Wednesday, December 3, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిమధ్యంతర దోపిడీ

మధ్యంతర దోపిడీ

- Advertisement -

చదువుల మధ్యలో విద్యా వ్యాపార దోపిడీని తిరిగి ఆరంభించారు. ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో పలు ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వసూళ్లు చేపట్టాయి. ఫీజుల వసూళ్లకు పద్ధతి అంటూ లేకుండా పోయింది. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు నిర్ణయించిన ఫీజే చివరిదాకా ఉండాలి. కానీ ఆర్థిక అవసరాలు పెరిగిపోయాయంటూ ఏదో ఒక పేరుతో విద్యార్థుల నుంచి అదనపు ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఈ వ్యవహారం ఈ విద్యాసంవత్సరం మరింత పెరిగింది. హైదరాబాద్‌ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫీజు విధానాన్ని పక్కనబెట్టి, తమకు నచ్చిన విధంగా పెంచుతున్నారు. ”స్పెషల్‌ ఫీజులు”, ”మెయింటెనెన్స్‌ ఛార్జీలు” పరీక్షల పేర్లతో మధ్యంతరంగా రూ.700 నుంచి వెయ్యి వరకు అదనపు వసూళ్లు చేస్తున్నాయి. పిల్లల కోసం మరో మార్గం లేక తల్లిదండ్రులూ మౌనంగా చెల్లించక తప్పడం లేదు. ”అదనపు అకాడమిక్‌ సపోర్ట్‌”, ”అడ్వాన్స్‌ టీచింగ్‌”, ”డెవలప్‌మెంట్‌ ఫీజు” వంటి కారణాల్ని చూపుతూ నెలకు వంద రూపాయలు చొప్పున కూడా వసూలుకు తెరలేపాయి. ఆర్థిక పరిస్థితి బాగున్నవారికి భారం కాకపోయినా అరకొర వేతనాలతో నెట్టుకొస్తున్నవారికి సంబంధం లేని మధ్యంతర ఫీజులు చెల్లించాలంటే అదనపు భారమే.

నాణ్యమైన విద్య అందుతుందని ప్రయివేటు విద్యాసంస్థల్లో తమ పిల్లలను చేర్పించిన పేద కుటుంబాలు అదనపు ఫీజులు ఎలా చెల్లిస్తాయి?.ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజులపై నాలుగైదేండ్లుగా తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు విద్యాసంవత్సరం మధ్యలో మధ్యంతర భారాలను తట్టుకోలేక విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీన్ని పాలకులు సీరియస్‌గా పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఫీజుల అంశం తల్లిదండ్రులను నిద్ర పట్టనీయడం లేదు. పరిస్థితి ఇలా రావడానికి ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణం. విద్యాశాఖ అధికారులు కూడా చూసీచూడనట్టుగా ఉండటం వల్లే ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. విద్యాసంస్థలపై ఎలాంటి నియంత్రణ లేదు. పేరుకు మాత్రమే ఫీజుల వ్యవస్థను పర్యవేక్షించే కమిటీలు. ప్రభుత్వం వైపు నుంచి ఫీజులపై ఎలాంటి సమీక్షలూ జరగడం లేదు. అధికారులూ స్కూళ్లలో జరిగే అదనపు వసూళ్లను చూడనట్టు చూస్తున్నారు. ఎవరైనా తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, అది ఫైళ్ల లోపలే మగ్గిపోతుంది. దీనికంతటికీ ప్రయివేటు మోజులో తల్లిదండ్రులు పడి పోవడమే కారణమని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి. కానీ ప్రభుత్వాల విధానాల వల్ల ప్రభుత్వవిద్య మరుగున పడి ప్రయివేటు విద్య పెరగడానికి కారణమని విద్యావేత్తలు చెబుతున్నమాట.

ఫీజు ఎంత ఉండాలని కూడా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ప్రభుత్వం ”ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం” అనే ప్రచారం చేస్తోంది, కార్పొరేట్‌ విద్యాసంస్థలపై ఆధారపడకుండా ప్రజలు ప్రభుత్వ విద్యవైపు రావాలని కోరుతోంది. ప్రకటనలు బాగుంటున్నా ఆ నమ్మకాన్ని బలంగా ఇవ్వలేకపోతున్నాయి. రాష్ట్రంలో ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు విద్యను ఉచితంగా అందిస్తానని గత పాలకులు మాటిచ్చారు. ఉచితవిద్య దేవుడెరుగు మరిన్ని ప్రయివేటు కార్పొరేట్‌ విద్యాసంస్థలు పెట్టుకునేందుకు తలుపులు బార్లా తెరిచింది. వేల స్కూల్స్‌ మూత పడ్డాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పాఠశాలలను ఏర్పాటు చేస్తామంటూ ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ అంటూ కొత్త రాగం అందుకుంది. వాటిని ప్రారంభం ఎప్పుడో తెలియదు కానీ ప్రభుత్వ విద్యాసంస్థలు మూతపడతాయన్న ప్రచారంతో వేలమంది విద్యార్థులు ప్రయివేటు స్కూల్స్‌ల్లో చేరుతున్నారు.

ఒకవైపు ప్రభుత్వ విద్య బలహీనంగా ఉంటే, మరొకవైపు ప్రయివేటు విద్యాసంస్థలు నియంత్రణ లేకుండా దోపిడీ చేస్తే, తల్లిదండ్రులు ఏ దారి పట్టాలి? ఇదే ప్రశ్న ఇప్పుడు వేలాది కుటుంబాలను వేధిస్తోంది. విద్య అనేది వెలకట్టలేని సంపద. అది ఒక హక్కు. దోపిడీకి వేదిక కాకూడదు. ప్రయివేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీని అరికట్టకపోతే, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తు మరింత కష్టాల్లో పడుతుంది. ఈ దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఫీజు నియంత్రణకు మార్గదర్శకాలు జారీచేసినా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో కండ్లు మూసుకోకూడదు. విద్యను విచ్చలవిడి వ్యాపారంగా ఉపయోగించుకునే ధోరణికి ఇకనైనా చెక్‌ పెట్టాలి. సమాజం కూడా కలిసి నడవాలి. తల్లిదండ్రులు, సంఘాలు ఏకమై, ఫీజు పెంపు లేకుండా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకురావాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -