నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రముఖ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్రభారతి ప్రాంగణంలో దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు తీవ్ర వివాదానికి దారితీసింది. డిసెంబర్ 15న ఎస్పీబీ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగా, తెలంగాణవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కళకు ప్రాంతీయ హద్దులు లేవని ఒక వర్గం వాదిస్తుండగా, ఇది తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని దెబ్బతీయడమేనని మరో వర్గం వాదిస్తుండటంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.తెలంగాణ సాంస్కృతిక కేంద్రంగా పేరొందిన రవీంద్రభారతిలో కేవలం తెలంగాణకు చెందిన ప్రముఖుల విగ్రహాలే ఉండాలని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్పీ బాలు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. “తెలంగాణ గడ్డపై ప్రజాకవి గద్దర్, ప్రముఖ కవి అందెశ్రీ వంటి మహానుభావులకు దక్కాల్సిన గౌరవం ముందు దక్కాలి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయడానికి మేం అంగీకరించబోం” అని పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన అనుచరులతో కలిసి విగ్రహ ఏర్పాటు పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ బాలు కుటుంబ సభ్యుడు, ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ రవీంద్రభారతికి చేరుకుని పృథ్వీరాజ్ కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కళాకారులను ప్రాంతాల వారీగా చూడటం సరికాదని, సంగీతానికి, కళకు హద్దులు ఉండవని సుధాకర్ పేర్కొన్నారు. “ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేవలం ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన తన గానంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని అలరించిన విశ్వ విఖ్యాత గాయకుడు. ఆయన సేవలను గౌరవించాల్సింది పోయి, ప్రాంతీయతను ఆపాదించడం కళను అవమానించడమే” అని శుభలేఖ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువురి మధ్య జరిగిన వాగ్వాదంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.



