రూపాయి చారిత్రాత్మక పతనం
ఒక్క పూటలోనే 42 పైసలు ఢమాల్
సెన్సెక్స్ 500 పాయింట్ల క్షీణత
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రోజు రోజుకు రూపాయి విలువ చారిత్రాత్మక పతనాన్ని చవి చూస్తోంది. ఇది వరకూ ఎప్పుడూ లేని స్థాయిలో మంగళవారం ఇంట్రాడేలో డాలర్‌తో పోల్చితే ఏకంగా 90కి పతనమయ్యింది. అమెరికా, భారత్ మధ్య చోటు చేసుకుంటున్న టారిఫ్ ఆందోళనలు, దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడం రూపాయి విలువను పాతాలానికి నెట్టుతోంది. మరోవైపు భారత స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను తరలించుకుపోవడంతో, యూఎస్-భారత్ వాణిజ్య ఒప్పందంలో అనిశ్చితి రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 42 పైసలు పతనమై 89.61 దిగజారింది. ఫారెక్స్ మార్కెట్‌లో ఉదయం 89.70 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఓ దశలో 47 పైసలు కోల్పోయి క్షీణించి 90కి పడిపోవడం తీవ్ర ఆందోళనకరం. ఇంతక్రితం సోమవారం సెషన్‌లో 8 పైసలు తగ్గి 89.53గా నమోదయ్యింది.
టెక్నికల్‌గా రూపాయి మద్దతు లేనందున అతి త్వరలోనే డాలర్‌తో రూపాయి 91కి పడిపోవచ్చని కొటాక్ సెక్యూరిటీస్ కమోడిటీ, కరెన్సీ మెడ్ అనింద్య బెనర్జీ పేర్కొన్నారు. దీనిని సెంట్రల్ బ్యాంక్ తక్షణమే కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రూపాయి విలువ పతనం భారత దిగుమతులను మరింత భారం చేయనున్నాయి. మరోవైపు విదేశీ చెల్లింపుల వ్యయం అమాంతం పెరిగిపోనుంది. భారత్‌పై అమెరికా వేసిన భారీ టారిఫ్‌లకు తోడు, విదేశీ నిధులు బయటకు తరలిపోవడం, డాలర్ల కొనుగోళ్లకు దిగుమతిదారులు మొగ్గు చూపడం, రూపాయి పతనాన్ని కట్టడి చేయడంలో మోడీ సర్కార్ విఫలం కావడం తదితర పరిణామాలు దేశీయ కరెన్సీని అగాథంలోకి నెట్టుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 0.25 శాతం తగ్గి 63.03 వద్ద నమోదయ్యింది. మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 503.63 పాయింట్లు కోల్పోయి 85,138 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 144 పాయింట్ల నష్టంతో 26,032కు పరిమితమయ్యింది. సోమవారం సెషన్‌లో విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.1,171.31 కోట్లు తరలించుకుపోయారు. ఇది కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచుతోంది.



