Wednesday, December 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రాంతీయ పార్టీలే బీజేపీకి ప్రత్యామ్నాయం

ప్రాంతీయ పార్టీలే బీజేపీకి ప్రత్యామ్నాయం

- Advertisement -

– ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్‌ విఫలం
– చెన్నైలో శివ్‌నాడార్‌ ఫౌండేషన్‌ ఇగ్నీషన్‌ సదస్సులో కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఏనాటికైనా ప్రాంతీయపార్టీలేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు (కేటీఆర్‌) అన్నారు. చెన్నైలో మంగళవారం నిర్వహించిన శివ్‌ నాడార్‌ ఫౌండేషన్‌ ప్రతిష్టాత్మక ఇగ్నీషన్‌ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ దేశ ప్రతిపక్షాల మెడలో కట్టిన భారీ మొద్దు రాహుల్‌ గాంధీ నాయకత్వమని చెప్పారు. ఆయనకు దేశ భవిష్యత్తుపైన విజన్‌ లేదన్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష పార్టీగా పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆయన నాయకత్వమే ప్రధాని మోడీకి అతిపెద్ద బలమని అన్నారు. కాంగ్రెస్‌ నాయకత్వం బీజేపీని ఎదుర్కోవడం కష్టమన్నారు. దక్షిణాదిన బీజేపీకి భవిష్యత్తు ఉందని అనుకోవడం లేదని చెప్పారు. రానున్న పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు వంటి రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించి బలమైన గుణపాఠం చెప్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ దేశ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవెర్చడంలో తీవ్రంగా మోసం చేసిందన్నారు. మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులుగా ముద్ర వేసి వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. ఈ పదేండ్లలో విభజన రాజకీయాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లిందనీ, వాటిని పూర్తిస్థాయిలో ఎండగట్టడంలో ప్రతిపక్షాలుగా తాము విఫలం అయ్యామని చెప్పారు.

తెలంగాణలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పదేండ్లలో అనేక రంగాల్లో ఆర్థిక ప్రగతి అద్భుతంగా సాధించిన తెలంగాణ ఈ రెండేండ్లలో వెనుకబడడం బాధాకరమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచాకాల నుంచి పార్టీని కాపాడుకోవాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన అడ్డగోలు, ఆచరణ సాధ్యం కాని హామీలన్నీ ప్రజలపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయని గుర్తు చేశారు. ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. వారసత్వ రాజకీయాలపై బీజేపీది అవకాశవాదమేనని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -