Wednesday, December 3, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపదేండ్లు అండగా నిలబడండి

పదేండ్లు అండగా నిలబడండి

- Advertisement -

నిజాయితీ సర్పంచులతోనే అభివృద్ధి
దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌ స్థానంలో నిలుపుదాం
విద్య, నీటిపారుదలకు ప్రాధాన్యం
దేశ తొలి ప్రధాని నెహ్రూ స్ఫూర్తితోనే ముందుకు..
గత ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యం
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మన్మోహన్‌సింగ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో సీఎం
హెలికాప్టర్‌ సమస్యతో హడావుడిగా ముగిసిన సీఎం పర్యటన

నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ పాల్వంచ
”రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం ఉన్నా స్థానికంగా సర్పంచులు నిజాయితీ గల వారుండాలి. మంత్రులతో కలిసి పని చేయాలి. అలాంటి వాళ్లు సర్పంచులుగా లేకపోతే.. హాఫ్‌ కో.. ఫుల్‌ కో.. మందు కోసం ఓటేస్తే గ్రామాలు దెబ్బతింటాయి. రాజకీయాలు మాని పదేండ్లు అండగా నిలబడండి, దేశంలోనే తెలంగాణను నెం.1 స్థానంలో నిలపండి” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మంచి ప్రభుత్వంతోనే ప్రజలకు అన్ని సమకూరుతాయని చెప్పారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ స్ఫూర్తితో విద్య, నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రజాపాలన సాగిస్తున్నామని తెలిపారు. పాల్వంచలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ దేశానికే తలమానికమని అన్నారు. పదేండ్లుగా సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురై.. అవినీతికి లోనై
కేసీఆర్‌ ఇంట్లో కనకవర్షం కురిపించాయని విమర్శించారు.

ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నెలకొల్పిన డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీని ముఖ్యమంత్రి మంగళవారం ప్రారంభించారు. హెలికాప్టర్‌ సమస్యతో కేవలం ముప్పావుగంట వ్యవధిలోనే సీఎం సభ ముగించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తినిచ్చిన ప్రాంతం పాల్వంచని అన్నారు. 60 ఏండ్ల తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చిన డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ పేరిట దేశంలోనే ఏకైక ఎర్త్‌సైన్సెస్‌ యూనివర్సిటీ నెలకొల్పుకోవటం గొప్ప విషయమని తెలిపారు. సంక్షోభంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని 2004 నుంచి 2014 వరకు సంక్షేమం వైపు నడిపించిన ఘనత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగేదేనని అన్నారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ భారతదేశం ప్రపంచంతో పోటీపడాలనే కాంక్షతో ఎడ్యుకేషన్‌ అండ్‌ ఇరిగేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.

దీనిలో భాగంగానే దేశంలోని గొప్ప నీటిపారుదల ప్రాజెక్టులు, యూనివర్సిటీలు నెహ్రూ హయాంలోనే ప్రారంభించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. దేశాన్ని ఆకలికేకల నుంచి అత్యధిక ధాన్యాన్ని అందించే స్థాయికి తీసుకెళ్లిన ఘనత కూడా నెహ్రూదేనని తెలిపారు. బాక్రానంగల్‌ నుంచి నాగార్జున సాగర్‌ వరకూ శ్రీశైలం మొదలు శ్రీరామ్‌ సాగర్‌ వరకూ ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ నెహ్రూ ప్రసాదించినవేనని వివరించారు. నెహ్రూ స్ఫూర్తితో ఎడ్యుకేషన్‌ అండ్‌ ఇరిగేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచ పటంలో తెలంగాణను ఉన్నత స్థానంలో నిలబెడతామని అన్నారు. ‘విద్యను విస్తరించాలి.. ప్రపంచ ఖనిజ సంపద మీద పరిశోధనలు జరగాలి, సింగరేణి లాంటి సంస్థలను పెంపొందించాలి’ అనే ఉద్దేశంతోనే ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీని కొత్తగూడెంలో నెలకొల్పినట్టు చెప్పారు.

ముఖ్యమైన శాఖలన్నీ ముగ్గురు మంత్రుల వద్దే..
కృష్ణా గోదావరినీ అనుసంధానించే సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం అన్నారు. పదేండ్లుగా సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, అవినీతికి లోనయ్యాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆయువుపట్టయిన శాఖలన్నీ ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల వద్దనే ఉన్నాయన్నారు. భట్టి, తుమ్మల, పొంగులేటి అనుకుంటే ఈ ప్రభుత్వంలో జరగనిదేమీ లేదన్నారు. ఖమ్మం జిల్లాకు ఏది కావాలన్నా.. అడిగిందే తడువుగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, ఇందిరమ్మ చీరెలు.. ఇలా సంక్షేమ పథకాలన్నీ జిల్లా నుంచే ప్రారంభించుకున్నామని తెలిపారు. రెండేండ్ల క్రితం మీరు ఆశీర్వదించిన కారణంగానే ఈరోజు ప్రజాపాలన ఏర్పడిందన్నారు. ఈ నెల 8,9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు ప్రధాని మోడీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జునఖర్గేను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లాల్సి ఉందన్నారు. ఖమ్మం జిల్లా ఇచ్చే ఉత్సాహంతోనే తెలంగాణను అగ్రభాగంలో నిలుపుతామన్నారు. హెలికాప్టర్‌ సమస్య వల్ల ఈసారి పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో మరోసారి వస్తానంటూ సీఎం ప్రసంగం ముగించారు.

దేశానికే తలమానికం ఎర్త్‌సైన్సెస్‌ యూనివర్సిటీ.. మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి
దేశానికే తలమానికం అయిన డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఎర్త్‌సైన్సెస్‌ యూనివర్సిటీని ప్రపంచస్థాయికి తీసుకెళ్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. త్వరలోనే ఈ విశ్వవిద్యాలయానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా సంపూర్ణంగా నిలబడటంతోనే ఈ ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయటంతోపాటు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌, రైల్వేలైన్‌, విమానాశ్రయంతోపాటు ప్రపంచానికి దీటుగా ఉండే.. ఎర్త్‌సైన్స్‌స్‌ యూనివర్సిటీని జిల్లాలో నెలకొల్పినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఖనిజ సంపద ఉన్న ప్రాంతానికి ఎర్త్‌సైన్సెస్‌ యూనివర్సిటీ ఇచ్చినందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, ఖమ్మం, భద్రాచలం ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్‌, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, సత్తుపల్లి, ఇల్లెందు, వైరా, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, మట్టా రాగమయి, కోరం కనకయ్య, మాళోత్‌ రాందాస్‌నాయక్‌, జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌, వివిధ కార్పొరేషన్‌ల చైర్మెన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, మువ్వా విజరుబాబు, అదనపు కలెక్టర్‌ విద్యాచందన, వేణుగోపాల్‌, ఆర్డీవో మధు, ప్రిన్సిపాల్‌ జగన్మోహన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -