Wednesday, December 3, 2025
E-PAPER
Homeజాతీయంప్రతి పౌరుడినీ అనుమానంలోకి నెడుతున్నారు!

ప్రతి పౌరుడినీ అనుమానంలోకి నెడుతున్నారు!

- Advertisement -

సామూహికంగా సవరణలు ఎలా చేపడతారు ?
వలసలు ప్రాతిపదిక కారాదు
పౌరసత్వాన్ని పరిశీలించే అధికారాన్ని ఎలా తీసుకుంటారు
సర్‌పై పలు పిటిషన్లను విచారించిన సుప్రీం
4వ తేదీకి వాయిదా

న్యూఢిల్లీ : ఎన్నికల కమిషన్‌ ఇటీవల చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీం కోర్టు మంగళవారం విచారించింది. పిటిషనర్ల తరపున న్యాయవాది ఎ.ఎం.సింఘ్వి వాదనలు వినిపిస్తూ, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 21(3) కింద నిర్వహించే ప్రత్యేక సవరణలు అనేవి ఎవరికి వారికి వ్యక్తిగతంగా వుండాలి తప్పితే సామూహికంగా చేపట్టరాదని అన్నారు. అయినా వలస అనేది మానవుల లక్షణమని, దాన్ని సర్‌కు ఒక ప్రాతిపదికగా వాడుకోరాదని అన్నారు. పైగా సర్‌ ప్రక్రియ పౌరులను ‘ఊహాజనిత పౌరసత్వ జాబితా’లో వుంచుతోందని ఆయన వ్యాఖ్యానించారు. దీనికింద ఈ దేశంలో నివసించే ప్రతి పౌరుడూ తాను నిజంగా భారతీయ పౌరుడినే అని నిరూపించుకోవాల్సి వుంటుందని అన్నారు. ముందస్తు నోటీసులేవీ పంపకుండానే ఒక పౌరుడిని ‘గెస్ట్‌ లిస్ట్‌’లో పెడుతోందని అన్నారు.

ఎన్నికల కమిషన్‌ తనకు తానుగా పౌరసత్వాన్ని పరిశీలించే అధికారాన్ని తీసుకుందని అన్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ బాగ్చి జోక్యం చేసుకుంటూ, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 25 కింద పేర్కొన్న పద్ధతిలో సర్‌ను కచ్చితంగా నిర్వహించాలని ఏమైనా చట్టబద్ధమైన నిబంధనలు వున్నాయా లేదా మన అవసరాలు లేదా కారణాల ప్రాతిపదికన సర్‌ నిర్వహణకు ఈసీ చర్యలు తీసుకోవచ్చా అని ప్రశ్నించారు. వేగంగా పెరిగిపోతున్న పట్టణీకరణ, తరచుగా వలసలు వెళ్ళిపోవడం వల్లనే సర్‌ నిర్వహించాల్సిన పరిస్థితులు వచ్చాయని ఈసీ చెబుతోందని, కానీ ఇవన్నీ సర్వసాధారణమైనవని అన్నారు. వలసలనేవి మానవ జీవితంలో అత్యంత సాధారణమైన అంశమన్నారు. పైగా భారతదేశంలో ఎక్కడ గ్రామీణ ప్రాంతం ముగుస్తుందో, ఎక్కడ పట్టణ ప్రాంతం ప్రారంభమవుతుందో మనకు తెలియదని అన్నారు. ఇటువంటి అంశాన్ని సర్‌కు ప్రాతిపదికగా చేయలేమన్నారు.

నియంతగా ఈసీ
అనంతరం న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తన వాదనలు వినిపిస్తూ, ఓటర్ల జాబితాలను మెషిన్‌ రీడబుల్‌ ఫార్మాట్‌లో ఎందుకు వుంచరాదని, పారదర్శకతను ఎందుకు ఎంచుకోవడం లేదని ప్రశ్నించారు. సర్‌ ప్రక్రియ పూర్తిగా పౌరసత్వ పరీక్షగా వుందని వ్యాఖ్యానించారు. 1950లో తొలి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ పరిశుద్ధమైన దేశం నుంచి ఆ ఎన్నిక నిర్వహించింది. కానీ, ఇప్పుడు గతంలో ఎన్నడూ సిద్ధం చేయని రీతిలో ఓటర్ల జాబితాను ఎస్‌ఐఆర్‌ పేరిట కొత్తగా రూపొందిస్తోంది. ఎందుకు ఇంత హడావిడి? 30మంది బీఎల్‌ఓలు తమ ప్రాణాలను తీసుకునే పరిస్థితిని ఎందుకు సృష్టించారు?” అని ప్రశాంత్‌ భూషణ్‌ ప్రశ్నించారు.

ఎన్యూమరేషన్‌ ఫారాలు భర్తీ చేయడానికి చిన్న చిన్న విండోలు, పైగా హడావిడిగా సర్‌, మెషిన్‌ రీడబుల్‌ ఫార్మాట్‌ల్లో లేని ఓటర్ల జాబితాలు ….ఇసికి మీరు గనక అధికారాలు ఇస్తే, కచ్చితంగా నిరంకుశంగా వ్యవహరిస్తుం దని ఆయన వాదించారు. ఈ దశలో చీఫ్‌ జస్టిస్‌ జోక్యం చేసుకుని ప్రశాంత్‌ భూషణ్‌ తన వాదనలకే పరిమితం కావాలని సూచించారు.
పలు పిటిషన్లపై వాదనలు విన్న అనంతరం డిసెంబరు 4వ తేదీకి తదుపరి విచారణను బెంచ్‌ వాయిదా వేసింది.

మూకుమ్మడి ఓటు తొలగింపు ఆరోపణలు తోసిపుచ్చిన ఈసీ
తమిళనాడులో 95.65శాతం ఓటర్లు, పశ్చిమ బెంగాల్‌లో 99.77శాతం ఓటర్లు ఇప్పటికే తమ ఎన్యూమరేషన్‌ ఫారాలు పూర్తిచేసి అందచేశారని ఎన్నికల కమిషన్‌ తెలియచేసింది. ఈమేరకు సుప్రీంలో వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేసింది. మూకుమ్మడిగా ఓట్ల తొలగింపు ఆరోపణలు తోసిపుచ్చింది. ఇప్పటివకే 58.7శాతం ఎన్యూమరేషన్‌ ఫారాలు తమకు అందాయని, వాటిని డిజిటలైజ్‌ చేశామని తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో 30శాతం ఓటర్లను మినహాయించారని చేసిన వాదననలు ఈసీ తిరస్కరించింది. బెంగాల్‌లో 70.14 శాతం ఫారాలు అందాయని తెలిపింది.

అనుమానంతో దేశమే కాకుండా చేస్తారా?
”సర్‌ ఒక వారసత్వ రికార్డును సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఇది తరతరాలుగా వ్యవస్థాగతంగా ఓటు హక్కును కోల్పోయేందుకు దారి తీస్తుంది.” అని న్యాయవాది వృందా గ్రోవర్‌ పేర్కొన్నారు. ”ఒక అనుమానం తలెత్తడమనేది ఓటు హక్కును నిరాకరించడమే కాకుండా ఆ వ్యక్తికి తనదంటూ ఒక దేశం కూడా లేకుండా చేస్తుందా? ఒక అనుమానం, సందేహమే వారికి వారు వుండే దేశాన్ని లేకుండా చేస్తుంటే ఇక ఈ అధికారానికి ప్రాతిపదిక ఏమిటి?” అని ఆమె ప్రశ్నించారు. ”సర్‌ రాజ్యాంగ దార్శనికతను అసహనానికి గురి చేస్తోంది.” అని వ్యాఖ్యానిస్తూ ఆమె తన వాదనలు ముగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -