Wednesday, December 3, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఏ క్షణమైనా వెనిజులాపై అమెరికా దాడి!

ఏ క్షణమైనా వెనిజులాపై అమెరికా దాడి!

- Advertisement -

మేక పిల్లను మింగేయాలనుకున్న తోడేలు కథ తెలిసిందే! ప్రపంచంలో ఏదో ఒక మూల ఘర్షణ లేదా యుద్ధం లేకుండా అమెరికాకు నిదురపట్టదు. అందుకే మాదక ద్రవ్యాల రవాణా సాకుతో వెనిజులాపై ఏ క్షణమైనా దాడి చేసేందుకు అవసరమైన సన్నాహాలన్నీ పెంటగన్‌ పూర్తి చేసింది. ప్రపంచంలో అతి పెద్దది, అధునాతనమైనదిగా పరిగణిస్తున్న యుఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఫోర్డ్‌ విమానవాహక యుద్ధనౌకతో సహా అనేక ఇతర నౌకలు, వేలాది మంది సైనికులను కరీబియన్‌ సముద్ర ప్రాంతానికి తరలించింది.దేశం నుంచి వెళ్లిపోవాలని డోనాల్డ్‌ ట్రంప్‌ వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను బెదిరించిన ట్రంప్‌ శుక్రవారం నాటితో గడువు ముగిసిందంటూ వెనిజులా గగనతలాన్ని మూసివేసినట్లు ప్రకటించాడు. గత కొద్ది నెలలుగా వెనిజులా నుంచి మాదక ద్రవ్యాలతో నిండిన పడవలు వస్తున్నాయంటూ వాటిపై దాడులు చేసి అనేక మందిని అమెరికా హత్య చేసింది. అమెరికా దుర్మార్గాన్ని వదలిపెట్టి వెనిజులా మిలిటరీ సామర్ధ్యం ఎంత, దాడులను తట్టుకోగలదా లేదా అంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించే కథనాలను మీడియా ముందుకు తెస్తున్నది.

గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ డాట్‌కామ్‌ 2025 మిలిటరీ సూచిక ప్రకారం అమెరికా మొదటి స్థానంలో ఉండగా వెనిజులా 50వదిగా ఉంది. అయినప్పటికీ తమ దేశాన్ని కాపాడుకొనేందుకు చివరి రక్తపు బొట్టువరకు చిందిస్తామని మదురో గతంలో ప్రకటించాడు. ఏ దేశానికైనా అంతకు మించి మరోమార్గం ఉండదు.సోమవారం నాడు విదేశాంగ, రక్షణ మంత్రులు, ఉన్నతాధికారులతో ట్రంప్‌ సమావేశమైన దాడి సన్నాహాల గురించి చర్చించినట్లు వార్తలు.అమెరికా అధికార పీఠంపై ఎవరు ఉన్నప్పటికీ వెనిజులాలో వామపక్షాల హ్యూగో ఛావెజ్‌ రాజకీయ వారసుడిగా వచ్చిన మదురో వరకు వారి కుట్రలు ఆపటం లేదు. అక్కడి ప్రతిపక్ష నేతలకు మద్దతిచ్చి కుట్రలకు తెరలేపిన సంగతి తెలిసిందే. తప్పుడు ప్రచారం, అసత్యాలతో ఇతర దేశాలపై దాడులు చేయటం అమెరికాకు కొత్తేమీ కాదు. తనకు లొంగని, నచ్చని దేశాధినేతలను పదవుల నుంచి తొలగించేందుకు చేసిన కుట్రల గురించి తెలిసిందే. వాటివలన ప్రయోజనం లేదని చరిత్ర చెబుతున్నా పదే పదే ప్రయత్నాలు చేస్తున్నది.వలసవాదానికి వ్యతిరేకంగా లాటిన్‌ అమెరికా గతంలో పోరాడింది. దాన్ని తన పెరటితోటగా మార్చుకొనేందుకు అమెరికా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది.

ఈ ప్రాంతంలో సామ్రాజ్యవాదుల దుర్మార్గాలు ఇన్నిన్నికాదు. నవంబరు 29న లాటిన్‌ అమెరికాలో జోంగ్‌ మారణ కాండకు 244 సంవత్సరాలు నిండాయి.లాటిన్‌ అమెరికాలోని చెరకు తోటల్లో పని చేసేందుకు జోంగ్‌ అనే పడవలో 1781లో ఆఫ్రికా నుంచి బానిసలను తరలించారు. ఒక్కో బానిసను 36 పౌండ్లకు విక్రయించారు. పడవ సామర్ధ్యానికి రెండు రెట్లు అంటే 442మందిని ఎక్కించారు. ఘనా నుంచి జమైకాకు ప్రయాణించే ఆ పడవ నావికులు చేసిన తప్పిదాల వలన ఆలస్యమై మంచినీరు చాలకపోవటం, ఇతరత్రా కారణాలతో అనేక మంది మరణించారు. ఓడ యజమానులు ఒక్కొక్క బానిస మీద 30 పౌండ్ల చొప్పున బీమా సొమ్ము పొందే అవకాశం ఉంది. దుర్మార్గం ఏమంటే అందుకోసం నీరసించిపోయిన వారిలో 54 మంది మహిళలు, పిల్లలను మరణించినవారితో పాటు నవంబరు 29న కరీబియన్‌ సముద్రంలోకి నెట్టి చంపివేశారు.ఈ ఉదంతం సామ్రాజ్యవాదంపై ప్రతిఘటన, బానిసత్వ రద్దు చట్టాలకు నాంది పలికింది.

దీన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే బానిస వ్యాపారులు బీమా సొమ్ముకోసం బతికి ఉన్నవారిని సముద్రంలోకి తోసివేసినట్లే వెనిజులాపై దాడికి అమాయకులైన వారు ప్రయాణిస్తున్న పడవలపై దాడులు చేసి వారిని చంపివేసిన అమెరికా మిలిటరీ దాన్ని మాదకద్రవ్యాల నిరోధానికి తీసుకున్న చర్యగా ప్రపంచాన్ని నమ్మించేందుకు చూసింది. అసలు అమెరికాకు అలాంటి అధికారం ఎవరిచ్చారు, అదేమీ అమెరికా గడ్డకాదు, సముద్రజలాలు వారివి కాదు. తాము పేల్చివేసిన ప్రతిపడవతో 25వేల మంది అమెరికన్ల ప్రాణాలను రక్షించామని డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పుకున్నాడు. ప్రతి ఏటా వేలాది మందిని అమెరికాలో తుపాకులతో కాల్చిచంపుతుంటే, మాదక ద్రవ్యాలతో నింపుతుంటే వారిని నిరోధించటం చేతగాని దద్దమ్మలు ఎక్కడో మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నాయంటూ యుద్ధనౌకలు, మిలిటరీని తరలిస్తుంటే నమ్మటానికి జనాలు చెవుల్లో పూలు పెట్టుకొని లేరు. ఛావెజ్‌ నాయకత్వంలో వెనిజులాలో ప్రారంభమైన వామపక్ష పాలనకు 26 సంవత్సరాలు నిండాయి.

ఆ ప్రాంతంలో అమెరికాకు కొరకరాని కొయ్యగా తయారైంది.అసలు దుగ్ద అది, అందుకే మదురోను తొలగించి తన తొత్తులను అక్కడ అధికారంలో కూర్చోపెట్టేందుకే ఈ దుర్మార్గానికి ట్రంప్‌ తెరతీశాడు.
అమెరికా ఆంక్షలను ఖాతరు చేయకుండా వెనిజులా ప్రస్తుతం క్యూబా, చైనా తదితర దేశాలకు చమురు ఎగుమతులు చేస్తున్నది. ప్రపంచంలో 303 బిలియన్‌ పీపాల చమురు నిల్వలతో వెనెజులా మొదటి దేశంగా ఉంది.వాటిని చేజిక్కించుకొని అమెరికా కంపెనీలకు అప్పగించాలని అక్కడి రిపబ్లికన్లు, డెమోక్రాట్లూ ప్రయత్నిస్తున్నారు. దానికి గాను సాకులు చెబుతున్నారు. 2007లో ఛావెజ్‌ ప్రభుత్వం అమెరికా కంపెనీల చేతుల్లో ఉన్న చమురు సంస్థలను జాతీయం చేసినప్పటి నుంచి కుట్రలు మొదలయ్యాయి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల సరఫరాలో వెనిజులా కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిరంతరం ప్రచారం చేస్తున్నారు. మాదకద్రవ్యాలు, నేరాలకు సంబంధించిన ఐరాస సంస్థ, చివరికి అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజన్సీ కూడా వాటిని తిరస్కరించింది.

వార్షిక నివేదికల్లో మాదకద్రవ్యాలను వెనిజులా ఉత్పత్తి చేయటం లేదని, సరఫరా గురించి ఆధారాలు లేవని పేర్కొన్నాయి.అమెరికా చేరుతున్న కొకెయిన్‌లో 90శాతం పసిఫిక్‌ సముద్రమార్గాల ద్వారా దక్షిణ అమెరికా మిత్రదేశాల నుంచి నుంచి చేరుతున్నదని, ప్రమాదకరమైన ఫెంటానిల్‌ అమెరికా దక్షిణ సరిహద్దుల నుంచి ఎక్కువగా అమెరికా పౌరులే స్మగ్లింగ్‌ చేస్తున్నారని అనేక నివేదికలు ఉన్నాయి.వాటిని విస్మరించి మదురో మాదక ద్రవ్యాల సరఫరా మాఫియా నాయకుడని ఆరోపించటం తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు. అమెరికా చెబుతున్న మాదకద్రవ్యాల ముఠా జాడ అక్కడ ఉందని ఏ అంతర్జాతీయ సంస్థా చెప్పలేదు. మాదకద్రవ్యాల రవాణా మీద పోరాడుతున్నట్లు అమెరికా చెప్పుకోవటం హాస్యాస్పదం, బూటకం. లాటిన్‌ అమెరికాలోని హొండురాస్‌ మాజీ అధ్యక్షుడు జువాన్‌ ఓర్లాండో హెర్నాండెజ్‌ మాదక ద్రవ్యాల రవాణా కేసులో 2024లో అమెరికా కోర్టు 45 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. అలాంటి నేరగాడికి క్షమాభిక్ష ప్రసాదిస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు.

యుద్ధాల ప్రారంభానికి సామ్రాజ్యవాదులు, యుద్ధోన్మాదులు అబద్దాలు చెప్పటం కొత్త కాదు.నిజానికి అది పురాతన ఎత్తుగడ. యుద్ధంలో ముందుగా హతమయ్యేది నిజం.మొదటి ప్రపంచ యుద్ధంలో న్యూయార్క్‌ నుంచి బ్రిటన్‌లోని లివర్‌పూల్‌ బయలుదేరిన ఆర్‌ఎంఎస్‌ లుస్టియానా అనే నౌకను ఐర్లండు వద్ద జర్మన్లు పేల్చివేశారని ప్రచారం చేశారు.జున్ను, వెన్న రవాణా పేరుతో పేలుడు పదార్థాలను కూడా దానిలో రవాణా చేస్తుండగా అవి పేలటంతో 139 మంది అమెరికన్లలో 128 మంది మరణించారు. ఇది వాస్తవం కాగా జర్మనీ మీద నెపం మోపి అమెరికన్లను యుద్ధానికి సిద్ధంచేసేందుకు తప్పుడు ప్రచారం చేశారు. ఇదే ఎత్తుగడతో రెండవ ప్రపంచ యుద్ధంలో చేరేందుకు కుట్ర చేశారు.దాన్ని అర్ధంచేసుకోని జపాన్‌ 1941 డిసెంబరులో పెరల్‌హార్బర్‌పై చేసినదాడిలో 2,400 మంది అమెరికన్‌ మిలిటరీ, పౌరులు మరణించారు. ఆ దాడి గురించి నాటి అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌, అధికార యంత్రాంగానికి ముందే తెలుసునని, వారం ముందే దాడి జరగనున్నదని రూజ్‌వెల్ట్‌ తనకు చెప్పినట్లు నాటి అమెరికా యుద్ధమంత్రి హెన్రీ టిమ్సన్‌ తన డైరీలో రాశాడు.

ప్రభుత్వానికి అందిన హెచ్చరికలను కూడా కావాలనే పక్కన పెట్టారని తర్వాత వెల్లడైంది.ఈ దాడిని ఆసరా చేసుకొని జపాన్‌పై అమెరికా యుద్ధం ప్రకటించటం, అణుబాంబులను వినియోగిం చటం తెలిసిందే. దీనికి పదేండ్లముందు చైనాలోని మంచూరియాను ఆక్రమించుకొనేందుకు జపాన్‌ సామ్రాజ్యవాదులు కూడా ఇదే ఎత్తుగడను అనుసరించారు. తమ నిర్వహణలోని రైల్వే ట్రాక్‌ను తామే పేల్చుకొని చైనా మీద నెపం మోపి దురాక్రమణకు పూనుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఉత్తర కొరియా దురాక్రమణ నుంచి దక్షిణ కొరియాను రక్షించేపేరుతో కొరియా యుద్ధం జరిగింది. అది కూడా తప్పుడు ప్రచారమే.అసలు అలాంటి ప్రయత్నమే జరగలేదు. ఉత్తర కొరియా కమ్యూనిస్టుల ఆధీనంలో ఉండటమే అసలు కారణం. ఐరాస పేరుతో అమెరికా జరిపిన దాడి, ప్రతిఘటనలో 30లక్షల మంది పౌరులు మరణించారు.

వియత్నాం దురాక్రమణ కూడా అసత్యాలతోనే ప్రారంభ మైంది. టోంకిన్‌ గల్ఫ్‌(దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం తీరంలోని జలసంధి) లో తమ నౌకపై ఉత్తర వియత్నాం 1964 ఆగస్టులో రెండుసార్లు దాడి చేసిందని ఆరోపిస్తూ అమెరికా దాడికి దిగింది. దక్షిణ వియత్నాంలోని కమ్యూనిస్టు వ్యతిరేకపాలకులకు మద్దతుగా వచ్చిన అమెరికా నౌక ముందుగా చేసిన దాడిని ఉత్తర వియత్నాం ప్రతిఘటించింది. అసలు రెండవదాడి ఉదంతమే జరగలేదని తరువాత వెల్లడైంది. 1967లో అమెరికా మద్దతుతో ఈజిప్టు,జోర్డాన్‌, సిరియాపై ఇజ్రాయిల్‌ జరిపినదాడి కూడా అబద్దాలతోనే జరిగింది.ఈజిప్టు తొలుత తమపై దాడి చేసినట్లు దానికి ప్రతిదాడికి దిగినట్లు ఆరోపించింది. దానికి ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో ఈజిప్టు ఇతర అరబ్బుదేశాలు తమపై దాడికి సన్నద్దం అవుతుండటంతో ఆత్మరక్షణ కోసం దాడి చేసినట్లు ఇజ్రాయిల్‌ సమర్ధించుకుంది. అమెరికాను ప్రత్యక్షంగా రంగంలోకి దించేందుకు పధకం ప్రకారం ఈజిప్టు సమీపంలో ఉన్న అమెరికా నౌక యుఎస్‌ఎస్‌ లిబర్టీపై ఇజ్రాయిల్‌ దాడి చేసింది. నెపాన్ని ఈజిప్టుమీద నెట్టేందుకు చూసింది.

ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని తరువాత వెల్లడైంది.1990దశకంలో జరిగిన గల్ఫ్‌ దాడులను కూడా అమెరికా అబద్దాలతోనే మొదలు పెట్టింది. ఇరాకీలు కువైట్‌పై దాడి చేసినపుడు ఆస్పత్రిలో ఉన్న పిల్లలను చంపివేశారని కాకమ్మ కథలను అమెరికా చెప్పించింది. తర్వాత 2003లో ఇరాక్‌ అధినేత సద్దామ్‌ హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసినట్లు ప్రచారం చేసి దాడి చేయటమేగాక సద్దామ్‌ను ఉరితీసిన సంగతి తెలిసిందే. తర్వాత అలాంటి ఆయుధాలేమీ లేవని అమెరికన్లే అంగీకరించారు. సిఐఏ చెప్పిన కట్టుకథలను అమెరికాతో సహా యావత్‌ ప్రపంచ మీడియా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. లిబియాలో మానవహక్కులకు భంగం కలిగిందని, వాటిని పునరుద్దరించే పేరుతో జోక్యం చేసుకోవటమే గాక అధినేత గడాఫీని అంతం చేసేందుకు నాటో దళాలను దించిన సంగతి తెలిసిందే.గడాఫీ వ్యతిరేక తిరుగుబాటుదార్ల పేర్లతో నాటకమాడి 2011లో గడాఫీని హత్య చేశారు.

అనేక దేశాల్లో పాలకులు, పార్టీలను మార్చి తనకు అనుకూలశక్తులను గద్దెల మీద కూర్చోపెట్టేందుకు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా చేసిన యత్నాలన్నీ విఫలం కావటమేగాక చేతులు కాల్చుకున్నది.నియంతలు, పచ్చిమితవాదులకు ఆశ్రయ మిచ్చి రక్తపాతానికి కారకురాలైంది.అమెరికాలో ఏ పార్టీ అధికారానికి వచ్చినా అదే వైఖరి.ఇప్పుడు వెెనిజులాలో కూడా అదే జరుగుతోంది. అధ్యక్షుడు నికోలస్‌ మదురో దేశం విడిచిపోవాలని ట్రంప్‌ బెదిరించాడు. ఒక విమానవాహక యుద్ధ నౌక, పది ఇతర మిలిటరీ నౌకలు, పదిహేనువేల మంది మిలిటరీ, వందలాది యుద్ధ విమానాలతో వెనెజులాను చుట్టుముట్టారు. మదురో కూడా గతకొద్ది నెలలుగా తనకున్న మిలిటరీ, గెరిల్లా దళాలను సన్నద్ధం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.ఏం జరగనుందో అని యావత్‌ ప్రపంచం ఆందోళనతో చూస్తున్నది.నేడు వెనిజులా పతనమైతే రేపు ఏ దేశం మీదనైనా ఏదో ఒకసాకుతో అమెరికా దాడికి దిగితే పరిస్థితేమిటో ప్రతివారూ ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది!

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -