‘సర్’పై ఎన్నికల కమిషనర్ సంధు ఆందోళన
తుది ఆదేశాలలో కానరాని పౌరసత్వ చట్టం ప్రస్తావన
న్యూఢిల్లీ : బీహార్‌తో ప్రారంభించి దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (సర్)ను చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 24న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆదేశాలకు సంబంధించిన ముసాయిదాపై ఎన్నికల కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సంధు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నోట్ పెట్టారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక తెలియజేసింది. ‘నిజమైన ఓటర్లు/పౌరులు…ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వికలాంగులు, పేదలు, ఇతర బలహీన గ్రూపులు తాము వేధింపులకు గురవుతామేమోనని భావించకూడదు. వారికి సౌకర్యవంతంగా ఉండాలి’ అని సంధు ముసాయిదా ఆదేశాల ఫైలుపై రాశారు. ప్రస్తుతం ఓటర్లుగా ఉన్న వారందరూ ఎన్యూమరేషన్ పత్రాలు పూర్తి చేయాలని, కొన్ని వర్గాల వారు తమ అర్హతను నిరూపించుకోవడానికి అదనపు పత్రాలు సమర్పించాలని ఎన్నికల సంఘం నిర్దేశించడాన్ని దృష్టిలో పెట్టుకొని సంధు ఈ నోట్ పెట్టారని తెలుస్తోంది.
చివరికి ఆ ఫైలుపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సంతకం చేశారు. ఆదేశాలను అత్యవసరంగా జారీ చేయాల్సి ఉన్నందున ముసాయిదా ఆర్డర్‌ను అదేరోజు వాట్సప్‌లో ఆమోదించారు. జూన్ 24న తుది ఆదేశాలను బహిర్గతం చేసినప్పుడు అందులో ఓ సవరణను చేర్చారు. ముసాయిదా ఆదేశాలలో సర్‌ను పౌరసత్వ చట్టంతో ముడి పెట్టారు. అయితే తుది ఆదేశాలలో పౌరసత్వ చట్టం ప్రస్తావన తేలేదు. 2003లో ఆమోదించిన సవరణను 2004 నుంచి వర్తింపజేశారు. సంధు వ్యక్తం చేసిన ఆందోళనను పరిగణనలోకి తీసుకొని తుది ఆదేశాలు జారీ చేశారని అర్థమవుతోంది. ఆయన లేవనెత్తిన అంశాన్ని తుది ఆదేశాలలోని 13వ పారాగ్రాఫ్‌లో చేర్చారు. అయితే అందుకు ఆయనే కారకుడని చెప్పలేదు.
నిజమైన పౌరులకు వేధింపులా!
- Advertisement -
- Advertisement -



