Wednesday, December 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌లో పోటీదారుల జోరు

కాంగ్రెస్‌లో పోటీదారుల జోరు

- Advertisement -

అసంతృప్తులకు నేతల పదవుల ఎర
బీఆర్‌ఎస్‌లోనూ రెబల్స్‌ తిప్పలు
ఉత్కంఠ భరితంగా సూర్యాపేటలో నామినేషన్లు


నవ తెలంగాణ-సూర్యాపేట
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగుస్తుండటంతో స్థానికంగా రాజకీయ వేడి పెరిగింది. రెబల్స్‌ను బుజ్జగించేందుకు అన్ని పార్టీల నేతలు ‘ప్లీజ్‌.. ప్లీజ్‌” అంటూ ఇండ్లబాట పట్టినా చాలామంది అసంతృప్తులు వెనక్కి తగ్గే సూచనలు కనిపించకపోవడంతో పోటీ ఉత్కంఠభరితంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో తొలి విడతలో 8 మండలాల్లోని 159 గ్రామాల్లో 1384 మంది సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేశారు. 1442 వార్డులకు 3,771 మంది నామినేషన్లు వేశారు. ఈ క్రమంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు రెబెల్స్‌ను బుజ్జగించే పనిలో నిమగమయ్యారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి సర్పంచ్‌ అభ్యర్థులుగా గ్రీన్‌ సిగల్‌ పొందిన అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థుల ఇంటి బాట పడుతున్నారు. ‘ప్లీజ్‌.. ప్లీజ్‌ మాకు సహకరించండి’ అంటూ బతిమలాడుతున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలలో అసంతృప్తులు బరిలో ఉన్నారు. వారిని నిలవరించడానికి రాష్ట్ర, జిల్లా నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశాలతో పలు ప్రాంతాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు బుజ్జగించే పనిలో పడ్డారు. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో రెబల్స్‌ తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ వార్నింగ్‌లు ఇచ్చినా ఫలితం లేదు. కాంగ్రెస్‌ పార్టీలో పోటీదారుల జోరు అధికంగా ఉంది. పదేండ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సర్పంచ్‌ పదవికి పోటీదారుల లిస్ట్‌ భారీగా ఉంది. సూర్యాపేటలో మాజీ మంత్రి రామ్‌ రెడ్డి దామోదర్‌ రెడ్డి తనయుడు సర్వోత్తమ్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ కొప్పుల వేణారెడ్డి సంయుక్తంగా కలిసి బరిలో ఉన్న అభ్యర్థులను పిలిచి మాట్లాడుతున్నారు. తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల సామేల్‌కు రెబల్స్‌ తాకిడి అధికంగా ఉంది. ఇక్కడ మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి గ్రూపునకు చెందిన వారు చాలా చోట్ల నామినేషన్లు వేశారు. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుండటంతో ఆ సమయానికి లోపే అసంతృప్తులను చల్లార్చే పనిలో రెండు పార్టీల అధినాయకులు బిజీగా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -