్పు, పచ్చిమిర్చి – మూడు, అల్లం – కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు – 15, కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – కొంచెం, జీలకర్ర – టీ స్పూను, ఇంగువ – పావు టీ స్పూను, పసుపు – పావు టీ స్పూను, కారం – అర టీ స్పూను, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి. పావు కప్పు పల్లీలు వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఓ గిన్నెలో ఉల్లిగడ్డ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా ప్రైస్ చేస్తూ కలపాలి. ఇందులోనే రెండు కప్పుల రాగిపిండి, అర కప్పు బియ్యప్పిండి వేయాలి. అలాగే వేయించిన పావు కప్పు పల్లీలు, పావు కప్పు పుట్నాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేయాలి.
అదేవిధంగా కొద్దిగా అల్లం ముక్కలు, 15 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి. ఇందులోనే టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఇంగువ, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం వేసి బాగా కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. పకోడీలు వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి నిమిషం పాటు అలాగే వదిలేయాలి. మధ్యమధ్యలో కలుపుతూ పకోడీలు బాగా క్రిస్పీగా వచ్చేవరకు వేగనివ్వాలి. అంతే కరకరలాడే రాగి పకోడీలు రెడీ అయినట్లే.
స్వీట్ బోండాలు
కావాల్సిన పదార్థాలు: బెల్లం తురుము – కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పులు, రాగి పిండి – రెండు కప్పులు, గోధుమపిండి – మూడు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూను, ఉప్పు – చిటికెడు, బేకింగ్ సోడా – పావు టీస్పూను.
తయారీ విధానం: ఓ గిన్నెలో బెల్లం తురుము, నీళ్లు పోసి చిన్నమంటపై కలుపుతూ బెల్లాన్ని మరిగించాలి. పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఓ గిన్నెలోకి రాగి పిండి తీసుకొని అందులో బెల్లం నీటిని వడకట్టి పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత బైండింగ్ కోసం గోధుమపిండి వేసి మరోసారి ఉండలు లేకుండా బోండాల పిండిలా కలుపుకోవాలి. చివరగా అందులో ఉప్పు, బేకింగ్ సోడా, యాలకుల పొడి వేసి కలిపి సుమారు ఐదు నిమిషాల పాటు బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడి చేసి మంట తగ్గించి బోండాలు వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రెండువైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే రాగిపిండి స్వీట్ బోండాలు రెడీ.



