– హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు
– ఉపాధ్యాయ సంఘాల హర్షం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం నోషనల్ సీనియార్టీని కల్పించింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి ఎన్ శ్రీధర్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. మోడల్ స్కూళ్లలో రెండో విడతలో నియామకమైన ఉపాధ్యాయులకు మెరిట్ ఆధారంగా సమన్యాయం జరిగేలా నోషనల్ సీనియార్టీని కల్పిస్తున్నట్టు తెలిపారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లలో సుమారు మూడు వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే ఈ ఉత్తర్వుల ప్రకారం కోర్టును ఆశ్రయించిన 1,326 మంది ఉపాధ్యాయులకు మాత్రమే ప్రయోజనం కలగనుంది. మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయులు ఒకే నోటిఫికేషన్ అయినప్పటికీ వివిధ దశల్లో నియామకమయ్యారు. దీంతో ఉపాధ్యాయుల మధ్య వేతన వ్యత్యాసం ఏర్పడింది. 2014లో నియామకమైన నర్సింహారెడ్డితోపాటు 128 మంది ఉపాధ్యాయులు హైకోర్టును తొలుత ఆశ్రయించారు. విచారణ తర్వాత 2013లో నియామకమైన ఉపాధ్యాయులతో సమానంగా 2014లో నియామకమైన పిటిషనర్లకు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి మూలవేతనం సమానంగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లకే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఆ తీర్పు తర్వాత మిగిలిన 1,198 మంది ఉపాధ్యాయులు కూడా కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ తర్వాత ఈ ఏడాది జులై ఒకటి నుంచి ఆ ప్రయోజనాలను అమలు చేయాలని కోరింది. దీంతో 1,326 మంది మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు నోషనల్ సీనియార్టీ లభించనుంది. ఈ ఉత్తర్వుల పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
ఎట్టకేలకు మోడల్ స్కూల్ టీచర్లకు సమన్యాయం : టీఎస్‌యూఎఫ్
ఒకే పరీక్ష ద్వారా ఎంపికై రెండు విడతల్లో నియామకమైన మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు మెరిట్ ఆధారంగా సమన్యాయం జరిగేలా నోషనల్ సీనియార్టీని కల్పిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) హర్షం వ్యక్తంచేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్ ఒక ప్రకటన విడుదల చేశారు. 12 ఏండ్లుగా జరిగిన అన్యాయం సరిదిద్దబడిందని తెలిపారు. కానీ నోషనల్ సీనియార్టీ వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను వాస్తవంగా నియామకమైన తేదీ నుంచి కల్పించాలని పేర్కొన్నారు. అందుకు భిన్నంగా ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి/జులై ఒకటి నుంచి మాత్రమే కల్పించడం అన్యాయమని తెలిపారు. ఈ ఉత్తర్వులను సవరించి నిబంధనల మేరకు నియామకపు తేదీ నుంచి ఆర్థిక ప్రయోజనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
మోడల్ స్కూల్ టీచర్లకు న్యాయం : టీఎస్‌ఎంఎస్‌టీఎఫ్
ఎట్టకేలకు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు న్యాయం జరిగిందని టీఎస్‌ఎంఎస్‌టీఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్ మహేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకే నోటిఫికేషన్‌తో ఎంపికై వివిధ దశల్లో నియామకమైన ఉపాధ్యాయుల వేతనాల్లో వ్యత్యాసం ఉండడం సరైంది కాదని తెలిపారు. తొలుత నియామకమైన టీచర్లతో సమానంగా నోషనల్ సీనియార్టీని కల్పిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులిచ్చిందని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి ధన్యవాదాలు : టీఆర్టీఎఫ్
2014 సెప్టెంబర్‌లో నియామకమైన మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 2013 జూన్ మొదటి విడతలో నియామమైన టీచర్లతో సమానంగా పే, సీనియార్టీని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి ఎం అంజిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉత్తర్వులతో మోడల్ స్కూల్ టీచర్లకు ఊరట లభించిందని పేర్కొన్నారు.
చారిత్రాత్మక నిర్ణయం : టీఎంఎస్టీఏ
విద్యాశాఖ ఉత్తర్వుల వల్ల లబ్ధి పొందుతున్న ఉపాధ్యాయులు 1,326 మంది ఉన్నారని టీఎంఎస్టీఏ అధ్యక్షులు భూతం యాకమల్లు, ప్రధాన కార్యదర్శి కె నగేశ్ తెలిపారు. ఇందులో పీజీటీలు 768 మం, టీజీటీలు 558 మంది టీచర్లున్నారని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
పీఎంటీఏటీఎస్ హర్షం
మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల నోషనల్ సర్వీస్‌తోపాటు పే పారిటీ వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల పీఎంటీఏటీఎస్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తరాల జగదీశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం వల్ల మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు మూలవేతనం పెరుగుతుందని తెలిపారు. 2013 జూన్ నుంచి 2014 సెప్టెంబర్ వరకు సర్వీస్ కూడా కలవడం వల్ల లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
మోడల్ స్కూల్ టీచర్లకు నోషనల్ సీనియార్టీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



