– నిర్లక్ష్యం, ఆలస్యం వల్లే ప్రమాదం తీవ్రం
– బాధితులకు రూ. 5 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో జరిగిన అగ్ని ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)లో ఫిర్యాదు దాఖలైంది. ఈ ఘటనలో తెలంగాణ ప్రభుత్వం, అగ్ని మాపకశాఖ నిర్లక్ష్యమే కారణమని మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని మంగళవారం ఫిర్యాదు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి దాదాపు 30 దుకాణాల్లో ప్లాస్టిక్ ఆటవస్తువులు, బొమ్మలు ఇతర సామగ్రి కాలిపోయాయని పేర్కొన్నారు. ఈ ఘటన తీవ్రతరం కావడానికి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, అగ్నిమాపక శాఖ జాప్యమే కారణమని అన్నారు. తొలి షాపులో మంటలు ప్రారంభం కాగానే ఫైర్ స్టేషన్‌కు బాధితులు కాల్ చేశారని, కానీ రెండు ఫైరింజన్లు సకాలంలో రాలేదని, దూర ప్రాంతం నుంచి ఫైర్ ఇంజన్ వచ్చే సరికి భారీ నష్టం జరిగిందని ఫిర్యాదులో వివరించారు. అందువల్ల బాధితులకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తాత్కాలిక పరిహారం ఇవ్వాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్‌ను ఆదేశించాలని కోరారు. అలాగే.. జగిత్యాల జిల్లాకు ఫైర్ స్టేషన్, ఫైర్ ఇంజిన్, సిబ్బందిని కేటాయించాలని అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్ ను కోరారు. ఫిర్యాదును స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ త్వరలో విచారణ చేపట్టనున్నట్టు రామారావు తెలిపారు.
కొండగట్టు అగ్ని ప్రమాదం పై ఎన్‌హెచ్‌ఆర్‌సి లో ఫిర్యాదు
- Advertisement -
- Advertisement -



