Wednesday, December 3, 2025
E-PAPER
Homeజాతీయంనెల్లూరు జిల్లా బంద్‌ సక్సెస్‌

నెల్లూరు జిల్లా బంద్‌ సక్సెస్‌

- Advertisement -

వర్షం పడుతున్నా రోడ్డుపైకి వచ్చి వేలాదిగా మద్దతు
స్వచ్ఛందంగా దుకాణాలు, వ్యాపార, విద్యా సంస్థలు మూసివేత
పెంచలయ్య హత్యను నిరసిస్తూ వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యాన ర్యాలీలు
టిడిపి, వైసిపి సంఘీభావం

నెల్లూరు: ప్రజాగాయకులు, సిపిఎం నాయకులు కె.పెంచలయ్య హత్యకు నిరసనగా మంగళవారం నెల్లూరు జిల్లా బంద్‌ విజయవంతమైంది. సిపిఎం ఇచ్చిన బంద్‌ పిలుపునకు నెల్లూరు నగరంతోపాటు, జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి భారీ మద్దతు లభించింది. దిత్వా తుపాను ప్రభావంతో జోరు వర్షం కురుస్తున్నా జిల్లా వ్యాప్తంగా వేలాదిగా ప్రజలు రోడ్డుపైకి వచ్చి బంద్‌లో పాల్గొన్నారు. సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్‌, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమొక్రసీ, ఆర్‌పిఐ, కాంగ్రెస్‌, బిఎస్‌పి, ఇసికెతోపాటు డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, కెవిపిఎస్‌, ఎంఆర్‌పిఎస్‌, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు బంద్‌ విజయవంతానికి కృషి చేశాయి. బంద్‌లో భాగంగా జోరు వర్షంలోనూ ర్యాలీలు నిర్వహించారు. టిడిపి, వైసిపి సంఘీభావం ప్రకటించాయి. దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసి బంద్‌కు మద్దతు తెలిపారు. వ్యాపార, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు మూతబడ్డాయి. నెల్లూరు నగరంలోని వర్తకులు, వ్యాపారులు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రయివేటు బస్సులు కూడా తిరగలేదు. నెల్లూరు నగరంలో నిర్వహించిన ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘ఖబడ్దార్‌… ఖబడ్దార్‌.. గంజాయి గూండాల్లారా… గంజాయి అంతం.. సిపిఎం పంతం… జోహార్‌ పెంచలయ్య… సాధిద్దాం… సాధిద్దాం.. పెంచలయ్య ఆశయాలను.’ అంటూ సింహపురి మారుమోగింది. ఆర్‌టిసి కాంప్లెక్స్‌్‌ వద్ద నిరసన తెలిపారు. సుందరయ్య కాలనీ వద్ద జాతీయ రహదారిపై ధర్నాతో కొద్దిసేపు వాహనాలు నిలిచిపోయాయి. ఆత్మకూరు బస్టాండ్‌ నుంచి గాంధీబొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ఆందోళన నిర్వహిస్తున్న సిపిఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో, పోలీసులకు, సిపిఎం శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో, పోలీసు వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ తర్వాత కత్తి శ్రీనివాసులును పోలీసులు విడుదల చేశారు. బంద్‌ నిర్వహిస్తుండగా మర్రిపాడు మండల కేంద్రంలోనూ సిపిఎం నాయకులకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. కందుకూరు, గుడ్లూరు, ఉలవపాడు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు, ఎఎస్‌పేట, అనంతసాగరం, సంగం, విడవలూరు కొడవలూరు, బుచ్చి, కోవూరు, టిపి గూడూరు, ఇందుకూరుపేట, ముత్తుకూరు, పొదలకూరు, బిట్రగుంట, అల్లూరు, దగదర్తి ప్రధాన కేంద్రాల్లో బంద్‌ విజయవంతంగా సాగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -