Wednesday, December 3, 2025
E-PAPER
Homeజాతీయంమరో స్పైవేర్‌ !

మరో స్పైవేర్‌ !

- Advertisement -

‘సంచార్‌ సాథీ’ యాప్‌పై వెల్లువెత్తుతున్న ఆగ్రహం
గోప్యత, స్వేచ్ఛను హరిస్తుందని మండిపాటు


న్యూఢిల్లీ : దేశంలో ఇకపై విక్రయించే ప్రతి సెల్‌ఫోన్‌లోనూ విధిగా ప్రభుత్వానికి చెందిన సైబర్‌ సెక్యూరిటీ యాప్‌ ‘సంచార్‌ సాథీ’ని ముందుగానే ఇన్‌స్టాల్‌ చేయాలంటూ ఫోన్‌ తయారీదారులు, దిగుమతిదారులకు టెలికం శాఖ జారీ చేసిన తాజా ఆదేశాలపై సర్వత్రా ఆందో ళన వ్యక్తమవుతోంది. 90 రోజుల లోగా ఈ నిబంధనను పాటించాలని టెలికం శాఖ నిర్దేశించింది. నిబంధనలను అమలు చేసినట్లు 120 రోజుల లోగా సంబంధిత కంపెనీలు నివేది కలు అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అమ్మిన ఫోన్లలో సైతం సాఫ్ట్‌వేర్‌ను ఆప్‌డేట్‌ చేసి, యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయాలని టెలికం శాఖ స్పష్టం చేసింది.

ఫోన్‌ వినియోగదారులకు స్పష్టంగా కన్పించేలా యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయాలని సూచించింది. వినియోగదారులు ఆ యాప్‌ను తొలగించడం సాధ్యపడదని తొలుత చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత విమర్శలు పెల్లు బకడంతో మాట మార్చింది. యాప్‌ ఐచ్ఛికమని, వినియోగదారులు కావాలనుకుంటే దానిని తొలగించవచ్చునని టెలీకమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరణ ఇచ్చారు. అయితే ప్రభుత్వం తన అధికారిక నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోకపోవడంతో యాప్‌ను విధిగా ఇన్‌స్టాల్‌ చేయాల్సిందేనని, దానిని తొలగించడం కుదరదని తేలిపోయింది. ప్రస్తుతం మన దేశంలో యాపిల్‌, శామ్‌సంగ్‌, గూగుల్‌, వివో, ఒప్పో, షియోమీ వంటి ప్రధాన కంపెనీలు సెల్‌ఫోన్లను తయారు చేస్తున్నాయి. వీటికి టెలికం శాఖ తాజా ఆదేశాలు వర్తిస్తాయి.

గోప్యత ఇక హుళక్కే
సిమ్‌కార్డు ఉన్న ఫోన్‌లోనే వాట్సాప్‌, ఇతర మెస్సేజింగ్‌ యాప్‌ల సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు తాజాగా సంచార్‌ సాథీ యాప్‌ను ముందుకు తెచ్చింది. అయితే ఈ రెండు చర్యలు వివాదాస్పదం అయ్యాయి. ప్రభుత్వం చెబుతున్న దానిని ఎవరూ విశ్వసించడం లేదు. ఫోన్‌ వంటి వ్యక్తిగత పరికరంలో ఓ విండోను ప్రారంభించడం అంటే వినియోగదారులకు ఉన్న గోప్యత హక్కును హరించడమే అవుతుందని పలువురు విమర్శించారు. మన కాల్‌ లాగ్స్‌, సందేశాలు, వీడియోలు, ఫొటోలు… ఇలా అన్నింటినీ సంచార్‌ సాథీ యాప్‌ రికార్డు చేస్తుంది. యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయగానే అది వినియోగదారుని ఫోన్‌ ఐఎంఈఐని సీఈఐఆర్‌తో కలుపుతుంది. సీఈఐఆర్‌ అనేది ఓ డేటాబేస్‌. అది దేశంలోని ప్రతి చట్టబద్ధమైన ఫోన్‌నూ రికార్డు చేస్తుంది. ఈ యాప్‌ ద్వారా పోయిన ఫోన్‌ను తిరిగి రికవరీ చేయవచ్చునని, చోరీకి గురైన ఫోన్లను బ్లాక్‌ చేయవచ్చునని, తప్పుడు మొబైల్‌ కనెక్షన్లను తొలగించ వచ్చునని ప్రభుత్వం చెబుతోంది.

నిఘా నీడలో…
ఫోన్‌ వినియోగదారులకు ఈ యాప్‌ ఎంతో ఉపయోగకరమని ప్రభుత్వం ఇస్తున్న వివరణ ఎవరినీ సంతృప్తి పరచడం లేదు.ఎందుకంటే కొన్ని నియంతృత్వ దేశాలు తమ వినియోగదారుల ఫోన్లలో ఇలాంటి యాప్‌లనే ఇన్‌స్టాల్‌ చేయించాయి. తద్వారా వారి సంభాషణలను, వారికి సంబంధించిన చిత్రాలను, వీడియోలను రికార్డు చేయిస్తున్నాయి. ఇదే మన వినియోగదారుల ఆందోళనకు కారణమవుతోంది. ప్రభుత్వమే కాదు…సంస్థలు, వ్యక్తులు సైతం ఈ యాప్‌లో ప్రవేశించి వివిధ మార్గాల ద్వారా ఫోన్లను పర్యవేక్షించవచ్చు. ఇది గోప్యత పైన, స్వేచ్ఛ పైన జరుగుతున్న దాడి అని రాజకీయ విశ్లేషకుడు, సామాజిక కార్యకర్త, వ్యాపారి తెహసీన్‌ పూనావాలా మండిపడ్డారు. భద్రత పేరుతో పజల ఫోన్‌ కాల్స్‌, సందేశాలు, వారు ఉన్న ప్రాంతంపై ప్రభుత్వం నిఘా వేస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజలపై నిరంతరం నిఘా వేస్తుందని, వారిని నేరస్థులుగా చూస్తుందని అంటూ దీనిపై అందరూ పోరాడాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.

రహస్య మెమోతో మొదలై…
టెలికం శాఖ జారీ చేసిన ఆదేశాలు గోప్యత హక్కుకు భంగకరమని ప్రతిపక్షాలు, నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి టెలీకమ్యూనికేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వం జనవరిలోనే సంచార్‌ సాథీ యాప్‌ను ప్రారంభించింది. టెలికం వనరులు సైబర్‌ మోసాలకు గురికాకుండా చూసేందుకు, టెలికం సైబర్‌ సెక్యూరిటీని పరిరక్షించేందుకు ఈ యాప్‌ను తీసుకొచ్చామని చెప్పింది. ఫోన్‌ తయారీదారులకు టెలికం శాఖ తొలుత ఓ రహస్య మెమో ద్వారా యాప్‌ను గురించి సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత రాయిటర్స్‌ వార్తా సంస్థ దానిని లీక్‌ చేసింది. ఇప్పుడు తాజాగా ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) పత్రికా ప్రకటన ద్వారా దానిని అధికారికంగా ధృవీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -