Wednesday, December 3, 2025
E-PAPER
Homeజాతీయం'సంచార్‌ సాథీ' మంటలు

‘సంచార్‌ సాథీ’ మంటలు

- Advertisement -

ఉభయసభల్లో నిరసనల పర్వం
దేశ ప్రజల గోప్యతపై దాడి అంటూ ప్రతిపక్షాల ఆందోళన
విస్తృత చర్చ జరగాలని కాంగ్రెస్‌, సీపీఐ(ఎం) డిమాండ్‌


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
‘సంచార్‌ సాథీ’ అంశం పార్లమెంట్‌ ఉభయసభల్ని కుదిపేసింది. ఈ యాప్‌ ప్రజల ప్రైవసీని కేంద్రం హరించడమేనని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్లలో సంచార్‌ సాథీ యాప్‌ను ప్రీ-ఇన్‌స్టాల్‌ (డిఫాల్ట్‌గా) చేయాలంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అయితే దీనిపై చర్చకు తాము వ్యతిరేకం కాదని అధికార పక్షం వివరణ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు శాంతించలేదు. కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), శివసేన, టీఎంసీ ఈ యాప్‌ను తీవ్రంగా విమర్శించాయి. ఇది.. ప్రజల ప్రైవసీ ఉల్లంఘనే అంటూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలాయి.

దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌, సీపీఐ(ఎం)లు దీని మీద వాయిదా తీర్మానం ఇచ్చి సంచార్‌ సాథీపై విస్తృత చర్చ జరగాలని డిమాండ్‌ చేశాయి. సంచార్‌ సాథీ యాప్‌.. ఫోన్‌ యూజర్ల కదలికల్ని, మెసేజెస్‌, కాల్స్‌ మానిటర్‌ చేస్తుందని విమర్శించాయి. రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ రేణుకాచౌదరి, సీపీఐ(ఎం) ఎంపీ శివదాసన్‌ దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చారు. ”గోప్యతా హక్కు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 కింద హామీ ఇవ్వబడిన జీవించే ప్రాథమిక హక్కు. వ్యక్తిగత స్వేచ్ఛ అంతర్గత అంశం. పౌరుల ప్రతి కదలికను నిఘాలో ఉంచే ప్రమాదం ఉంది” అని అన్నారు.

గూఢచర్య యాప్‌ : ప్రియాంకాగాంధీ
”సంచార్‌ సాథీ ఒక గూఢచర్య యాప్‌. ఇది హాస్యాస్పదంగా ఉంది. పౌరులకు గోప్యత హక్కు ఉంది. దాన్ని తుంగలో తొక్కుతోంది. దేశం నియంతృత్వం చేతుల్లోకి వెళ్తోంది. ఫోన్లపై నిఘానో, సంచార్‌ సాథీ యాప్‌ విషయమో కాదు. అన్ని అంశాల్లో నియంతృత్వం వైపు తీసుకెళ్తున్నారు” ఇదొక డిస్టోపియన్‌ టూల్‌ :కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌ ”ఈ యాప్‌ డిస్టోపియన్‌ టూల్‌. ఇది ప్రతి భారతీయుడిని మానిటర్‌ చేయడమే కాకుండా.. వారి ఆర్థిక హక్కులపై దాడి చేయడమే. దీని అమలు రాజ్యాంగ విరుద్ధం.

ప్రజల గోప్యతపై దాడి : సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌బ్రిట్టాస్‌
”సంచార్‌ సాథీ యాప్‌ వాడకం ప్రజల గోప్యతపై స్పష్టమైన దాడినే. ఇది సుప్రీంకోర్టు 2017లో ఇచ్చిన పుట్టస్వామి తీర్పును ఉల్లంఘించడమే. ముందే ఇన్‌స్టాల్‌ చేయబడింది. తొలగించబడదు, అంటే 120 కోట్ల పరికరాలకు ఇది తప్పనిసరి. ఇది మరొక రకమైన నిఘా. తదుపరి దశ, యాంగిల్‌ మానిటర్లు, బ్రెయిన్‌ చిప్‌లను ఉంచడం లాంటిది. ప్రజలు చెప్పే, ఆలోచించే ప్రతి క్షణాన్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. గతంలో పెగాసస్‌కు సంబంధించిన ఘటనలు జరిగాయి.

కేంద్ర ప్రభుత్వం దానికి సహకరించలేదని సుప్రీంకోర్టు తెలిపింది. రాష్ట్ర సంస్థలు పరికరాన్ని యాక్సెస్‌ చేస్తున్నాయంటే హ్యాకింగ్‌ ప్రయత్నాలు చేస్తున్నాయని ఐఫోన్‌ వినియోగదారులకు హెచ్చరికలు వచ్చాయి. వారు దర్యాప్తు చేసి 2-3 ఏండ్లకు పైగా అయింది. కానీ ఫలితం ఏమిటి? ఇప్పుడు వారు దానిని పోలీసు రాజ్యంగా మారుస్తున్నారు” ఈ యాప్‌పై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సాగరిక ఘోష్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ప్రభుత్వంపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తుందని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -