వికలాంగులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతికపరంగా చైతన్యం నింపి, సమాన అవకాశాలు, హక్కులు కలిపించి వారిని సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ఐక్య రాజ్య సమితి 1981 సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ప్రకటించింది. వారు సమాజంలో సకలాంగులతో సమానంగా అన్ని హక్కులు పొందే విధంగా 1992 డిసెంబర్ 3 నుండి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జరుపుకుంటున్నాము. మనదేశం కూడా ఐక్య రాజ్య సమితి వికలాంగుల హక్కుల ఒప్పందంపై సంతకం చేసింది. 2007 అక్టోబర్ ఒకటిన భారత ప్రభుత్వ క్యాబినెట్ సిఫార్సులతో రాష్ట్రపతి ఆమోదించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లు, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 సంవత్సరాలు పూర్తయ్యాయి. రాజ్యాంగంలో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం వంటివి వికలాంగులకు అందని ద్రాక్షగానే మిగులుతున్నవి. ఆర్టికల్ 14 నుండి 19 వరకు సమాజంలో పౌరులందరూ సమానమేనని, ఎలాంటి వివక్షతలు ఉండరాదని పేర్కొంది.
కానీ, నేటికీ వికలాంగులు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సిన దుస్థితి దేశంలో ఏర్పడింది. విద్యా, ఉద్యోగాల్లో సైతం వివక్షత కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఆర్టికల్ 41 ప్రకారం వికలాంగులకు ఆర్థిక స్వావలంబన కల్పించి వారిని అభివృద్ధి చేయాలని, పని కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని పేర్కొంది. కానీ, ఇవేవీ అమలు కాకపోవడం పాలకుల వైఫల్యానికి నిదర్శనం. విద్య, ఉద్యోగాల్లోనూ న్యాయమైన వాటా వికలాంగులకు దక్కకపోవడం ద్వారా అనేకమంది ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా మారుతున్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నియామకల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. వికలాంగులకు ప్రత్యేక స్కూల్స్, ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లను ఏర్పాటుచేయాల్సి ఉన్నా అమలు కావడం లేదు. ఆటిజం,అందత్వం,వినికిడి సమస్యతో బాధపడే విద్యార్థులకు ప్రత్యేక పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలని 2017 అక్టోబర్ 30న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వన్ని ఆదేశించింది.
వికలాంగులకు చదువు చెప్పేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఒకవైపు ఆదేశిస్తుంటే మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కలిగిన విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకోలేనటు వంటి ఘటనలు ఉన్నవి. ప్రభుత్వ ఉద్యోగ నియామకల్లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయమే తెలంగాణలోనూ జరుగుతున్నది.నీళ్లు, నిధులు,నియామకాల కోసం పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో వికలాంగుల ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందుతున్నది.ప్రభుత్వ శాఖల్లో కేడర్ స్ట్రెంత్ ప్రకారం వికలాంగుల ఖాళీ పోస్టులను ప్రకటించాలి. కానీ, పదకొండేండ్ల తెలంగాణ రాష్ట్రంలో ఒక హైదరాబాద్ మినహా రాష్ట్రంలో మరెక్కడ కూడా వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయలేదు.33 జిల్లాల ప్రకారం వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను గుర్తించి భర్తీ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న సర్కార్ వికలాంగులకు దక్కాల్సిన నాలుగు శాతం ఉద్యోగాలు ఎందుకు కేటాయించడం లేదు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగులు కేవలం 0.04శాతం కంటే తక్కువ మంది వికలాంగుల ఉద్యోగులున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ టీచర్స్ పోస్టులను గుర్తించినప్పటికి ఖాళీలను భర్తీ చేయలేదు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 21 రకాల వైకల్యాలను గుర్తించింది. కానీ వైకల్య ధృవీకరణ పత్రాలు మాత్రం 1995 పిడబ్ల్యూడి చట్టం గుర్తించిన ఏడు రకాల వైకల్యాలకు మాత్రమే సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. కండరాల క్షీణత, తలసేమియా, ఆటిజం, సెరిబ్రల్ పాల్సి వంటి తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులు సర్టిఫికెట్స్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చట్టం అమల్లోకి వచ్చి తొమ్మిదేండ్లు గడుస్తున్నా నేటికీ ఏడు రకాల వైకల్యాలకు మాత్రమే వైకల్య ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో యూనిక్ డిసేబుల్డ్ గుర్తింపు కార్డు (యుడిఐడి) కార్డ్స్ జారీ చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
అమలుకు నోచని చట్టాలు
వికలాంగుల పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం అనేక చట్టాలను చేసింది. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ,2017 ఇంటర్ హెల్త్ కేర్, నేషనల్ ట్రస్ట్, ఆటిజం యాక్ట్ ఐక్యరాజ్యసమితి హక్కుల ఒప్పందం వంటి అనేకచట్టాలు దేశంలో వికలాంగుల సంక్షేమం కోసం అమలులో ఉన్నవి. కానీ, దేశాన్ని పాలిస్తున్న పాలకులకు చట్టాలను అమలు చేయాలనే చిత్తశుద్ధి కనిపించడం లేదు. పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం కల్పించేందుకు క్రిమినలై జింగ్ మైనర్ అపెక్స్ అంటూ కార్మిక చట్టాలను సవ రించి నాలుగు లేబర్‌కోడ్స్‌గా మర్చి అమల్లోకి తీసుకొచ్చింది కేంద్రం. వికలాంగుల చట్టాలను కూడా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షించటం సెక్షన్ 89, 92 ,93 రద్దు చేయాలని, 1999 నేషనల్ ట్రస్టు సవరించాలని, దేశ వ్యాప్తంగా ఉన్న తొమ్మిది నేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ను విలీనం చేయాలని చేసిన ప్రయత్నాలను ఎన్‌పిఆర్‌డి దేశ వ్యాప్తంగా చేసిన పోరాటాల ద్వారా తిప్పికొట్టింది.
సుగమ్య భారత్ అభియాన్ ప్రచారం కోసమేనా?
కేంద్ర ప్రభుత్వం సామూహిక ప్రాంతాలని వికలాంగులు వినియోగించుకునే విధంగా మార్చాలని ఉద్దేశంతో సుగమ్య భారత్ అభియాన్ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది.2022 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన పట్టణాల్లో యాభై శాతం పట్టణాలు అవరోధరహితంగా మార్చాలని నిర్దేశించిన లక్ష్యం 2025 నాటికి కూడా నెరవేరలేదు. నేటికీ సామూహిక ప్రాంతాలు వికలాంగులకు అందనంత దూరంలో ఉన్నాయి. ప్రధానమంత్రి వికలాంగులను దివ్యాంగులుగా నామకరణం చేశారు. పేరు మార్చినంత మాత్రాన వికలాంగులకు ఒరిగిందేమీ లేదు. వికలాంగులపై వివక్షత, వేధింపులు అరికట్టేందుకు అట్రాసిటీ లాంటి బలమైన చట్టం ప్రత్యేకంగా తీసుకురావాలని సుప్రీంకోర్టు పేర్కొందంటేనే దేశంలో వికలాంగులకు రక్షణ లేకుండా పోతున్నదని అర్థం. ప్రపంచ వికలాంగుల దినోత్సవం స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వికలాంగుల వ్యతిరేక విధానాలపై ఉద్యమించవలసిన అవసరం ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం వికలాంగులపై మనుధర్మ శాస్త్ర భావజాలన్నీ రుద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. దేశవ్యాప్తంగా ఒకే పెన్షన్ విధానం, రైల్వేలో సౌకర్యాలు, అంత్యోదయ రేషన్ కార్డులు, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్స్, సామాజిక భద్రత, స్వయం ఉపాధి, మహిళా వికలాంగుల రక్షణ కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది.
యం.అడివయ్య
9490098713



